సినిమా ఇండస్ట్రీలో పారితోషికాల వ్యత్యాసం!
సెట్‌లో వాతావరణం గురించి కూడా కృతి ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. హీరో షూటింగ్ సెట్‌లోకి రాకముందే హీరోయిన్ రెడీగా ఉండాలనే నియమం ఇండస్ట్రీలో ఉందన్నారు.
By: Srikanth Kontham | 12 May 2026 1:40 PM ISTఇండస్ట్రీలో పారితోషికాల మధ్య వ్యత్యాసం అన్నది నిరంతరం తెరపైకి వచ్చే అంశమే. ఒకరికి ఎక్కువ? మరోకరికి తక్కువ అన్నది ఎప్పుడూ చర్చనీయాంశంగానే ఉంటుంది. ఈ విషయంలో ఏ పరిశ్రమ మినహాయింపు కాదు. తాజాగా నేషనల్ అవార్డ్ విన్నర్ కృతి సనన్ లింగ వివక్ష , పారితోషికాల వ్యత్యాసం పై సంచలన వ్యాఖ్యలు చేశారు. దశాబ్ద కాలంగా పరిశ్రమలో కొనసాగుతున్నా? ఇప్పటికీ మహిళా నటీమణులు ఎదుర్కొంటున్న చిన్నచూపు పట్ల కృతి ఆవేదనను వ్యక్తం చేసారు. ముఖ్యంగా బడ్జెట్ విషయానికి వస్తే మొదటగా హీరోయిన్లనే టార్గెట్ చేస్తారనే వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి.
సినిమా నిర్మాణ వ్యయం పెరిగినప్పుడు లేదా బడ్జెట్‌లో కోత విధించాల్సి వచ్చినప్పుడు నిర్మాతలు మొదటగా చర్చలు జరిపేది హీరోయిన్ల పారితోషికాల పైనే అన్నారు. హీరోలకు బడ్జెట్‌లో సింహభాగం కేటాయించినా? వారి పారితోషికం విషయంలో రాజీ పడని మేకర్స్ హీరోయిన్లకు ఇచ్చే మొత్తాన్ని తగ్గించడానికి మాత్రం వెనుకాడరని అసంతృప్తిని వ్యక్తం చేసారు. ఇది కేవలం పారితోషికానికి సంబంధించిన విషయం మాత్రమే కాదని పరిశ్రమలో బలంగా పాతుకుపోయిన పితృస్వామ్య ధోరణికి నిదర్శనమని అభి ప్రాయపడ్డారు.
సెట్‌లో వాతావరణం గురించి కూడా కృతి ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. హీరో షూటింగ్ సెట్‌లోకి రాకముందే హీరోయిన్ రెడీగా ఉండాలనే నియమం ఇండస్ట్రీలో ఉందన్నారు. సెట్ లో హీరోయిన్ మాత్రమే ఎదురు చూడాలి. ఆమె ఆలస్యమవ్వడానికి లేదు. అదే హీరో అయితే? ఎంత ఆలస్యంగా వచ్చినా? పర్వాలేదు. వాళ్లను అడిగే వాళ్లు ఎవరూ ఉండరు. సెట్ లో ఈ సంస్కృతి మారాలన్నారు. నటీనటుల మధ్య గౌరవం సమానంగా ఉండాలని ఒకరు మరొకరి కోసం వేచి ఉండటంలో ఉన్న వివక్ష తొలగిపోవాలన్నారు.
కెరీర్ ఆరంభంలో ఎదురైన కొన్ని అనుభవాలను కూడా కృతి గుర్తు చేసుకున్నారు. తనతో సమాన స్థాయిలో ఉన్న ఒక హీరోకు మెరుగైన కార్ సౌకర్యం కల్పించగా తనకు మాత్రం తక్కువ స్థాయి సౌకర్యాలు ఇచ్చారని గుర్తు చేసుకున్నారు. ఇక్కడ సమస్య కారు గురించి కాదని ఇచ్చే గౌరవం , ప్రాధాన్యత అని అభిప్రాయపడ్డారు. నటీమణులు ఎంతటి విజయాన్ని అందుకున్నా? జాతీయ అవార్డులు గెలుచుకున్నా కూడా ఇలాంటి చిన్న చిన్న విషయాల్లో వివక్షకు గురికావడం బాధాకరమని పేర్కొన్నారు.
అయితే ప్రస్తుత పరిస్థితుల్లో కొంత మార్పు కనిపిస్తోందని కృతి సనన్ ఆశాభావం వ్యక్తం చేశారు. కంటెంట్ ఆధారిత చిత్రాలు , మహిళా ప్రధాన చిత్రాలు బాక్సాఫీస్ వద్ద విజయం సాధిస్తుండటంతో నిర్మాతల ఆలోచనా దృక్పథంలో మార్పు వస్తుందని నమ్ముతున్నారు. `క్రూ` వంటి చిత్రాల విజయం మహిళా నటీమణులకు కూడా భారీ బడ్జెట్, మార్కెట్ ఉందని నిరూపించిందని ఉదహరించారు. భవిష్యత్తులో కథానా యికలకు సమాన హోదా సమాన వేతనం లభించే దిశగా అడుగులు పడాలని కృతిసనన్ ఆశా భావం వ్యక్తం చేసారు.
