ఒక్కటైన ముద్దుగుమ్మలు
హాలీవుడ్ ముద్దుగుమ్మ క్రిస్టెన్ స్టీవర్ట్ పెళ్లి చేసుకుంది. తన ప్రియురాలు డిలన్ మేయర్‌ను వివాహం చేసుకుంది.
By: Tupaki Desk | 21 April 2025 4:03 PM ISTహాలీవుడ్ ముద్దుగుమ్మ క్రిస్టెన్ స్టీవర్ట్ పెళ్లి చేసుకుంది. తన ప్రియురాలు డిలన్ మేయర్‌ను వివాహం చేసుకుంది. వీరి వివాహ నిశ్చితార్థం మూడు ఏళ్ల క్రితం జరిగింది. దాదాపు ఆరు ఏళ్లుగా సహ జీవనం సాగిస్తున్న వీరిద్దరు తమ కొత్త జీవితాన్ని ప్రారంభిస్తున్నట్లు అధికారికంగా ప్రకటన చేశారు. ఏప్రిల్ 20న వైవాహిక జీవితాన్ని మొదలు పెడుతున్నట్లు ఉంగరాలు మార్చుకుంటున్న ఫోటోలను షేర్ చేయడం ద్వారా వీరు తమ పెళ్లిని నిర్ధారించారు. వీరిద్దరు అధికారికంగా పెళ్లి చేసుకోవడం మాత్రమే కాకుండా తమ పెళ్లిని చట్టబద్దం చేసుకుని, మ్యారేజ్ సర్టిఫికెట్ తీసుకున్నట్లు అంతర్జాతీయ మీడియా సంస్థ ఒకటి తన కథనంలో పేర్కొంది.
లాస్ ఏంజిల్స్‌లోని క్రిస్టెన్ స్టీవర్ట్ ఇంట్లో సన్నిహితులు, స్నేహితుల సమక్షంలో జరిగిన ఈ పెళ్లి వేడుక ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కోర్టు నుంచి అనుమతి పొందిన తర్వాత ఈ వివాహంను చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇద్దరు ఆడవారు అయినప్పటికీ కోర్ట్ నుంచి అనుమతి దక్కిందని, ఇన్నాళ్లు పెళ్లి చేసుకోకుండా ఉండటంకు కోర్టు అనుమతి రావడం ఆలస్యం కారణం అనే చర్చ కూడా జరుగుతోంది. మొత్తానికి సుదీర్ఘ కాలంగా ప్రేమించుకుంటూ, సహ జీవనం సాగిస్తున్న వీరిద్దరు తమ జీవితంలో కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టారు అంటూ సోషల్ మీడియా ద్వారా వీరికి అభిమానులు, శ్రేయోభిలాషులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
2013 సంవత్సరంలో ఓ సినిమా సెట్‌లో వీరిద్దరు కలిశారు. ఆ సమయంలో వీరిద్దరికీ పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది. కొన్నాళ్ల ప్రేమ తర్వాత ఆ విషయాన్ని అధికారికంగా బహిర్గతం చేశారు. 2019లో ఇన్‌స్టాగ్రామ్ ద్వారా తమ ప్రేమ వ్యవహారంను వీరిద్దరు తెలియజేశారు. ఆ సమయంలో చాలా మంది వీరిని విమర్శించారు. ఒకే జెండర్ కావడంతో పలువురు విమర్శించడంతో పాటు, ఇది ఏమాత్రం కరెక్ట్ కాదని, వీరి బంధం ఎక్కువ కాలం కొనసాగదు అంటూ విమర్శించారు. కానీ వీరిద్దరు దాదాపు పదేళ్లుగా చాలా సంతోషంగా, సహ జీవనం సాగిస్తూ ఉన్నారు.
ట్విలైట్ తో ప్రపంచ వ్యాప్తంగా పాపులారిటీని సొంతం చేసుకున్న క్రిస్టెన్ స్టీవర్డ్ ఎన్నో సినిమాలు, షోలు చేయడం ద్వారా పాపులారిటీని సొంతం చేసుకున్న విషయం తెల్సిందే. ట్విలైట్ లోని బెల్లా పాత్రలో ఈమె కనబర్చిన నటనకు మంచి మార్కులు దక్కాయి. అంతే కాకుండా అంతర్జాతీయ స్థాయిలో అవార్డులు సొంతం చేసుకున్న విషయం తెల్సిందే. ఇక ఆమె ప్రియురాలు డిలన్ మేయర్ సైతం సినిమా ఇండస్ట్రీకి చెందిన వ్యక్తి. పలు సినిమాల్లో నటించడంతో పాటు రచయితగానూ పలు సినిమాలకు పని చేశారు. మిస్ 2059 అనే సిరీస్‌లో డిలాన్ మేయర్ కీలక పాత్రలో నటించారు.
