Begin typing your search above and press return to search.

కోలీవుడ్‌కి 1000 కోట్ల క్ల‌బ్ సాధ్య‌మేనా? మ‌ణిర‌త్నం జవాబు!

ప్ర‌స్తుతం 'థ‌గ్ లైఫ్' ప్ర‌మోష‌న్స్ లో ఉన్న మ‌ణిర‌త్నంను సూటిగా వెయ్యి కోట్ల క్ల‌బ్ గురించి విలేక‌రులు ప్ర‌శ్నించారు.

By:  Tupaki Desk   |   26 May 2025 7:01 PM IST
కోలీవుడ్‌కి 1000 కోట్ల క్ల‌బ్ సాధ్య‌మేనా? మ‌ణిర‌త్నం జవాబు!
X

1000 కోట్ల క్ల‌బ్ అంద‌రికీ అంద‌ని ద్రాక్ష‌! ఇప్ప‌టికి టాలీవుడ్, బాలీవుడ్, శాండ‌ల్వుడ్ 1000 కోట్ల క్ల‌బ్ లో చేరాయి. కానీ కోలీవుడ్, మాలీవుడ్ దీనిని సాధించ‌లేక‌పోయాయి. ఈ రెండు ప‌రిశ్ర‌మ‌లు చాలాకాలంగా ప్ర‌య‌త్నాల్లో ఉన్నాయి. కానీ ద్రాక్ష పండు అందడం లేదు.

అయితే ఈ అంద‌ని ద్రాక్ష గురించి మ‌ణిర‌త్నం లాంటి దిగ్గ‌జానికి ప్ర‌శ్న ఎదురైంది. ప్ర‌స్తుతం 'థ‌గ్ లైఫ్' ప్ర‌మోష‌న్స్ లో ఉన్న మ‌ణిర‌త్నంను సూటిగా వెయ్యి కోట్ల క్ల‌బ్ గురించి విలేక‌రులు ప్ర‌శ్నించారు. కోలీవుడ్ కి ఇది సాధ్య‌మేనా? అనేది ప్ర‌శ్న‌. దీనికి స్పందించిన ఆయ‌న ఇలాంటి ఒత్తిళ్లు ప‌రిశ్ర‌మ‌లో ప్రామాణిక‌మైన మంచి చిత్రాలు రాకుండా చేస్తాయ‌ని అభిప్రాయ‌ప‌డ్డారు. దర్శకుడు మణిరత్నం మాట్లాడుతూ..మనం పెద్ద మొత్తంలో డబ్బు సంపాదించడానికే సినిమాలు తీస్తున్నామా? అని ప్ర‌శ్నించారు. కేవలం భారీగా బాక్సాఫీస్ రాబడిని వెంబడించడం కంటే ప్రామాణికమైన , మంచి చిత్రాలను సృష్టించాల్సిన అవ‌స‌రం, ప్రాముఖ్యత గురించి మాట్లాడారు. బిజినెస్ ఒత్తిళ్లు పరిశ్రమలో సృజనాత్మకతను అణచివేయగలవ‌ని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. అత‌డి మాట‌ల‌ను అనుస‌రించి, థ‌గ్ లైఫ్ విష‌యంలో మ‌ణి స‌ర్ వెయ్యి కోట్ల క్ల‌బ్ ని టార్గెట్ చేయ‌లేద‌ని దీనిని బ‌ట్టి అర్థం చేసుకోగ‌లం.

మ‌ణిర‌త్నం తెర‌కెక్కించిన‌ గ్యాంగ్ స్టర్ యాక్షన్ చిత్రం 'థగ్ లైఫ్' 5 జూన్ 2025 న విడుదల కానుంది. ఈ చిత్రంలో కమల్ హాసన్ సిలంబరసన్ తండ్రి, పెంపుడు కొడుకులుగా ప్రధాన పాత్రల్లో నటించారు. ఇది ప‌వర్ పాలిటిక్స్, ద్రోహం, ప్రతీకారం నేప‌థ్యంలో ర‌క్తి క‌ట్టించ‌నుంది. తండ్రి కొడుకుల మ‌ధ్య వెన్నుపోటు రాజ‌కీయాలు భ‌యాన‌కంగా సాగ‌నున్నాయి. ఇందులో రంగరాయ శక్తివేల్ నాయకర్ (కమల్ హాసన్) అనే ఓల్డ్ గ్యాంగ్ స్టర్ గా న‌టించారు. అత‌డి దత్తపుత్రుడు అమరన్ (సిలంబరసన్) మాఫియా అధిపతిగా ఎదిగాక ఏం జ‌రిగింద‌నేదే సినిమా. వారసత్వ రాజ‌కీయాల్లో గేమ్ ఎలా సాగింద‌నేది మ‌ణిర‌త్నం తెర‌పై ఆవిష్క‌రించారు. ఇది ద‌క్షిణాది అన్ని భాష‌ల‌తో పాటు హిందీలోను భారీగా విడుద‌ల కానుంది.