Begin typing your search above and press return to search.

స్టార్ హీరోలకు ఊహించని ఎదురుదెబ్బ.. కోలీవుడ్‌లో మారిపోయిన లెక్కలు!

2026 మొద‌టి ఆరు నెలలు కోలీవుడ్ కు ఎన్నో పాఠాలు నేర్పాయి. ఒకప్పుడు స్టార్ హీరో సినిమా వస్తే చాలు బాక్సాఫీస్ దగ్గర సందడి ఖాయం అనే పరిస్థితి ఉండేది. కానీ ఈ ఏడాది ఫస్టాఫ్ మాత్రం పూర్తిగా భిన్నమైన చిత్రాన్ని చూపించింది.

By:  Sravani Lakshmi Srungarapu   |   2 July 2026 8:00 PM IST
స్టార్ హీరోలకు ఊహించని ఎదురుదెబ్బ.. కోలీవుడ్‌లో మారిపోయిన లెక్కలు!
X

2026 మొద‌టి ఆరు నెలలు కోలీవుడ్ కు ఎన్నో పాఠాలు నేర్పాయి. ఒకప్పుడు స్టార్ హీరో సినిమా వస్తే చాలు బాక్సాఫీస్ దగ్గర సందడి ఖాయం అనే పరిస్థితి ఉండేది. కానీ ఈ ఏడాది ఫస్టాఫ్ మాత్రం పూర్తిగా భిన్నమైన చిత్రాన్ని చూపించింది. భారీ అంచనాలతో వచ్చిన పలువురు స్టార్ హీరోల సినిమాలు ఆశించిన స్థాయిలో ప్రభావం చూపలేకపోగా, లిమిటెడ్ బడ్జెట్‌తో తెరకెక్కిన కథా బలం ఉన్న సినిమాలే థియేటర్లకు ఊపిరి పోశాయి. దీంతో కోలీవుడ్‌లో బాక్సాఫీస్ సమీకరణాలు మారుతున్నాయా? ప్రేక్షకుల అభిరుచి కొత్త దిశగా వెళ్తోందా? అనే చర్చ ట్రేడ్ వర్గాల్లో జోరుగా సాగుతోంది.

సంక్రాంతి సీజన్‌లో రిలీజైన స్టార్ హీరోల సినిమాలు భారీ ఓపెనింగ్స్ సాధించినప్పటికీ, ఆ ఊపును ఎక్కువ రోజులు కొనసాగించలేకపోయాయి. ప్రేక్షకుల అంచనాలను అందుకోలేకపోవడంతో వాటి థియేట్రికల్ రన్ ఆశించిన స్థాయికి చేరలేదు. తరువాత రిలీజూన‌ మరికొన్ని భారీ సినిమాలు కూడా ఇదే పరిస్థితిని ఎదుర్కొనడంతో స్టార్ పవర్ ఒక్కటే స‌క్సెస్ ను డిసైడ్ చేయ‌లేద‌నే అభిప్రాయం మరింత బలపడింది.

అదే సమయంలో పెద్దగా అంచనాలు లేకుండా వచ్చిన విత్ ల‌వ్, తాయ్ కిజావి, యూత్, బ్లాస్ట్ లాంటి సినిమాలు మంచి మౌత్ టాక్‌తో ప్రేక్షకులను థియేటర్లకు రప్పించాయి. భారీ ప్ర‌మోష‌న్స్ లేకపోయినా, కథ మరియు ఎమోషన్‌కు ఆడియ‌న్స్ కనెక్ట్ కావడంతో ఈ సినిమాలు వారాల తరబడి స‌క్సెస్‌ఫుల్ లో థియేట‌ర్ల‌లో ర‌న్ అయ్యాయి. ముఖ్యంగా పెద్ద సినిమాల మధ్య వచ్చిన గ్యాప్‌ను ఈ సినిమాలే సద్వినియోగం చేసుకుని ఎగ్జిబిటర్లకు, డిస్ట్రిబ్యూటర్లకు లాభాలు అందించాయి.

అయితే స్టార్ హీరోల పరంగా చూస్తే ఒక పేరు మాత్రం ప్రత్యేకంగా నిలిచింది. సూర్య నటించిన క‌రుప్పు అంచనాలను మించి బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్లి భారీ క‌లెక్ష‌న్లు సాధించింది. తమిళనాడులోనే రూ.150 కోట్లకు పైగా కలెక్షన్లు నమోదు చేసిన ఈ సినిమా సూర్య కెరీర్‌లోనే అతిపెద్ద స‌క్సెస్‌గా నిలవడమే కాకుండా, థియేటర్లలో మళ్లీ సందడి తీసుకొచ్చింది. ఫస్టాఫ్‌లో నిజమైన మాస్ బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన ఈ సినిమా కోలీవుడ్‌కు కీలక ఊరటనిచ్చింది. ఈ పరిణామాలన్నింటినీ పరిశీలిస్తే బాక్సాఫీస్ ట్రెండ్‌లో స్పష్టమైన మార్పు కనిపిస్తోంది. ఒకప్పుడు స్టార్ హీరో పేరు చాలు అనే పరిస్థితి ఉండేది. ఇప్పుడు మాత్రం ప్రేక్షకులు ముందుగా కథ, కంటెంట్, ఎంట‌ర్టైన్మెంట్ ను పరిశీలిస్తున్నారని ట్రేడ్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మంచి కథతో వస్తే చిన్న సినిమా అయినా ఆదరిస్తున్నారు. అదే సమయంలో భారీ బడ్జెట్, స్టార్ కాస్ట్ ఉన్నా కంటెంట్ ఆశించిన స్థాయిలో లేకపోతే ప్రేక్షకులు పెద్దగా ఆసక్తి చూపడం లేదు.

ఈ మార్పు కోలీవుడ్‌కు కొత్త సంకేతాలను ఇస్తోంది. కేవలం స్టార్ ఇమేజ్‌పై ఆధారపడే రోజులు క్రమంగా తగ్గుతున్నాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అందుకే ఈ ఇయ‌ర్ సెకండాఫ్ లో రిలీజ్ కు రెడీ అవుతున్న భారీ సినిమాల‌పై ఇప్పుడు మరింత ఒత్తిడి నెలకొంది. అవి ఆడియ‌న్స్ అంచనాలను అందుకుంటే పరిశ్రమకు మరో ఊపు రావచ్చు. లేకపోతే 2026ను చిన్న, మధ్య తరహా సినిమాల విజయగాథగా గుర్తుంచుకునే పరిస్థితి ఏర్పడే అవకాశం కనిపిస్తోంది.