Begin typing your search above and press return to search.

కోట అన్న కావాల‌న్నాడు.. నేను ఇచ్చేశాను: బాబు మోహ‌న్

తెలుగు చిత్ర‌సీమలో ఎప్ప‌టికీ మ‌ర్చిపోలేని జోడీ కోట శ్రీ‌నివాస‌రావు- బాబు మోహ‌న్. ఈ జోడీ ఎన్నో చిత్రాల్లో అద్భుత న‌ట ప్ర‌దర్శ‌న‌ల‌తో మెప్పించారు

By:  Tupaki Desk   |   17 July 2025 8:27 PM IST
కోట అన్న కావాల‌న్నాడు.. నేను ఇచ్చేశాను: బాబు మోహ‌న్
X

తెలుగు చిత్ర‌సీమలో ఎప్ప‌టికీ మ‌ర్చిపోలేని జోడీ కోట శ్రీ‌నివాస‌రావు- బాబు మోహ‌న్. ఈ జోడీ ఎన్నో చిత్రాల్లో అద్భుత న‌ట ప్ర‌దర్శ‌న‌ల‌తో మెప్పించారు. వినోద్ కుమార్ `మామ‌గారు` చిత్రంలో ఆ ఇద్ద‌రి కాంబినేష‌న్ సీన్లకు క‌డుపుబ్బా న‌వ్వుకోని వారు ఉండ‌రు. కోట‌- బాబు మోహ‌న్ కాంబినేష‌న్ అంటే 90లలో ఒక బ్రాండ్. ఇక ఆ ఇద్ద‌రి మ‌ధ్యా ఆఫ్ ద స్క్రీన్ స్నేహం కూడా అంతే గొప్ప‌ది. ఒక‌రికోసం ఒక‌రుగా ఆ ఇద్ద‌రూ జీవించారు. క‌లిసి ఎదిగారు.. క‌లిసి ఒకే చోట నివశించారు. ఫిలింన‌గ‌ర్ లో స్వ‌గృహాల్ని నిర్మించుకున్నారు. అయితే కోట అన్న ఇల్లు క‌ట్టుకోవ‌డం వెన‌క మ్యాజిక్ గురించి, ఆ త‌ర్వాత త‌న ఇంటి నిర్మాణం వెన‌క లాజిక్ గురించి కూడా ఇప్పుడు చెప్పుకొచ్చారు బాబు మోహ‌న్.

కోట ఇప్పుడున్న ఇంటి స్థ‌లానికి నేను అడ్వాన్స్ ఇచ్చాను. రాజ‌బాబు త‌మ్ముడు చిట్టిబాబు ఆ స్థలాన్ని నాకు అమ్మేసాడు. ఇక్క‌డ అమ్మేసి కూక‌ట్‌ప‌ల్లిలో వాళ్ల‌ అక్క ఇంటికి ద‌గ్గ‌ర‌లో ఇల్లు కొనుక్కున్నాడు. అయితే నేను అడ్వాన్స్ ఇచ్చాను.. కానీ కోట‌ అన్న వ‌చ్చి ఏరా ఏంటి అడ్వాన్స్ ఇచ్చావా? నువ్వే కొంటున్నావా ? నాకు ఇవ్వొచ్చు క‌దా? అన్నాడు. అయితే తీస్కో అన్నా అన్నాను. అడ్వాన్స్ కూడా నేను వెనక్కి తీసుకోలేదు. కోట‌న్న ఇల్లు కొనడానికి నేను అడ్వాన్స్ ఇచ్చిన‌ట్టు లెక్క‌. ఆ త‌ర్వాత‌ ప‌క్క‌నే మ‌రో స్థ‌లం ఉంది. మొద‌లు పెట్టి ఆగిపోయిన ఇల్లు.. అది నువ్వు తీస్కో అన్నాడు కోట‌న్న‌. నేను తీస్కున్నాను. ఒరేయ్ పెద్ద‌గా క‌ట్ట‌కు.. చిన్న‌గా క‌ట్టుకోరా! అన్నాడు. ``స‌రేలేవ‌య్యా క‌డ‌తాం.. క‌డ‌దాం.. ఇట్ట త‌లెత్తి చూడాలి.. ఆ రేంజులో క‌డ‌తాం! పెద్ద నేర్పుతున్నావే`` అని అన్నాను. ``అ... చాల్లేవోయ్ నువ్వు క‌ట్టిన‌ప్పుడు చూద్దాం`` అన్న‌వాడు ఆ త‌ర్వాత ``అరేయ్ కొడ‌కా క‌ట్టినా క‌డ‌తావ్`` అన్నాడు.

ఆ త‌ర్వాత ఎక్క‌డ క‌నిపించిన ఏరా ఎప్పుడు క‌డుతున్నావ్ ఇల్లు అనేవాడు. ఏదో చిన్న‌ది క‌ట్టేయ్ రా అనేవాడు. క‌డ‌తాం లేవోయ్ అన్న‌ట్టు చూసాను. ఆ త‌ర్వాత మూడో ఫ్లోర్ ద‌శ‌కు వ‌చ్చాను. అది సెల్లార్ ద‌శ‌లో ఆగిపోయిన ఇల్లు.. ఒక రోజు భోరున వ‌ర్షం కురుస్తోంది. నేను ఫిలింన‌గ‌ర్ షూటింగ్ పూర్తి చేసి ఇక్క‌డ క‌డుతున్న మూడో ఫ్లోర్ కి వ‌చ్చాను. అప్పుడు కోట వ‌చ్చాడు... ఏరా స్లాబ్ వేస్తున్నావా? అనడిగాడు.. అవును మూడో ఫ్లోర్ అన్నాను. నా కొడ‌కా క‌డ‌తాన‌న్నావ్ గా అంటూ కోపంగా చూసి లోనికి వెళ్లిపోయాడు. అప్పుడు స‌ర‌దాగా ఏడిపించ‌డానికి ఏదో అనేసాను. కానీ అన్న‌ట్టే ఆరోజు అక్క‌డికి వ‌చ్చాడు. ``ఆ చాల్లేవోయ్`` అని ఉడుక్కున్నాడు. నిజంగా అన్న‌ట్టే చేసాను. వాడిని నేను చాలా ఏడిపించేవాడిని.. నేను ఏడిపిస్తే ఏమీ అనేవాడు కాదు.. అట్లా సంతోష‌ప‌డేవాడు! అని త‌మ మ‌ధ్య స్నేహం గురించి చెప్పుకొచ్చారు బాబు మోహ‌న్. కోట శ్రీ‌నివాస‌రావు ఇక లేరు! అన్న వార్త విని బాబు మోహ‌న్ క‌న్నీరు మున్నీరు అయిన ఫోటోలు వీడియోలు ఇప్ప‌టికే వెబ్ లో వైర‌ల్ అయ్యాయి. నిజ‌మైన స్నేహితుడిని, ఆప్తుడిని కోల్పోతే ఆ బాధ ఎలా ఉంటుందో అత‌డిని చూస్తేనే అంద‌రికీ అర్థ‌మ‌వుతుంది.