సక్సెస్‌కు కోటా చెప్పిన నిర్వచనమిదే
తెలుగు సినీ రంగంలో తన విలక్షణమైన నటనతో ప్రత్యేక స్థానం సంపాదించుకున్న కోట శ్రీనివాసరావు ఆయన స్వీయ అనుభవంలో ఎదురైన జీవిత సత్యాల గురించి అప్పుడప్పుడు ఇంటర్వ్యూల్లో చెప్పేవారు.
By: Tupaki Desk | 14 July 2025 11:00 PM ISTతెలుగు సినీ రంగంలో తన విలక్షణమైన నటనతో ప్రత్యేక స్థానం సంపాదించుకున్న కోట శ్రీనివాసరావు ఆయన స్వీయ అనుభవంలో ఎదురైన జీవిత సత్యాల గురించి అప్పుడప్పుడు ఇంటర్వ్యూల్లో చెప్పేవారు. ఏ పని చేయడానికైనా వయస్సు అడ్డంకి కాదనే విషయంతో పాటూ మండలాధీసుడులో ఎన్టీఆర్‌ను అనుకరించే పాత్ర చేయడం, తన లైఫ్ లో పిల్లలతో ఎక్కువ టైమ్ స్పెండ్ చేయలేకపోవడం వంటి విషయాల గురించి ఆయన చాలా బాధపడేవారు. ఆయన తెలుసుకున్న కొన్ని జీవిత సత్యాల్లో మన నిజ జీవితంలో అక్కరకొచ్చే విషయాలను ఓసారి తెలుసుకుందాం.
టాలెంట్ తో పాటూ ప్రతీ ఒక్కరికీ ఆవగింజంత అదృష్టమైనా ఉండాలని కోట అనేవారు. ఏ రంగంలోనైనా దానిపై ఆధారపడి 90 శాతం మంది ఉంటే, 10 శాతం మందిపై ఆ రంగం ఆధారపడి ముందుకెళ్తూ ఉంటుందని, ఈ పది శాతంలో మనం ఉండాలంటే టాలెంట్ తో పాటు లక్ కూడా ఉండాలనేది కోట అభిప్రాయం. ఈ విషయాన్ని యువత ఆకళింపు చేసుకోవాలని కోట చెప్పేవారు. వాడుంటే ఈ పని చిటికెలో అయిపోతుందనే నమ్మకం మనం పని చేసే సంస్థలో కల్పించాలని, లేదంటే ఆ 90 శాతంలో మిగిలిపోతావు అని చెప్పేవారు.
ఏ పని చేయడానికైనా వయస్సు అడ్డంకి కాదని, అలా అని కొన్నిసార్లు అన్నీ చేయలేమనేది కోట అభిప్రాయం. ఆయన సినీ రంగంలోకి 40 ఏళ్ల వయస్సులో వచ్చారు. లేటు వయస్సులో వచ్చినా ఎన్నో వైవిధ్యంతో కూడిన పాత్రలను ఎంచుకొని నటుడిగా సక్సెస్ అయ్యారు. అయితే, హీరో రోల్స్ జోలికి మాత్రం పోలేదు. సినిమా భారం మొత్తం హీరోపైనే ఉంటుందని, మనం మోయగలిగే భారమే మోయాలి తప్పించి ఎక్కువ మోయలేమని, అందుకే తాను ఎప్పుడు హీరో కాలేదని, కాబట్టే ఇప్పటికీ జీరో కాకుండా మిగిలానని కోట చెప్పారు.
మండలాధీసుడులో ఎన్టీఆర్‌ను అనుకరించే పాత్ర చేయడంపై చాలా విమర్శలు, అవమానాలు ఎదుర్కొన్నానని, ఏడాది వరకు సరైన అవకాశాలు కూడా రాలేదని, ఆ దశలో సినీ రంగం వదిలేసి వెళ్లిపోకుండా ఓపికగా నిలదొక్కుకున్నానని కోటా చెప్పారు. జీవితంలో కొన్ని సందర్భాల్లో ఓపిక అవసరమని కోట అభిప్రాయం. ఇక సినిమాల్లో తీరిక లేకుండా ఉండడంతో ఉదయం 6 గంటలకు ఇంటి నుంచి వెళ్లి, తిరిగి రాత్రి 2 గంటలకు వచ్చే వాడినని దీంతో పిల్లలతో గడిపే సమయం ఉండేది కాదని కోట చెప్పారు. వృత్తితో పాటు కుటుంబానికి కూడా సమ ప్రాధాన్యం ఇవ్వాలని లేకపోతే జీవితం మొత్తం ఆ వెలితి ఉంటుందనేది కోట అభిప్రాయం. ఇలా సినీ రంగంలోని నటులకు మాత్రమే కాకుండా సాటి మనుషులందరికీ కోట ఎన్నో విషయాల్లో ఆదర్శంగా నిలుస్తున్నారు.
