అప్పుడు మణికర్ణిక..ఇప్పుడు హరి హర వీరమల్లు
క్రిష్ జాగర్లమూడి బాలీవుడ్ ప్రశంసించిన దర్శకుడు. అంతే కాదు బాలీవుడ్ క్రేజీ మేకర్ సంజయ్ లీలా భన్సాలీ ఆయనపై ప్రశంసలు కురిపించారు కూడా.
By: Tupaki Desk | 23 May 2025 3:00 PM ISTక్రిష్ జాగర్లమూడి బాలీవుడ్ ప్రశంసించిన దర్శకుడు. అంతే కాదు బాలీవుడ్ క్రేజీ మేకర్ సంజయ్ లీలా భన్సాలీ ఆయనపై ప్రశంసలు కురిపించారు కూడా. సంజయ్‌లీలా భన్సాలీ నిర్మించిన 'గబ్బర్ ఈజ్ బ్యాక్' మూవీని క్రిష్ డైరెక్ట్ చేసిన విషయం తెలిసిందే. దీన్ని తమిళ బ్లాక్ బస్టర్ 'రమణ' ఆధారంగా రీమేక్ చేశారు. అక్షయ్ కుమార్ హీరోగా నటించిన ఈ సినిమా అప్పట్లో భారీ వసూళ్లని రాబట్టడమే కాకుండా నిర్మాత సంజయ్ లీలా భన్సాలీకి భారీ లాభాల్ని తెచ్చి పెట్టింది. మేకింగ్ విషయంలో పర్‌ఫెక్ట్ ప్లానింగ్‌తో క్రిష్ వ్యవహరించడం సంజయ్ లీలా భన్సాలీకి తెగ నచ్చేసిందట.
ఆ కారణంగానే ఆయన క్రిష్‌ని అప్పట్లో ప్రశంసించారు. తెలుగులోనూ భారీ సినిమా 'గౌతమిపుత్ర శాతకర్ణి'ని మంచి ప్లానింగ్‌తో తక్కువ బడ్జెట్, తక్కువ వర్కింగ్ డేట్స్‌తో, రెండు యూనిట్స్‌తో ఈ మూవీని పూర్తి చేసి క్రిష్ ఔరా అనిపించారు. ఇలాంటి ట్రాక్ రికార్డ్ ఉన్న దర్శకుడు క్రిష్‌కు ఎందెఉకు ఇలా జరుగుతోంది? తను డైరెక్ట్ చేసిన సినిమాలకు మరొకరు యాడ్ ఎందుకు అవుతున్నారు. క్రిష్‌ని ఎందుకు పక్కన పెట్టేస్తున్నారు? అనే ప్రశ్నలు ప్రస్తుతం సగటు సినీ లవర్‌ని వెంటాడుతున్నాయి.
అప్పుడు మణికర్ణిక..ఇప్పుడు హరి హర వీరమల్లు..ఈ రెండు ప్రాజెక్ట్‌లు భారీవే. దాదాపు పూర్తయిన దశలోనే ఈ రెండు ప్రాజెక్ట్‌ల నుంచి క్రిష్ బయటికి వచ్చేయడం సినీ అభిమానుల్ని విస్మయానికి గురిచేస్తోంది. కంగన రనౌత్ ప్రధాన పాత్రలో క్రిష్ తెరకెక్కించిన పీరియాడిక్ డ్రామా `మణికర్ణిక`. జీ స్టూడియోస్ నిర్మించింది. అయితే ఈ సినిమా ప్రారంభం నుంచి క్రిష్‌తో బాగానే ఉన్న కంగన 70 శాతం షూటింగ్ పూర్తయిన తరువాత నుంచి తనతో విభేదించడం మొదలు పెట్టింది. అదే ఇద్దరి మధ్య దూరాన్ని పెంచింది.
ఆ తరువాత ఇద్దరి మధ్య క్రియేటివ్ డిఫరెన్సెస్ తారా స్థాయికి చేరడంతో ఈ ప్రాజెక్ట్ నుంచి క్రిష్ తప్పుకోవడం, సినిమా క్రెడిట్ విషయంలో కంగనపై క్రిష్ న్యాయ పోరాటం చేయడం తెలిసిందే. ఇప్పుడు పవన్‌తో చేసిన 'హరి హర వీరమల్లు' విషయంలోనూ క్రిష్ అదే పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. ఈ సినిమా 80 శాతం షూటింగ్ పూర్తయిన తరువాత క్రిష్ ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నారు. కారణం ప్రాజెక్ట్ ఏళ్ల తరబడి ఆలస్యం కావడం, క్రియేటివ్ డిఫరెన్సెస్ తలెత్తడం వల్లే క్రిష్ ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నారట.
ఈ మూవీని ముందు ఒక పార్ట్‌గానే అనుకున్నారు. కానీ ఆ తరువాత దీన్ని రెండు భాగాలుగా రిలీజ్ చేస్తున్నట్టు టీమ్ ప్రకటించింది. పార్ట్ 1కు డైరెక్టర్లుగా క్రిష్, జ్యోతికృష్ణ పేర్లని వేస్తున్నారు. జూన్ 12న భారీగా రిలీజ్ కాబోతోంది. ఈ నేపథ్యంలో దర్శకుడు క్రిష్ కే ఎందుకు ఇలా జరుగుతోంది? అనే చర్చ సర్వత్రా మొదలైంది. ఈ వివాదంపై క్రిష్ ఇంత వరకు పెదవి విప్పలేదు. `మణికర్ణిక` విషయంలో తప్పెవరిది అనే విషయాన్ని బాహాటంగానే వెల్లడించిన క్రిష్ మరి `హరి హర వీరమల్లు` విషయంలోనూ అలాగే స్పందిస్తారా? అన్నది వేచి చూడాల్సిందే.
