సెలబ్రిటీల హక్కులకు సరిహద్దులేవి?
దీనికి సంబంధించిన అంతర్జాతీయ ప్రమాణాలు.. గత తీర్పులపై స్పష్టమైన రీసెర్చ్ పేపర్లు సమర్పించండని ఆదేశించడంతో ఈ అంశం యొక్క సంక్లిష్టతను చాటి చెబుతోంది.
By: Srikanth Kontham | 17 Oct 2026 9:00 PM ISTడిజిటల్ యుగంలో తారల వ్యక్తిగత గుర్తింపు తీవ్రమైన సవాల్ ని ఎదుర్కొంటోంది. అనుమతి లేకుండా పేరు.. రూపం.. గొంతును వాణిజ్య ప్రకటనల్లో.. వినోద మాధ్యమాల్లో వాడటంపై సెలబ్రిటీలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల బాలీవుడ్ నటి కృతి సనన్ వ్యక్తిత్వ హక్కుల రక్షణ కోరుతూ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించడం వినోదం.. చట్టపరమైన రంగాల్లో పెద్ద ఉత్తున చర్చకు దారితీసిన సంగతి తెలిసిందే. ఈ కేసు విచారణ సందర్భంగా జస్టిస్ పురుషైంద్ర కుమార్ కౌరవ్ ధర్మాసనం వ్యక్తిత్వ హక్కుల పరిధి ఎంతవరకు ఉంటుంది? దీనికి సంబంధించిన అంతర్జాతీయ ప్రమాణాలు.. గత తీర్పులపై స్పష్టమైన రీసెర్చ్ పేపర్లు సమర్పించండని ఆదేశించడంతో ఈ అంశం యొక్క సంక్లిష్టతను చాటి చెబుతోంది.
తారల వ్యక్తిగత హక్కలుకు సంబంధించి భారత్ న్యాయస్థానాలు గతంలోనే పలు చారిత్రాత్మక తీర్పులు ఇచ్చాయి . లెజెండ్ అమితాబ్ బచ్చన్ కేసులో ఢిల్లీ హైకోర్టు కీలక ఆదేశాలు ఇస్తూ ఆయన అనుమతి లేకుండా ఆయన గొంతు.. చిత్రం .. పేరును ఏ రకమైన వాణిజ్య ప్రయోజనాలకూ ఉపయోగించకూడదని స్పష్టం చేసింది. అలాగే సూపర్‌స్టార్ రజనీకాంత్,.. నటులు అజిత్.. అనిల్ కపూర్ వంటి తారలు కూడా తమ వాయిస్, క్లాసిక్ మేనరిజమ్స్‌ను ఏఐ టూల్స్ ద్వారా కాపీ కొట్టకుండా తమ హక్కులను పరిరక్షిం చుకుంటూ కోర్టుల నుంచి స్టే ఉత్తర్వులు సాధించారు.
డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లు విస్తరించిన తర్వాత బాలీవుడ్ నటులే కాకుండా పాన్-ఇండియా తారలు , ఇతర ప్రము ఖులు కూడా ఇమేజ్ ప్రొటెక్షన్ కోసం న్యాయస్థానాలను ఆశ్రయిస్తున్నారు. టాలీవుడ్ స్టార్స్ విజయ్ దేవరకొండ, పవన్ కళ్యాణ్, నటి కంగనా రనౌత్, సీనియర్ నటి టబులతో పాటు క్రికెటర్లు యువరాజ్ సింగ్, అభిషేక్ శర్మ, రాజకీయ నాయకుడు శశి థరూర్ వంటి ఎంతోమంది ప్రముఖులు తమ అనధికారిక డిజిటల్ వినియోగానికి వ్యతిరేకంగా చట్టపరమైన పోరాటం చేశారు. కోర్టులు కూడా వీరి హక్కులను గుర్తిస్తూ అనుమతి లేని వ్యాపార ప్రచారాలను అడ్డుకుంటూ అనుకూలమైన తీర్పులను ఇచ్చాయి.
అయితే ప్రతిరోజూ పదుల సంఖ్యలో సెలబ్రిటీలు ఇవే అభ్యర్థనలతో కోర్టు తలుపులు తడుడుతుండటంతో హక్కుల సరిహద్దులను చట్టబద్ధంగా ఖరారు చేయాల్సిన అవసరం ఏర్పడింది. కృతి సనన్ కేసులో ఢిల్లీ హైకోర్టు లేవనెత్తిన ప్రధాన ప్రశ్న ఏమిటంటే? ఒక వ్యక్తి గుర్తింపుకు ఏ స్థాయి వరకు చట్టపరమైన రక్షణ ఇవ్వాలి? ఇది హైకోర్టులోని ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ డివిజన్ పరిధిలోకి ఏ రకంగా వస్తుంది? అనే అంశాలపై పూర్తిస్థాయి న్యాయవిశ్లేషణ జరగాలని భావించి న్యాయవాదులను రీసెర్చ్ సమర్పించమని కోరింది.
హక్కుల పరిరక్షణలో మరో కీలకమైన సవాలు ఏమిటంటే? రాజ్యాంగం కల్పించిన భావప్రకటనా స్వేచ్ఛ , మీడియా హక్కుల సమతౌల్యం. ప్రముఖుల హక్కులను పరిరక్షించే క్రమంలో జర్నలిజం, పరోక్ష హాస్యం , మీమ్స్ , కళాత్మక సృజనాత్మకత లేదా వార్తా కవరేజీకి భంగం కలగకూడదనే కోణాన్ని కూడా కోర్టులు బేరీజు వేయాల్సి ఉంటుంది. అందుకే కేవలం ఒకరికే కాకుండా సమాజ హక్కులకు, సెలబ్రిటీల వ్యక్తిగత హక్కులకు మధ్య సమతుల్యతను సాధించేలా స్పష్టమైన నిబంధనలు రూపొందాల్సి ఉంది.
కృతి సనన్ పిటిషన్లో సమర్పించబోయే రీసెర్చ్ పేపర్లు .. గతంలో అమితాబ్ బచ్చన్, రజనీకాంత్ వంటి నటులకు లభించిన తీర్పుల ఆధారంగా ఢిల్లీ హైకోర్టు భవిష్యత్తులో ఇచ్చే మార్గదర్శకాలు అత్యంత ప్రాధాన్యత సంతరించుకోనున్నాయి. అక్టోబర్ 29న జరగనున్న తదుపరి విచారణలో వెలువడే నిర్ణయాలు భారతీయ సినీ రంగానికి.. డిజిటల్ మీడియాకు.. ఏఐ వినియోగానికి ఒక స్పష్టమైన చట్టపరమైన మార్గదర్శిగా నిలవడం ఖాయంగా కనిపిస్తోంది.
