దళపతి కోసం కదిలిన కోలీవుడ్ దండు!
కోలీవుడ్ స్టార్ హీరో దళపతి విజయ్ నటించిన చివరి సినిమా `జన నాయగన్` రిలీజ్ వాయిదా పడిన విషయం తెలిసిందే.
By: Tupaki Desk | 8 Jan 2026 3:18 PM ISTకోలీవుడ్ స్టార్ హీరో దళపతి విజయ్ నటించిన చివరి సినిమా `జన నాయగన్` రిలీజ్ వాయిదా పడిన విషయం తెలిసిందే. హెచ్.వినోద్ డైరెక్షన్‌లో కెవీఎన్ ప్రొడక్షన్స్ అత్యంత భారీ స్థాయిలో ఈ మూవీని నిర్మించింది. తెలుగు సూపర్ హిట్ ఫిల్మ్ `భగవంత్ కేసరి` ఆధారంగా దీన్ని తెరకెక్కించినట్టుగా ట్రైలర్ రిలీజ్‌తో తేలిపోయింది. అయినా సరే సినిమాపై సర్వత్రా భారీ అంచనాలు ఏర్పడ్డాయి. విజయ్ నటిస్తున్న చివరి సినిమా కావడంతో దీనిపై అంచనాలు తారా స్థాయికి చేరుకున్నాయి. జనవరి 9న భారీ స్థాయిలో సంక్రాంతికి రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేశారు.
తమిళంతో పాటు పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ ప్లాన్ చేశారు. కానీ అనివార్య కారణాల వల్ల సినిమా రిలీజ్ ఆగిపోయింది. దీనికి ప్రధాన కారణం సెన్సార్ సర్టిఫికెట్ రాకపోవడమే. గత నెల డిసెంబర్‌లో ఈ మూవీని సెన్సార్ కోసం మేకర్స్ పంపించారు. అయితే కొన్ని అభ్యంతరకర సన్నివేశాలని తొలగించాలని, కొన్ని సంభాషణలని మ్యూట్ చేయాలని సెన్యార్ బోర్డ్ సూచించిందట. అవన్నీ క్లియర్ చేసి మళ్లీ సెన్సార్‌కు పంపించగా వారి నుంచి ఎలాంటి స్పందన లేదు. ఆ తరువాత రివిజన్ కమిటీకి దీన్ని సిఫారసు చేస్తున్నట్టుగా మేకర్స్‌కి తెలియడంతో నిర్మాణ సంస్థ మద్రాస్ హైకోర్టుని ఆశ్రయించింది.
దీనిపై వాదనలు జరిగాయి. సెన్సార్ బోర్డ్ తరుపు సొలిసిటర్ జనరల్, కెవీఎన్ ప్రొడక్షన్స్ తరుపున న్యాయవాది పరాశరన్ తమ వాదనలు వినిపించారు. ఈ నేపథ్యంలోనే సెన్సార్ బోర్డ్ తరుపు సొలిసిటర్ జనరల్ ప్యానల్‌లోని ఓ వ్యక్తి మళ్లీ అభ్యంతరాలు వ్యక్తం చేశాడని, కొత్త టీమ్‌తో మళ్లీ సెన్సార్ చేయించాలని వాదించాడు. ఇది ఎలా సాధ్యమని, రిలీజ్‌కు సమయం లేదని కెవీఎన్ ప్రొడక్షన్స్ తరుపు న్యాయవాది పరాశరన్ వాదించారు. ఇరువురి వాదనలు విన్న మద్రాస్ హైకోర్టు న్యాయమూర్తి తీర్పుని రిజర్వ్ చేశారు. తుది తీర్పుని జనవరి 9 ఉదయం వెలువరిస్తామని స్పష్టం చేశారు.
దీంతో అదే రోజు రిలీజ్ కావాల్సిన `జన నాయగన్` వాయిదా పడింది. ఈ విషయాన్ని తెలియజేస్తూ కెవీఎన్ ప్రొడక్షన్స్ ఓ లెటర్‌ని విడుదల చేసింది. దీంతో విజయ్ అభిమానులు, శ్రేమోభిలాషులు సోషల్ మీడియా వేదికగా సెన్సార్ బోర్డ్‌పై ఫైర్ అవుతున్నారు. ఈ నేపథ్యంలోనే విజయ్ కోసం కోలీవుడ్ దండు కదిలింది. నెట్టింట విజయ్‌కి మద్దతుగా పోస్ట్‌లు పెట్టడం మొదలు పెట్టింది. యాక్టర్ రవి మోహన్ స్పందిస్తూ `హృదయం బద్దలైంది. విజయ్ అన్నా..ఒక తమ్ముడిగా నీ పక్కన ఉన్న లక్షలాది తమ్ముళ్లలో ఒకడిగా నేను నీతో నిలబడ్డాను. నీకు, నీ సినిమాకు ఒక డేట్ అవసరం లేదు. నువ్వే ఒక అరంభం..ఆ డేట్ ఎప్పుడొచ్చినా సరే సంక్రాంతి మొదలవుతుంది` అని ట్వీట్ చేశాడు.
`ఏం జరిగినా సరే ఇది భారతీయ సినిమా చరిత్రలో అతిపెద్ద వీడ్కోలు కాబోతోంది` అని వెంకట్ ప్రభు తన మద్దతు ప్రకటించాడు. సినిమాకిది టఫ్ టైమ్ అని కార్తిక్ సుబ్బరాజ్, ఇది చాలా బాధకరమని దర్శకుడు జయకుమార్, జన నాయగన్ చుట్టూ జరుగుతున్నవి చూస్తుంటే మాసీవ్ సక్సెస్ కోసం పర్‌ఫెక్ట్ స్టేజ్ సెట్టయిందని పరోక్షంగా విజయ్ రాజకీయ జీవితంపై సిబి సత్యరాజ్ కామెంట్ చేశాడు. వీరితో పాటు ఇంకా చాలా మంది కోలీవుడ్ వర్గాలు విజయ్‌కి తమ మద్దతుని తెలియజేయడంతో విజయ్ కోసం కోలీవుడ్ దండు కదిలిందని నెట్టింట ప్రచారం మొదలైంది.
