కోట శ్రీనివాసరావు మృతిపై సినీ, రాజకీయ ప్రముఖుల నివాళులు!
ప్రముఖ నటుడు, పద్మశ్రీ అవార్డు గ్రహీత కోట శ్రీనివాసరావు (83) ఈ ఆదివారం తెల్లవారుజామున తన నివాసంలో తుదిశ్వాస విడిచారు.
By: Tupaki Desk | 13 July 2025 10:22 AM ISTతెలుగు సినిమా పరిశ్రమలో మరో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ నటుడు, పద్మశ్రీ అవార్డు గ్రహీత కోట శ్రీనివాసరావు (83) ఈ ఆదివారం తెల్లవారుజామున తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. వృద్ధాప్య సంబంధిత అనారోగ్యంతో కొంతకాలంగా బాధపడుతున్న ఆయన మృతి చిత్రపరిశ్రమను తీవ్ర దిగ్బ్రాంతికి గురి చేసింది. 750కి పైగా సినిమాల్లో నటించిన కోటా విలక్షణ నటనతో తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు.
ఈ సందర్భంగా సినీ, రాజకీయ ప్రముఖులు కోట మృతి పట్ల స్పందిస్తూ సంతాపం తెలియజేశారు.
పవన్ కళ్యాణ్
“ప్రముఖ సీనియర్ సినీ నటులు, మాజీ MLA, పద్మశ్రీ కోట శ్రీనివాసరావు గారి మరణ వార్త తీవ్ర బాధాకరం. దాదాపు అనేక భారతీయ భాషల్లో 700 చిత్రాలకు పైగా విభిన్న పాత్రల్లో నటించిన బహుముఖ ప్రజ్ఞాశాలి కోటా గారు ఇకలేరు అనే వార్త సినీరంగానికి తీరని లోటు. ముఖ్యంగా అన్నయ్య చిరంజీవి గారితో కలిసి ‘ప్రాణం ఖరీదు’ సినిమాతో ఒకేసారి సినీ ప్రయాణం మొదలుపెట్టారు. ఆయనతో కలిసి అర డజనుకు పైగా చిత్రాలలో నటించడం ఎప్పటికీ జ్ఞాపకంగా నిలిచిపోతుంది. ఆయన పవిత్రాత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ, వారి కుటుంబ సభ్యులకు, అభిమానులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను.”
ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు
“వైవిధ్యభరితమైన పాత్రలతో సినీ ప్రేక్షకుల అభిమానాన్ని చూరగొన్న ప్రముఖ నటులు కోట శ్రీనివాసరావు గారి మరణం విచారకరం. సుమారు నాలుగు దశాబ్దాల పాటు సినీ, నాటక రంగాలకు ఆయన చేసిన కళా సేవ, ఆయన పోషించిన పాత్రలు చిరస్మరణీయం. ఆయన మృతి తెలుగు సినీ రంగానికి తీరనిలోటు. 1999లో విజయవాడ నుంచి ఎమ్మెల్యేగా గెలిచి ప్రజాసేవ చేశారు. వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను.”
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి
“ప్రముఖ నటుడు కోట శ్రీనివాసరావు గారి మరణం తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది. చలన చిత్ర పరిశ్రమకు ఆయన లేని లోటు తీర్చలేనిది. భౌతికంగా కోట గారు మన మధ్య లేకపోయినా, ఆయన పోషించిన విభిన్న పాత్రలతో తెలుగు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా ఉంటారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తూ, కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను.”
మెగాస్టార్ చిరంజీవి
“లెజెండరీ యాక్టర్, బహుముఖ ప్రజ్ఞాశాలి శ్రీ కోట శ్రీనివాసరావు గారు ఇక లేరు అనే వార్త ఎంతో కలచివేసింది. ‘ప్రాణం ఖరీదు’ చిత్రం తో ఆయన నేను ఒకే సారి సినిమా కెరీర్ ప్రారంభించాము. ఆ తరువాత వందల కొద్దీ సినిమాల్లో ఎన్నెన్నో విభిన్నమైన పాత్రల్లో నటించి, ప్రతి పాత్రని తన విలక్షణ, ప్రత్యేక శైలి తో అలరించి తెలుగు ప్రేక్షకుల గుండెల్లో చిర స్థాయిగా నిలిచిపోయారు. శ్రీ కోట శ్రీనివాసరావు లాంటి నటుడు లేని లోటు చిత్ర పరిశ్రమకి, సినీ ప్రేమికులకు ఎన్నటికీ తీరనిది. ఆయన ఆత్మకి శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ, కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నాను.”
రవితేజ
“వారి సినిమాలు చూస్తూ, నేర్చుకుంటూ పెరిగాను. కోట బాబాయ్ మా కుటుంబంలో ఒకరు. ఆయనతో పని చేసిన మధురమైన జ్ఞాపకాలను నేను ఎప్పటికీ గుర్తుంచుకుంటాను. విశ్రాంతి పొందండి కోట శ్రీనివాసరావు గారు. ఓం శాంతి.”
దర్శకుడు బాబీ
“ఎన్నో ఎన్నెన్నో మధురానుభూతులు కోట శ్రీనివాసరావు గారు. మీ సినీచిత్ర జీవితంలో మీరు పోషించిన ప్రతీ పాత్ర ఒక అనుభూతి కలిగిస్తుంది. నవ్వించే వారు, ఏడిపించే వారు, చంపేద్దాం అనే కోపం తెప్పించేవారు. మిమ్మల్ని నేను ఎప్పడు మర్చిపోలేను. మిస్ యూ కోట శ్రీనివాసరావు గారు.”
తెలుగు సినిమా చరిత్రలో తనదైన ముద్ర వేసిన కోటా ఇకలేరు. కానీ ఆయన సినిమాలు, పాత్రలు, డైలాగులు మాత్రం తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో చిరకాలం నిలిచిపోతాయి.. అంటూ మరికొందరు నివాళులర్పించారు.
