హిట్ మూవీ 4వ పార్ట్‌లో హీరో 4 పాత్రలు?
'క్రిష్ 4' ఐడియా రాకేష్ రోషన్‌దే అని, కానీ దర్శకత్వ బాధ్యతలు మాత్రం హృతిక్ రోషన్ చూసుకుంటాడని తెలుస్తోంది.
By: Tupaki Desk | 9 April 2025 11:49 AM ISTబాలీవుడ్ సూపర్ హిట్ ప్రాంచైజీ 'క్రిష్' నుంచి ఇప్పటి వరకు మూడు పార్ట్‌లు వచ్చిన విషయం తెల్సిందే. చివరగా క్రిష్ 3 చిత్రం 2013లో వచ్చిన విషయం తెల్సిందే. కరోనాకి ముందు నాల్గవ పార్ట్ గురించి ప్రచారం జరిగింది. కానీ కరోనా కారణంగా ఆలస్యం అయింది. దాదాపు నాలుగు ఏళ్ల తర్వాత మరోసారి క్రిష్ ప్రాంచైజీ మూవీ గురించి వార్తలు వస్తున్నాయి. ఈ మధ్య కాలంలో క్రిష్ 4 గురించి బాలీవుడ్ వర్గాల్లో ఆసక్తికర పుకార్లు షికార్లు చేస్తున్నాయి. క్రిష్ 3తో పాటు మొదటి రెండు పార్ట్‌లకు రాకేష్ రోషన్ దర్శకత్వం వహించిన విషయం తెల్సిందే. కానీ క్రిష్ 4 కి మాత్రం హృతిక్ రోషన్ దర్శకత్వం వహించబోతున్నాడనే వార్తలు వస్తున్నాయి.
'క్రిష్ 4' ఐడియా రాకేష్ రోషన్‌దే అని, కానీ దర్శకత్వ బాధ్యతలు మాత్రం హృతిక్ రోషన్ చూసుకుంటాడని తెలుస్తోంది. భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను నిర్మించేందుకు ప్రముఖ నిర్మాణ సంస్థ రెడీ అవుతోంది. హృతిక్ రోషన్ ప్రస్తుతం 'వార్ 2' పనిలో బిజీగా ఉన్నాడు. ఆ సినిమా పూర్తి చేసిన తర్వాత మరే సినిమాకు కమిట్ కాకుండా క్రిష్ 4ను మొదలు పెట్టాలని భావిస్తున్నాడట. దాదాపు రెండున్నర ఏళ్ల పాటు క్రిష్ 4 సినిమాకు సమయం పట్టే అవకాశం ఉందని అంటున్నారు. సూపర్ హీరో కాన్సెప్ట్‌ను కొనసాగిస్తూ హృతిక్ రోషన్ క్రిష్ పాత్రను పోషించబోతున్నాడు. హీరో పాత్రలోనే కాకుండా మరో రెండు పాత్రల్లోనూ హృతిక్ రోషన్ కనిపించబోతున్నాడనే వార్తలు వస్తున్నాయి.
బాలీవుడ్ వర్గాల నుంచి అందుతున్న విశ్వసనీయ సమాచారం ప్రకారం ఈ సినిమాలో హృతిక్ రోషన్ మూడు పాత్రల్లో కనిపించబోతున్నాడు. మూడు పాత్రల్లో ఒకటి అత్యంత పవర్ ఫుల్ విలన్ రోల్ కూడా ఉండబోతుందట. ఒక పాత్రలో 18 ఏళ్ల కుర్రాడిగా హృతిక్ రోషన్ కనిపిస్తాడని అంటున్నారు. మూడు విభిన్నమైన పాత్రల్లో కనిపించబోతున్న హృతిక్ నాల్గవ పాత్ర దర్శకుడిగా చేయబోతున్నాడు. సాధారణంగా హీరోగా నటించే వారు దర్శకత్వం చేయాలంటే రిస్క్‌తో కూడుకున్న పని. అలాంటిది హృతిక్ రోషన్ ఏకంగా మూడు పాత్రల్లో నటిస్తూ దర్శకత్వం సైతం వహించబోతున్న నేపథ్యంలో అందరి దృష్టిని ఆకర్షించబోతున్నాడు.
ఇండియాలోనే కాకుండా క్రిష్ ప్రాంచైజీకి విదేశాల్లోనూ మంచి గుర్తింపు ఉంది. క్రిష్ మాస్క్‌లు అమెరికాలోనూ బాగా ఫేమస్ అనే విషయం తెల్సిందే. క్రిష్ 4ను ఇప్పుడు సూపర్ హీరో కాన్సెప్ట్‌తో, మంచి కథ, కథనంతో తీసుకు వస్తే కచ్చితంగా రూ.2500 కోట్ల వసూళ్లు నమోదు చేయడం ఖాయం అనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. క్రిష్ 4 తో పాటు మరో పార్ట్‌ను వెంటనే మొదలు పెట్టే విధంగా హృతిక్ రోషన్ ప్లాన్ చేస్తున్నాడు. క్రిష్ 4, క్రిష్ 5 ఒకే కథతో కొనసాగుతాయని, రెండు పార్ట్‌లుగా వస్తాయనే పుకార్లు సైతం షికార్లు చేస్తున్నాయి. మొత్తానికి సినిమా గురించి రకరకాలుగా పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ముందు ముందు క్రిష్ గురించి మరిన్ని విశేషాలు తెలిసే అవకాశాలు ఉన్నాయి.
