కోహ్లిని అరెస్ట్ చేయరా.. బన్నీ ఫ్యాన్స్ ప్రశ్న
బన్నీ పోలీసులు వారిస్తున్నా చాలాసేపు థియేటర్లోనే ఉన్నాడు. కానీ బెంగళూరులో అన్నీ పోలీసుల అనుమతితోనే జరిగింది.
By: Tupaki Desk | 5 Jun 2025 1:41 PM ISTబెంగళూరులో నిన్న పెద్ద విషాదమే చోటు చేసుకుంది. 18 ఏళ్ల కలను నెరవేర్చుకుంటూ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు ఐపీఎల్ విజేతగా నిలవడంతో సంబరాలు మొన్న రాత్రి నుంచే అంబరాన్నంటాయి. మంగళవారం రాత్రంతా బెంగళూరు నిద్ర పోలేదు. సిటీ అంతా బాణసంచా వెలుగులు, సెలబ్రేషన్లతో మామూలు హంగామా లేదు. ఆ సంబరాలను నిన్న కూడా కొనసాగించారు. ఆర్సీబీ జట్టుతో విక్టరీ పరేడ్, చిన్నస్వామి స్టేడియంలో సన్మాన కార్యక్రమం.. ఇలా చాలానే ప్లాన్ చేశారు. కానీ ఆ జట్టు చిన్నస్వామికి రావడానికి ముందే అక్కడ తొక్కిసలాట జరిగి 11 మంది ప్రాణాలు వదిలారు. పదుల సంఖ్యలో గాయపడ్డారు. ఈ ఉదంతం చర్చనీయాంశంగా మారింది. ఈ గొడవ మీద తెలుగు నెటిజన్లు కూడా బాగానే చర్చించుకుంటున్నారు. ‘పుష్ప-2’ రిలీజ్ టైంలో సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనతో పోలుస్తున్నారు. నాటి విషాదం మీద ఎంత రచ్చ జరిగిందో తెలిసిందే.
ఐతే అప్పుడు అల్లు అర్జున్‌ను అరెస్ట్ చేసినట్లు.. ఇప్పుడు కోహ్లిని అరెస్ట్ చేస్తారా అంటూ బన్నీ ఫ్యాన్స్ వెటకారంగా ప్రశ్నిస్తున్నారు. ఇలాంటి తొక్కిసలాట ఘటనలకు ఎవరు బాధ్యత వహిస్తారని అడుగుతున్నారు. ఆ రోజు దురదృష్టవశాత్తూ ఆ ఘటన జరిగిందని.. దానికి బాధ్యుడిగా పేర్కొంటూ బన్నీని అరెస్ట్ చేయడం.. కేసులతో వేధించడం చేశారని.. ఇప్పుడు కోహ్లితో పాటు ఆర్సీబీ జట్టు మొత్తాన్ని అరెస్ట్ చేస్తారా అని అడుగుతున్నారు. కాకపోతే ఈ రెండు ఘటనల్లో ఒక తేడా ఉంది. బన్నీకి ఆ రోజు పోలీసులు అనుమతి ఇవ్వలేదు. అయినా అతను వచ్చాడు. థియేటర్ దగ్గర చాలా హంగామా జరిగింది.
బన్నీ పోలీసులు వారిస్తున్నా చాలాసేపు థియేటర్లోనే ఉన్నాడు. కానీ బెంగళూరులో అన్నీ పోలీసుల అనుమతితోనే జరిగింది. జనం ఎంతమంది వస్తారని అంచనా వేయడంలో, వారిని ఎలా కంట్రోల్ చేయాలనే విషయంలో ప్రణాళిక రచించుకోవడంలో బెంగళూరు పోలీసులు ఘోరంగా విఫలమయ్యారన్నది స్పష్టం. పైగా అక్కడ విధాన సభ వద్ద విన్నింగ్ టీంని సన్మానించాలని ప్రభుత్వమే నిర్ణయించింది. ఆర్సీబీ జట్టును డిప్యూటీ సీఎంయే స్వయంగా స్వాగతించి.. అన్ని కార్యక్రమాల్లోనూ భాగమయ్యారు. దీంతో ఆర్సీబీ టీం కంటే ప్రభుత్వమే దీనికి ప్రధానంగా బాధ్యత వహించాల్సిన పరిస్థితి తలెత్తింది.
