కృతి సనోన్ కంటే ముందే AI ముప్పు పసిగట్టిన టాప్-10 స్టార్లు
అయితే కృతి సనన్ కంటే ముందే హాలీవుడ్, ఇండియన్ చిత్రసీమలకు చెందిన పలువురు అగ్ర తారలు ఏఐ భయాలపై గళమెత్తారు.
By: Sivaji Kontham | 24 Oct 2026 9:48 AM ISTకృత్రిమ మేధస్సు (AI) సాంకేతిక పరిజ్ఞానం వేగంగా విస్తరిస్తున్న తరుణంలో చలనచిత్ర పరిశ్రమకు చెందిన పలువురు అగ్ర నటీనటులు- దిగ్గజ దర్శకులు దీని వల్ల కలిగే ముప్పుపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల బాలీవుడ్ యంగ్ హీరోయిన్ కృతి సనన్ ఓ ప్రయివేట్ చానెల్ సమ్మిట్‌లో `ది మేకింగ్ ఆఫ్ ఎ మోడర్న్ స్టార్` అనే అంశంపై ప్రసంగిస్తూ ఏఐ గురించి ప్రత్యేకంగా ప్రస్థావిస్తూ అది తమను భయపెడుతోందని వ్యాఖ్యానించారు. టెక్నాలజీ వృద్ధికి మద్దతు తెలిపినా.. ఏఐ అనేది ఎంత పదునైన సాధనమో అంత ప్రమాదకరంగా మారే అవకాశం ఉందంటూ హెచ్చరించారు.
డిజిటల్ భద్రత, వ్యక్తిగత హక్కుల పరిరక్షణకు ఏఐ విసిరే సవాళ్లను ఎదుర్కొనేందుకు చట్టపరమైన నిబంధనలు ఇంకా పూర్తిస్థాయిలో సిద్ధం కాలేదని కృతి సనన్ కుండబద్దలు కొట్టారు. అసలైన ఫోటోలకు, ఏఐ సృష్టించిన చిత్రాలకు తేడా గుర్తుపట్టలేనంతగా సరిహద్దులు చెరిగిపోతున్నాయని పేర్కొన్నారు. అంతేకాకుండా ఇన్స్టాగ్రామ్ వంటి సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో తమ రూపం లేదా డీప్‌ఫేక్స్ దుర్వినియోగం అయినప్పుడు రిపోర్ట్ చేయడానికి సరైన కేటగిరీలు లేదా ఆప్షన్లు కూడా లేకపోవడాన్ని తప్పుబట్టారు. సాంకేతికత పరిగెడుతున్నంత వేగంగా ప్లాట్‌ఫారమ్‌లు, చట్టాలు మారడం లేదని కృతి వ్యాఖ్యానించారు.
అయితే కృతి సనన్ కంటే ముందే హాలీవుడ్, ఇండియన్ చిత్రసీమలకు చెందిన పలువురు అగ్ర తారలు ఏఐ భయాలపై గళమెత్తారు. హాలీవుడ్లో స్కార్లెట్ జోహాన్సన్ , టామ్ హాంక్స్ వంటి ప్రముఖులు ఏఐ దుర్వినియోగంపై ఏకంగా చట్టపరమైన పోరాటాలు చేశారు. తన అనుమతి లేకుండా ఓపెన్ ఏఐ తన గొంతును అనుకరించే ప్రయత్నం చేసిందని స్కార్లెట్ జోహాన్సన్ ఆగ్రహం వ్యక్తం చేయగా.. తన రూపం- గొంతును ఏఐ డీప్‌ఫేక్స్ ద్వారా ఫ్రాడ్ ప్రకటనల్లో దుర్వినియోగం చేయడంపై టామ్ హాంక్స్ అభిమానులను హెచ్చరిస్తూ ఇటువంటి టెక్నాలజీ తీవ్ర భయాందోళనకు గురిచేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు.
దిగ్గజ దర్శకులు స్టీవెన్ స్పిల్బర్గ్, జేమ్స్ కేమరూన్ వంటి వారు సైతం ఏఐ ద్వారా సృష్టించే కంటెంట్ మానవ భావోద్వేగాలను, కళాత్మక ఆత్మను ఎప్పటికీ భర్తీ చేయలేదని తేల్చిచెప్పారు. నటుల హావభావాలు, గొంతును డిజిటల్‌గా కాపీ చేసి వాడుకోవడం వల్ల భవిష్యత్తులో ఆర్టిస్టులు, రచయితల ఉపాధి దెబ్బతింటుందనే భయంతో హాలీవుడ్లో ప్రధాన సంఘాలు భారీ సమ్మెలు కూడా చేపట్టాయి. టెక్నాలజీ అనేది ఒక సాధనంగా మాత్రమే ఉపయోగపడాలే తప్ప.. కళాకారుల ఉనికినే ప్రశ్నించేలా మారకూడదని వారు ఘాటుగా స్పష్టం చేశారు.
భారతీయ చిత్రసీమలో కూడా అనిల్ కపూర్, కమల్ హాసన్ వంటి సీనియర్ అగ్ర నటులు ఏఐ విషయంలో అత్యంత అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. అనిల్ కపూర్ తన పేరు, గొంతు, హావభావాలు ఏఐ ద్వారా దుర్వినియోగం కాకుండా ఉండేందుకు ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించి `పర్సనాలిటీ రైట్స్` రక్షణ పొంది ట్రెండ్ సెట్ చేశారు. మరోవైపు విశ్వనటుడు కమల్ హాసన్ ఏఐ సాంకేతికతను సినిమా రంగంలో సరైన రీతిలో ఎలా ఉపయోగించాలి, దానివల్ల వచ్చే సవాళ్లను ఎలా ఎదుర్కోవాలో స్వయంగా తెలుసుకోవడానికి అమెరికా వెళ్లి ప్రత్యేకంగా కోర్సులో చేరడం సినీ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చనీయాంశమైంది. చిరంజీవి, నాగార్జున, ఎన్టీఆర్ వంటి అగ్రతారలు పర్సనాలిటీ రైట్స్ కోసం కోర్టు పోరాటంలో విజయం సాధించిన సంగతి తెలిసిందే.
