ఇప్పుడు ఆయనది ఇంటర్నేషనల్ లెవెల్!
ఎంత ట్రై చేసినా ఆయనతో సినిమా చేసే ఛాన్స్ రాలేదని, చిరంజీవితో రుద్రవీణ లాంటి సినిమా తీసే అదృష్టం తనకు లేదని కృష్ణవంశీ వెల్లడించారు.
By: Tupaki Desk | 8 May 2025 10:08 AMఒకప్పుడు టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ గా ఎన్నో సూపర్ హిట్ సినిమాలు తీసిన కృష్ణవంశీ గత కొన్నేళ్లుగా మంచి ఫామ్ లో లేరన్న విషయం తెలిసిందే. గత కొంత సంవత్సరాలుగా ఆయన చేస్తున్న సినిమాలన్నీ బాక్సాఫీస్ వద్ద ఆశించిన ఫలితాన్ని అందుకోకపోగా డిజాస్టర్లుగా నిలుస్తున్నాయి. మొన్నా మధ్య రంగమార్తాండ సినిమా చేస్తే ఆ సినిమాకు మంచి టాక్ వచ్చింది కానీ కమర్షియల్ గా మాత్రం ఆ సినిమా సక్సెస్ అవలేదు.
రంగమార్తాండ తర్వాత కృష్ణ వంశీ మరో సినిమాను అనౌన్స్ చేసింది లేదు. సినిమాలు చేయకపోయినా సోషల్ మీడియాలో తన ఫాలోవర్లకు టచ్ లో ఉండే కృష్ణవంశీ తాజాగా ఫ్యాన్స్ తో చిట్ చాట్ చేసి వారు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానాలివ్వగా ఇప్పుడు ఆయన చెప్పిన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
నిన్నే పెళ్లాడతా లేదా గుండమ్మ కథ సినిమాను నాగ చైతన్యతో రీమేక్ చేయాలని ఓ ఫ్యాన్ అడిగిన ప్రశ్నకు మంచి ఆలోచనే అని రూ.150 కోట్లు తీసుకొస్తే దుల్లగొట్టేద్దామని సరదాగా రిప్లై ఇచ్చిన కృష్ణ వంశీ చిరంజీవితో ఓ సినిమా చేయాలనే ఆలోచన తనకు ఎప్పట్నుంచో ఉందని, ఈ విషయంలో చిరంజీవిని కూడా సంప్రదించినట్టు తెలిపారు.
ఎంత ట్రై చేసినా ఆయనతో సినిమా చేసే ఛాన్స్ రాలేదని, చిరంజీవితో రుద్రవీణ లాంటి సినిమా తీసే అదృష్టం తనకు లేదని కృష్ణవంశీ వెల్లడించారు. మరొక అభిమాని చిరూతో ఆపద్భాందవుడు లాంటి సినిమా చేస్తే బావుంటుందని అంటే మంచి ఆలోచన అని, అన్నయ్య(చిరూ)తో మీరే చెప్తే బావుంటుందని ఆయన అన్నారు.
జూ. ఎన్టీఆర్ తో అప్పుడు రైతు సినిమా చేస్తానన్నారు కదా అని అడగ్గా, దానికి సమాధానమిస్తూ ఇప్పుడు ఆయన జూనియర్ కాదని, ఇంటర్నేషనల్ లెవెల్ అని, ఆయన స్థాయికి ఇప్పుడు తాను సరిపోనని చెప్పారు. ఖడ్గం2 తీసే ఆలోచన లేదని, అది కుదరని పని అని దానికి క్షమించాలని కోరిన కృష్ణవంశీ, కాజల్ అగర్వాల్ తో సినిమా చేయాలంటే ఫ్యాన్స్ అడిగితేనే ఆమె ఇప్పుడు ఓకే అంటుందేమోనని అన్నారు.
మంచి లవ్ స్టోరీ తీయమని అడుగుతున్న వాళ్లకు సమాధానమిస్తూ ఈరోజుల్లో అసలు లవ్ ఉందా అని ప్రశ్నించారు కృష్ణ వంశీ. మురారి లాంటి సినిమా మరొకటి తీయమంటే తనకు కాపీ కొట్టడం రాదన్న ఆయన తనకు ఓటీటీ కంటెంట్ చేయాలని ఉందని, ప్రస్తుతం దాని కోసం కథ రాస్తున్నట్టు తెలిపారు. ఓటీటీ లోనైనా కృష్ణ వంశీ ఆడియన్స్ ను ఇంప్రెస్ చేస్తారేమో చూడాలి.