ట్రెండీ టాక్: క్రైమ్ డ్రామాలే కోలీవుడ్ ఊపిరి?
టాలీవుడ్ లో అన్ని జానర్ల సినిమాలకు ప్రాధాన్యత కనిపిస్తోంది. అటు బాలీవుడ్ వైవిధ్యమైన కంటెంట్ తో ఇటీవల దూసుకొస్తోంది.
By: Sivaji Kontham | 18 Sept 2026 9:28 AM ISTటాలీవుడ్ లో అన్ని జానర్ల సినిమాలకు ప్రాధాన్యత కనిపిస్తోంది. అటు బాలీవుడ్ వైవిధ్యమైన కంటెంట్ తో ఇటీవల దూసుకొస్తోంది. ఇలాంటి సమయంలో కోలీవుడ్ క్రైమ్ డ్రామాలపై ఆధారపడుతుండడం ఆసక్తికర చర్చకు తెర తీసింది.
కోలీవుడ్ లో ప్రస్తుతం వైవిధ్యమైన కథల కంటే క్రైమ్ డ్రామాలే ట్రెండ్‌గా మారాయి. రొటీన్ కమర్షియల్ బాటలో నడుస్తూనే.. సస్పెన్స్, అండర్‌వరల్డ్, జైళ్లు , నేర నేపథ్య కథల చుట్టూనే కోలీవుడ్ దర్శకనిర్మాతలు తిరుగుతున్నారు. ఇటీవల సముద్రం నేపథ్యంలో వచ్చిన `మందాడి` చిత్రం కూడా ఒక క్రైమ్ డ్రామాగా తెరకెక్కడమే దీనికి తాజా ఉదాహరణ. అంతకుముందు జైలర్ ఇదే బాపతు క్రిమినల్ బ్యాక్ డ్రాప్ సినిమా. కోలీవుడ్ స్టార్ హీరోలందరూ ఇదే బాటను ఎంచుకోవడం గమనార్హం.
సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా తెరకెక్కుతున్న `జైలర్` సీక్వెల్ క్రైమ్ కథని మరో లెవల్ కి తీసుకెళ్లబోతోందిట. మొదటి భాగం ఘన విజయంతో మరింత క్యూరియాసిటీని పెంచిన ఈ సీక్వెల్‌లో రజనీ మరోసారి జైలు వార్డెన్‌గా తనదైన శైలిలో పవర్‌ఫుల్ నటనను ప్రదర్శించనున్నారు. నెల్సన్ దిలీప్‌కుమార్ దర్శకత్వంలో సన్ పిక్చర్స్ పతాకంపై కళానిధి మారన్ అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ చిత్రంలో అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు. కోలీవుడ్‌తో పాటు తెలుగులోనూ ఈ సినిమాకు విపరీతమైన క్రేజ్ ఉంది.
మరోవైపు స్టార్ హీరో సూర్య నటిస్తున్న తాజా చిత్రం `సీన్`పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇందులో సూర్య జైల్లో ఖైదీలకు అలాగే అవినీతి పోలీసులకు ట్రీట్‌మెంట్ ఇచ్చే పవర్‌ఫుల్ డి.ఎస్.పి (DSP) పాత్రలో కనిపించనున్నారు. వినూత్న కథాంశంతో రూపొందుతున్న ఈ ప్రాజెక్ట్‌ను ప్రముఖ నిర్మాణ సంస్థలు నిర్మిస్తున్నాయి. `సూర్య` కెరీర్‌కు ఇది చాలా కీలకం కానుంది.
ఇక టాలెంటెడ్ యాక్టర్ చియాన్ విక్రమ్ విషయానికొస్తే... అతడు నటిస్తున్న తాజా చిత్రం `పవర్ హౌస్` పైనా భారీ అంచనాలున్నాయి. ఇందులో విక్రమ్ ఒక సాధారణ మధ్యతరగతి యువకుడిగా కనిపిస్తున్నా అనూహ్యంగా నేర ప్రపంచంతో (క్రైమ్) సంబంధం ఉన్న పాత్రలో ప్రేక్షకులను సర్ ప్రైజ్ చేయనున్నారు. వరుస పరాజయాలతో రేసులో వెనుకబడిన విక్రమ్.. ఈ సినిమాతో ఎలాగైనా బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించాలనే కసితో చాలా కష్టపడుతున్నారు.
ఇలా రజనీకాంత్ `జైలర్ 2`, సూర్య `సీన్`, విక్రమ్ `పవర్ హౌస్` వంటి వరుస టీజర్లు.. ప్రాజెక్ట్‌లన్నీ క్రైమ్ డ్రామా జోనర్‌లోనే వస్తుండటం కోలీవుడ్ ప్రస్తుతం ఈ నేర కథలపైనే పూర్తిగా డిపెండ్ అయిందని స్పష్టం చేస్తోంది. రజనీ జైలర్, సూర్య విశ్వనాథ్ అండ్ సన్స్ చిత్రాల విజయాలతో జోరుమీదుండగా.. విక్రమ్ మాత్రం ఈ క్రైమ్ థ్రిల్లర్ సక్సెస్‌తో మళ్లీ ట్రాక్‌లోకి రావాలని చూస్తున్నారు. ఈ చిత్రాలన్నీ తెలుగులోనూ భారీ క్రేజ్‌తో విడుదల కానుండటం విశేషం.
