ఇదే కోటా శ్రీనివాసరావు చివరి ఫోటో
తెలుగు జాతి గర్వించదగ్గ నటుడు కోటా శ్రీనివాసరావు, అలాంటి నటుడిని కోల్పోవడం తెలుగు సినిమాకు పెద్ద లోటు.
By: Tupaki Desk | 13 July 2025 11:15 AM ISTతెలుగు జాతి గర్వించదగ్గ నటుడు కోటా శ్రీనివాసరావు, అలాంటి నటుడిని కోల్పోవడం తెలుగు సినిమాకు పెద్ద లోటు. ఆయన కెరీర్‌లో 750 సినిమాలకు పైగా చేశారు. మూస దోరణిలో కాకుండా ఎన్నో విభిన్నమైన పాత్రల్లో కోటా శ్రీనివాస రావు నటించారు. చేసిన ప్రతి ఒక్క పాత్ర విభిన్నంగా ఉండేందుకు గాను ఆయన ప్రయత్నించేవారు. 1980 నుంచి మొదలుకుని ఈతరం ప్రేక్షకుల వరకు ఆయన సినిమాలు చూస్తూ వచ్చారు. ఇండస్ట్రీలో దాదాపుగా నాలుగు దశాబ్దాల పాటు ప్రస్థానం సాగించిన కోటా తుది శ్వాస విడిచిన నేపథ్యంలో ఆయనతో నటించిన నటీనటులు, ఆయనతో వర్క్ చేసిన వందలాది మంది ఇండస్ట్రీకి చెందిన వారు ఆయన ఇంటికి క్యూ కట్టారు.
ఈ సమయంలో కోటా శ్రీనివాసరావు చివరి ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కొన్ని వారాల క్రితం కోటా శ్రీనివాసరావును నిర్మాత కమ్ నటుడు అయిన బండ్ల గణేష్ కలిశాడు. కోటా ఆరోగ్యం గురించి వాకబు చేసేందుకు వెళ్లిన బండ్ల గణేష్ కొద్ది సేపు మాట్లాడి వచ్చాడు. ఆ సమయంలో తీసిన ఫోటోను బండ్ల గణేష్ సోషల్ మీడియా ద్వారా షేర్ చేశాడు. ఆ ఫోటో ఆ సమయంలోనే వైరల్ అయింది. కోటా శ్రీనివాసరావు ఆ ఫోటోలో చాలా బక్కగా కనిపించారు. చాలా బలహీనంగా ఆయన కనిపించారు. అనారోగ్య సమస్యలతో ఆయన బాధ పడుతున్నట్లుగా ఆ ఫోటోలను చూస్తే అర్థం అయింది. షుగర్ కారణంగా కాలి వేలిని తొలగించినట్లు ఆ సమయంలో వార్తలు వచ్చాయి.
బండ్ల గణేష్‌తో దిగిన ఫోటో కోటా శ్రీనివాసరావు దిగిన చివరి ఫోటోగా సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతోంది. తెలుగు జాతి గర్వించదగ్గ నటుడు కోటా శ్రీనివాసరావు, అలాంటి నటుడిని చివరకు ఇలా చూడాల్సి వస్తుందని అనుకోలేదు అంటూ అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒకప్పుడు బందోబస్తు గా కనిపించి విలనిజంతో భయభ్రాంతులకు గురి చేసిన కోటా శ్రీనివాసరావు చివరి దశలో అనారోగ్య కారణాల వల్ల సన్నబడి చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఆయన చివరి దశలో ఇచ్చిన కొన్ని ఇంటర్వ్యూలు, చేసిన కొన్ని వ్యాఖ్యల కారణంగా ఆయన్ను చాలా మంది చాలా రకాలుగా విమర్శలు చేశారు. సోషల్ మీడియాలో ఆయనపై కొందరు ట్రోల్స్ చేశారు.
కోటా శ్రీనివాసరావును ఎప్పటికీ తెలుగు ప్రేక్షకులు గుర్తుంచుకుంటారు. ఈ జనరేషన్ మాత్రమే కాకుండా రాబోయే జనరేషన్‌లో కూడా ఆయన లేకున్నా ఆయన సినిమాలు మాట్లాడుతాయి, ఆయన గురించి ఆయన సినిమాలు మాట్లాడేలా చేశాయి. గణేష్ వంటి సినిమాలో విలన్‌గా నటించినా, ఆ నలుగురు వంటి సినిమాలో కన్నీళ్లు పెట్టించినా అది కోటాకే చెల్లింది. అందుకే తెలుగు సినిమా ఉన్నంత కాలం కోటా శ్రీనివాసరావు ఉంటారు అనడంలో సందేహం లేదు. ఆయన లేని లోటును ఇప్పుడే కాదు ఎప్పటికీ ఏ నటుడు భర్తీ చేయలేడు. ఆయన మృతి పట్ల సినీ ప్రముఖులతో పాటు, ప్రేక్షకులు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తున్నాయి.
