Begin typing your search above and press return to search.

కోట బొమ్మాళి PS: ఆడించేది నాయ‌కుడా? పోలీసా?

శ‌తాధిక చిత్రాల క‌థానాయ‌కుడు శ్రీ‌కాంత్, వ‌ర‌ల‌క్ష్మి శ‌ర‌త్ కుమార్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించిన‌ చిత్రం 'కోట బొమ్మాళి పీఎస్'

By:  Tupaki Desk   |   6 Nov 2023 12:56 PM GMT
కోట బొమ్మాళి PS: ఆడించేది నాయ‌కుడా? పోలీసా?
X

శ‌తాధిక చిత్రాల క‌థానాయ‌కుడు శ్రీ‌కాంత్, వ‌ర‌ల‌క్ష్మి శ‌ర‌త్ కుమార్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించిన‌ చిత్రం 'కోట బొమ్మాళి పీఎస్'. ఈ చిత్రానికి తేజ మార్ని దర్శకత్వం వహిస్తున్నారు. GA 2 పిక్చర్స్ సంస్థ ఈ చిత్రాన్ని నవంబర్ 24న భారీ ఎత్తున విడుదల చేయడానికి ప్లాన్ చేస్తోంది. ఈ సినిమా టీజర్ తాజాగా విడుద‌లైంది. టీజ‌ర్ ఆద్యంతం థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో ఆకట్టుకుంది. హీరో శ్రీ‌కాంత్ కానిస్టేబుల్ పాత్ర‌లో అద్భుతంగా న‌టించ‌గా, మ‌రో కాప్ పాత్ర‌లో వరలక్ష్మి శరత్‌కుమార్ ప్రామిస్సింగ్ పెర్ఫామెన్స్ తో మ‌రిపిస్తోంది.

ఇందులో మురళీ శర్మ రాజ‌కీయ నాయ‌కుడిగా న‌టిస్తున్నారు. ఒక రాజకీయ నాయకుడు వ్యవస్థను ఎలా ఆటాడిస్తాడు? ఇరువురు ప్రత్యర్థి శక్తుల మధ్య ఒక పోలీసు ఎలా ఇరుక్కుపోయాడు? అనేది సినిమా థీమ్‌. పోలీసుల‌పై నాయ‌కుల ఒత్తిడి ఏ రేంజులో ఉంటుందో కోట బొమ్మాళి పీఎస్ లో చూపించారు. రాజకీయాల గురించి ప్రజలకు తెలిసినంతగా రాజకీయ నాయకులకు కూడా తెలియదని టీజర్‌లో ఓ పాత్ర చెబుతోంది. దాని సబ్జెక్ట్ స్వభావాన్ని బట్టి సినిమా నుండి ఇలాంటి ఒపీనియన్ టేక్‌లు మరిన్ని ఆశించవచ్చు. రాజ‌కీయ‌నాయ‌కుల‌పై పోలీసులు పై చేయి సాధించారా లేదా? అన్నది కూడా తెర‌పైనే చూడాలి. చాలా కాలం త‌ర్వాత హీరో శ్రీ‌కాంత్ ఒక ప్రామిస్సింగ్ పాత్ర‌లో న‌టిస్తున్నార‌ని తాజా టీజ‌ర్ చెబుతోంది.

అలాగే రాహుల్ విజయ్, శివాని రాజశేఖర్ ముఖ్య పాత్ర‌ల్లో క‌నిపించ‌నున్నారు. రూరల్ థ్రిల్లర్ శ్రీకాకుళం పల్లెటూరి నేపథ్యంలో రూపొందింది. బన్నీ వాస్ - విద్యా కొప్పినీడి ఈ చిత్రాన్ని నిర్మించారు. జగదీష్ చీకాటి సినిమాటోగ్ర‌ఫీ అందించ‌గా, రంజిన్ రా సంగీతం అందించారు. నాగేంద్ర కాశి డైలాగ్స్ అందించారు. కార్తీక శ్రీనివాస్ ఆర్ ఎడిట‌ర్.