ఆ కోరిక కూడా తీరితే బావుండేది
కోటా శ్రీనివాసరావు తెలుగు చిత్ర పరిశ్రమకు తీరని లోటును మిగిల్చి ఆదివారం అందరినీ వదిలి వెళ్లిపోయిన సంగతి తెలిసిందే.
By: Tupaki Desk | 14 July 2025 12:59 PM ISTకోటా శ్రీనివాసరావు తెలుగు చిత్ర పరిశ్రమకు తీరని లోటును మిగిల్చి ఆదివారం అందరినీ వదిలి వెళ్లిపోయిన సంగతి తెలిసిందే. 700కు పైగా సినిమాల్లో నటించి ప్రతీ పాత్రలోనూ ఆడియన్స్ ను మెప్పించిన ఆయన నటుడిగా అన్నీ సాధించారు. కానీ ఓ లోటు మాత్రం ఆయనకు అలానే ఉండిపోయింది. అదే సీనియర్ ఎన్టీఆర్ తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోవడం.
కోట ఇండస్ట్రీలోకి వచ్చే నాటికే సీనియర్ ఎన్టీఆర్ టీడీపీని స్థాపించి, ఎన్నికల్లో గెలిచి అధికారంలోకి వచ్చి సీఎంగా బీజీ అయిపోయారు. దీంతో వారిద్దరి కాంబినేషన్ సెట్ అవలేదు. 1987లో సి. ప్రభాకర్ రెడ్డి డైరెక్షన్ లో కోటా టైటిల్ రోల్ చేస్తూ మండలాధీశుడు అనే సినిమా చేశారు. ఎన్టీఆర్ రూలింగ్, ఆయన్ని ట్రోల్ చేయడానికే ఆ సినిమా తీయడంతో థియేటర్లలో మండలాధీశుడు ఫ్లాపైంది.
దీంతో టీడీపీ ఫ్యాన్స్, నందమూరి ఫ్యాన్స్ కోటాపై చాలా పగబట్టారు. అందులో భాగంగానే ఓ సారి కోటాపై దాడి కూడా చేయబోయారు. అయితే వీటన్నింటినీ మనసులో పెట్టుకోకుండా ఎన్టీఆర్ మాత్రం ఆయన్ను క్షమించేశారు. ఆ తర్వాత ఎన్టీఆర్ కొన్నాళ్లకు మళ్లీ ఇండస్ట్రీలోకి వచ్చి సినిమాలు చేసినప్పటికీ అప్పుడు కూడా ఆ సినిమాల్లో నటించే అవకాశం కోటాకు రాలేదు.
ఎట్టకేలకు మేజర్ చంద్రకాంత్ సినిమా కోసమని డైరెక్టర్ రాఘవేంద్రరావు నుంచి కోటాకు పిలుపొచ్చినప్పటికీ కాల్షీట్స్ కుదరకపోవడంతో ఆ అవకాశాన్ని కూడా కోటా వాడుకోలేకపోయారు. దీంతో ఎన్టీఆర్ తో సినిమా చేయాలనే కోరిక కోటాకు కలలానే మిగిలిపోయింది. సీనియర్ ఎన్టీఆర్ తో మిస్ అయిన అవకాశాలను కోటా శ్రీనివాసరావు అతని మనవడైన జూనియర్ ఎన్టీఆర్ సినిమాల్లో నటించి కొంతవరకు తన కోరికను తీర్చుకున్నారు.
కోటా శ్రీనివాసరావు మరణం టాలీవుడ్ కు తీరని లోటు అని, ప్రతి పాత్రలో తనదైన శైలిలో ప్రాణం పోసిన మహానటుడి కోటా అని, తన జర్నీలో ఆయనతో నటించిన క్షణాలు ఎప్పటికీ చిరస్మరణీయమని, ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని, కోటా శ్రీనివాసరావు ఒక్కరే అని ఆయన లాంటి నటుడు మరొక లేరు, రాలేరు అని జూ.ఎన్టీఆర్ కోటా గురించి అన్నారు.
