100 కోట్లు ఆపైన అందుకుంటున్న టాప్ -5 తమిళ్ హీరోలు
తమిళ చిత్ర పరిశ్రమ (కోలీవుడ్) మార్కెట్ ప్రస్తుతం దేశవ్యాప్తంగానే కాకుండా అంతర్జాతీయంగానూ భారీగా విస్తరించింది.
By: Sivaji Kontham | 8 July 2026 11:19 AM ISTతమిళ చిత్ర పరిశ్రమ (కోలీవుడ్) మార్కెట్ ప్రస్తుతం దేశవ్యాప్తంగానే కాకుండా అంతర్జాతీయంగానూ భారీగా విస్తరించింది. కేవలం బాలీవుడ్, టాలీవుడ్ హీరోలు మాత్రమే వంద కోట్ల క్లబ్‌లో రెమ్యునరేషన్ అందుకోవడం లేదు. ఇటీవల తమిళ హీరోలు కూడా తమ మార్కెట్ స్టామినా పెంచుకుంటూ ఒక్కో సినిమాకు రూ. 100 కోట్లు.. ఆపై మొత్తాన్ని పారితోషికంగా డిమాండ్ చేస్తూ సరికొత్త రికార్డులు సృష్టిస్తున్నారు.
కోలీవుడ్‌లో వంద కోట్ల క్లబ్ గురించి మాట్లాడుకుంటే.. బాక్సాఫీస్ చక్రవర్తులు సూపర్ స్టార్ రజనీకాంత్, దళపతి విజయ్ వంటి టాప్ హీరోలను ముందుగా మినహాయించాల్సి ఉంటుంది. ఎందుకంటే వీరిద్దరి మార్కెట్ రేంజ్ ఎప్పుడో రూ. 150 కోట్లు - రూ. 200 కోట్ల రేంజ్ థియేట్రికల్ రైట్స్ మార్కును కూడా దాటేసింది. ప్రస్తుత జనరేషన్ రీచ్ ప్రకారం వీరిద్దరూ సౌత్ ఇండియాలోనే అత్యధిక పారితోషికం అందుకుంటున్న అగ్ర తారలుగా తారాపథంలో కొనసాగుతున్నారు.
రజనీ, విజయ్ తర్వాత ఈ వంద కోట్ల క్లబ్ రేసులో సగర్వంగా నిలిచిన మరో స్టార్ హీరో అజిత్ కుమార్. ముఖ్యంగా మాస్ యాక్షన్ హీరో తళా అజిత్ కుమార్‌కు తమిళనాడులో ఉన్న మాస్ ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు. ఆయన నటించే చిత్రాల బిజినెస్ రేంజ్ దృష్ట్యా.. అజిత్ ప్రస్తుతం చేస్తున్న పాన్ ఇండియా ప్రాజెక్టులకు రూ. 100 కోట్ల మార్కును దాటి రెమ్యునరేషన్ అందుకుంటూ ఈ రేసులో టాప్ లీగ్‌లో కొనసాగుతున్నారు.
ఇదే వరుసలో తాజాగా చేరిన మరో క్రేజీ స్టార్ హీరో సూర్య. తమిళ మీడియా కథనాల ప్రకారం.. ఇటీవల సూర్య నటించిన `కరుప్పు` చిత్రం బాక్సాఫీస్ వద్ద బ్లాక్‌బస్టర్ విజయాన్ని సాధించడంతో అతడి మార్కెట్ వాల్యూ అమాంతం పెరిగిపోయింది. ఈ భారీ సక్సెస్ ఇచ్చిన జోష్‌తో సూర్య తన తదుపరి చిత్రాలకు రూ. 100 కోట్ల పారితోషికాన్ని డిమాండ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. కంటెంట్ ఓరియెంటెడ్ చిత్రాలతో పాటు కమర్షియల్ సినిమాలతోనూ సూర్య ఈ రేసులో దూసుకుపోతున్నారు.
వీరితో పాటు కోలీవుడ్ బాక్సాఫీస్ వద్ద సంచలనాలు సృష్టిస్తున్న యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో శివకార్తికేయన్ కూడా వేగంగా ఈ రూ. 100 కోట్ల క్లబ్ వైపు అడుగులు వేస్తున్నారు. `అమరన్` సక్సెస్ తర్వాత అతడు 60కోట్ల రేంజులో పారితోషికం తీసుకుంటున్నాడు. అతడు మునుముందు భారీ ప్రాజెక్టులతో తన స్థాయిని పెంచుకునే పనిలో ఉన్నాడని తెలుస్తోంది. వరుస విజయాలతో మినిమం గ్యారెంటీ హీరోగా మారిన శివకార్తికేయన్.. ఫ్యామిలీ ఆడియన్స్‌లో ఉన్న క్రేజ్ రీత్యా తన రెమ్యునరేషన్‌ను భారీగా పెంచేస్తున్నారు. అలాగే సీనియర్ స్టార్ హీరో కమల్ హాసన్ కూడా విక్రమ్ సినిమా తర్వాత మళ్లీ ఫామ్‌లోకి వచ్చి రూ. 100 కోట్ల క్లబ్‌లో కొనసాగుతుండటం గమనార్హం. కల్కి 2898 ఏడి ఫ్రాంఛైజీ అతడి రేంజును మరింత పెంచుతుందని ఒక అంచనా. మొత్తానికి కోలీవుడ్ టాప్-5 హీరోలు తమ స్టార్‌డమ్‌తో ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో సరికొత్త బెంచ్‌మార్క్‌లను సెట్ చేస్తున్నారు.
