ఇండియన్ చిత్రాలపై మనసు పారేసుకున్న కొరియన్ నటి!
ప్రపంచవ్యాప్తంగా కే-పాప్ సంగీతానికి ఉన్న క్రేజ్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. భారతదేశంలో కూడా కొరియన్ మ్యూజిక్, డ్రామాలకు మిలియన్ల సంఖ్యలో అభిమానులున్నారు.
By: Srikanth Kontham | 18 May 2026 8:00 PM ISTప్రపంచవ్యాప్తంగా కే-పాప్ సంగీతానికి ఉన్న క్రేజ్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. భారతదేశంలో కూడా కొరియన్ మ్యూజిక్, డ్రామాలకు మిలియన్ల సంఖ్యలో అభిమానులున్నారు. అయితే భారతీయులే కొరియన్ సంస్కృతికి ఫిదా అవ్వడం లేదు. అంతర్జాతీయ కొరియన్ స్టార్స్ సైతం భారతీయ సంస్కృతి, సినిమాల వైపు ఆకర్షితులవుతున్నారు. తాజాగా అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన ప్రముఖ దక్షిణ కొరియన్ గర్ల్ గ్రూప్ రెడ్ వెల్వెట్ సభ్యురాలు నటి ఏరి భారతీయ కంటెంట్ - ఇక్కడి పర్యాటక రంగంపై తనకున్న అమితమైన ఇష్టాన్ని బయటపెట్టి వార్తల్లో నిలిచారు.
ఈ సందర్భంగా భారతీయ చలనచిత్ర రంగాన్ని ఎంతగానో అభినందించారు. `భారతీయ సినిమాలలో కనిపించే ప్రత్యేకత నాకు ఎంతో ఇష్టం. అక్కడి కథలు చెప్పే విధానం, విజువల్స్, ముఖ్యంగా సినిమాల్లోని సంగీతం, నృత్యాలు నన్ను ఎంతగానో ఆకట్టుకుంటాయి. హాలీవుడ్ , వెస్ట్రన్ సినిమాలకు భిన్నంగా భారతీయ చిత్రాలలో ఉండే ఎమోషన్స్ - వైవిధ్యం నిజంగా అద్భుతం` అని ఆమె కొనియాడారు. కే-పాప్ ప్రపంచంలో బిజీగా ఉంటూనే ఆమె భారతీయ కంటెంట్‌ను కూడా ఫాలో అవుతుండటం విశేషం.
అలాగే భారతదేశంలోని చారిత్రాత్మక కట్టడాల పట్ల తనకున్న ఆసక్తిని పంచుకున్నారు. ప్రపంచ అద్భుతాలలో ఒకటైన ప్రేమకు చిహ్నంగా నిలిచే ఆగ్రాలోని తాజ్ మహల్‌ను స్వయంగా సందర్శించాలనేది తన చిరకాల కోరికగా వెల్లడించారు. `భారతదేశానికి వచ్చి తాజ్ మహల్‌ను నా కళ్లతో నేరుగా చూడాలని ఎప్పటి నుంచో అనుకుం టున్నాను. అక్కడి సంస్కృతిని, వైవిధ్యాన్ని దగ్గరగా అనుభవించాలని ఉంది` అని ఏరి మనసులోని మాటను పంచుకున్నారు.
ఏరి చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో భారతదేశంలోని కే-పాప్ - రెడ్ వెల్వెట్ అభిమానులలో వైరల్‌గా మారాయి. కొరియాకు చెందిన టాప్ సెలబ్రిటీ భారతీయ సినిమాలను ప్రశంసించడం , ఇక్కడి పర్యాటక ప్రాంతాన్ని సందర్శించాలనుకోవడం పట్ల ఇండియన్ నెటిజన్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు. భవిష్యత్తులో ఏరి భారతదేశంలో పర్యటిస్తే ఆమెకు ఘన స్వాగతం పలకడానికి సిద్ధంగా ఉన్నామని అభిమానులు సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్స్ వేదికగా పోస్టులు పెడుతున్నారు.
ఇటీవలి కాలంలో కొరియన్ - భారతీయ పాప్ కల్చర్స్ మధ్య బంధం మరింత బలపడుతోంది. ఇప్పటికే పలువురు భారతీయ కళాకారులు కొరియన్ ప్రాజెక్టులలో భాగస్వామ్యమవుతుండగా, కొరియన్ స్టార్స్ సైతం ఇండియన్ ఆడియన్స్‌ను రీచ్ అవ్వడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ఈ నేపథ్యంలో రెడ్ వెల్వెట్ బ్యాండ్ మెంబర్ ఏరి వెల్లడించిన ఆసక్తి రాబోయే రోజుల్లో ఇరు దేశాల మధ్య కల్చరల్ ఎక్స్ఛేంజ్ మరింత పెరగడానికి దోహద పడతాయని విశ్లేషకులు భావిస్తున్నారు.
కళకు, నృత్యానికి సరిహద్దులు లేవని ఏరి మాటల ద్వారా మరోసారి రుజువైంది. అంతర్జాతీయ మ్యూజిక్ ఐకాన్ భారతీయ సినిమాలోని ప్రత్యేకతను గుర్తించడం మన సినిమా గ్లోబల్ రీచ్‌కు నిదర్శనం. మరి రెడ్ వెల్వెట్ స్టార్ ఏరి అనుకున్నట్లుగా త్వరలోనే భారతదేశానికి వచ్చి తాజ్ మహల్‌ను సందర్శిస్తుందా? భవిష్యత్తులో ఏవైనా భారతీయ ప్రాజెక్టులతో లేదా మ్యూజిక్ కొల్లాబరేషన్లతో ముందుకు వస్తుందేమో చూడాలి.
