'కేజేక్యూ' మూవీ రివ్యూ
పార్థ (దీక్షిత్ శెట్టి).. జాకీ (శశి ఓదెల) యుక్త వయసులో పరిస్థితుల ప్రభావం వల్ల రౌడీలుగా మారిన కుర్రాళ్లు. వీరిలో పార్థకు అహం ఎక్కువ. తనను మించిన వాళ్ళు లేరని ఫీలయ్యే అతను ఎవరినైనా ఎదిరించడానికి వెనుకాడడు.
By: Tupaki Desk | 7 Aug 2026 11:03 PM IST'కేజేక్యూ' మూవీ రివ్యూ
నటీనటులు: దీక్షిత్ శెట్టి - శశి ఓదెల - యుక్తి తరేజా - మురళీధర్ గౌడ్ - అంకుర్ వికల్ - సురేఖా వాణి తదితరులు
సంగీతం: పృథ్వీరాజ్
ఛాయాగ్రహణం: నగేష్ బాబెల్
నిర్మాత: సుధాకర్ చెరుకూరి
రచన - దర్శకత్వం: కేకే
అక్కినేని నాగార్జున హీరోగా కేడి సినిమా తీసిన కిరణ్ అలియాస్ కేకే చాలా ఏళ్ల తర్వాత రూపొందించిన చిత్రం.. కేజేక్యూ. ఈ సినిమా పూర్తి చేశాక అతను అనారోగ్యంతో చనిపోయాడు. ఆ విషాదం తర్వాత కొన్ని నెలలకు, ఇప్పుడు ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి కేకే చివరగా ఎలాంటి సినిమా తీశాడో చూద్దాం పదండి.
కథ:
పార్థ (దీక్షిత్ శెట్టి).. జాకీ (శశి ఓదెల) యుక్త వయసులో పరిస్థితుల ప్రభావం వల్ల రౌడీలుగా మారిన కుర్రాళ్లు. వీరిలో పార్థకు అహం ఎక్కువ. తనను మించిన వాళ్ళు లేరని ఫీలయ్యే అతను ఎవరినైనా ఎదిరించడానికి వెనుకాడడు. హైదరాబాద్ సిటీని తన గుప్పిట్లోకి తెచ్చుకోవాలనే ప్రయత్నంలో అతను విజయవంతం అవుతాడు. జాకీ ప్రతి సందర్భంలో అతడికి అండగా నిలుస్తాడు. అతడికంటూ జీవితం ఉండదు. ఐతే అనుకోకుండా పరిచయం అయిన సినీ నటి భార్గవి (యుక్తి) మీద మోజు పడ్డ పార్థ.. ఆమె తన మాట వినకపోవడంతో తనను చంపేయాలని పంతానికి పోతాడు. మరోవైపు సోని.. జాకీని ఇష్టపడుతుంది. ఈ ముక్కోణపు వ్యవహారం వల్ల ఈ ముగ్గురి జీవితాలు ఎలాంటి మలుపు తిరిగాయి. చివరికి ఈ ముగ్గురు ఏమయ్యారు అన్నది మిగతా కథ.
కథనం - విశ్లేషణ:
అక్కినేని నాగార్జున హీరోగా నటించిన కేడి సినిమా రిలీజై 16 ఏళ్లు అయింది. అదొక డిజాస్టర్ మూవీ. కానీ ఇప్పుడు ఆ సినిమా పెట్టుకుని చూస్తే.. అదంత పెద్ద డిజాస్టర్ కావాల్సిన మూవీ కాదని అనిపిస్తే ఆశ్చర్యం లేదు. మంచి కథ.. డిఫరెంట్ స్క్రీన్ ప్లేతో నడిచే ఆ సినిమా అప్పటికి అహెడ్ ఆఫ్ టైమ్స్ అనిపిస్తుంది. ఆ చిత్రంలో దర్శకుడి ముద్ర చాలా చోట్ల కనిపిస్తుంది. కానీ కమర్షియల్ సక్సెస్ దక్కకపోవడం వల్ల ఆ తర్వాత కనిపించకుండా పోయిన కిరణ్ దశాబ్దంన్నర విరామం తర్వాత తీసిన కేజేక్యూతోనూ తాను డిఫరెంట్ డైరెక్టర్ అని చాటే ప్రయత్నమే చేశాడు. తన టేకింగ్ లో.. స్క్రీన్ ప్లేలో వైవిధ్యం కనిపిస్తుంది. కానీ ఈ అతను ఎంచుకున్న కథలో ఏమాత్రం వైవిధ్యం లేకపోవడం.. పాత్రల చిత్రణ తేలిపోవడం.. ఎమోషన్లు అస్సలు వర్కవుట్ కాకపోవడంతో కేజేక్యూ ఆశించిన ప్రయోజనాన్ని ఇవ్వలేకపోయింది.
కేజేక్యూలో కే అంటే కింగ్.. జే అంటే జాకీ.. క్యూ అంటే క్వీన్. మూడు ప్రధాన పాత్రలను సూచించేలా ఈ సినిమాకు పేరు పెట్టిన దర్శకుడు..ఆ మూడింటి చుట్టూనే కథ మొత్తం నడిపించాడు. అవి కాకుండా సినిమాలో ప్రాధాన్యం చాటుకునే పాత్రలు పెద్దగా కనిపించవు. జరిగిన ఘటనలను వేర్వేరు పాత్రల దృక్కోణంలో చెప్పడం అన్నది స్క్రీన్ ప్లేలో ఒక డిఫరెంట్ టెక్నిక్. పోతురాజు సహా అనేక చిత్రాల్లో ఈ శైలి చూశాం. కిరణ్ కుమార్ సైతం ఇలాగే ఈ కథను చెప్పే ప్రయత్నం చేశాడు. కానీ స్క్రీన్ ప్లే విషయంలో విభిన్నంగా ప్రయత్నించిన అతను.. కథ విషయంలో మాత్రం పెద్దగా కసరత్తు చేయలేదనిపిస్తుంది. ఒక మామూలు కుర్రాడు పరిస్థితుల ప్రభావంతో మాఫియా సామ్రాజ్యంలోకి అడుగుపెట్టడం.. అక్కడ ఇంతింతై అన్నట్లు ఎదిగిపోవడం.. అధికారం చేజిక్కాక అహం తలకెక్కి తన పతనానికి కోరి తెచ్చుకోవడం.. చుట్టూ ఉన్న వాళ్లందరినీ కోల్పోవడం.. మిత్రుడు కూడా శత్రువు అయిపోవడం.. ఈ ఫార్మాట్లో సాగే లీడ్ క్యారెక్టర్లు-కథలు ఎన్నో చూశాం. మాఫియా కథలన్నీ కూడా ఇదే లైన్లో సాగుతాయి. పాత్రలు పరిచయం అయినపుడే.. అవి ఎలా ప్రవర్తిస్తాయి.. తర్వాత ఏం జరగొచ్చు అన్నది ముందే అర్థమైపోతుంటే.. ఆ కథతో ప్రేక్షకులు ఎంగేజ్ కావడం కష్టం. స్క్రీన్ ప్లేతో ఎంత మాయ చేద్దామని చూసినా సరే.. కథ పెద్దగా ముందుకు కదలనపుడు.. పాత్రలతో కనెక్ట్ కానపుడు.. ఎమోషన్ వర్కవుట్ కానపుడు ఆ సినిమాతో ప్రయాణం కష్టమవుతుంది. కేజేక్యూలో అదే జరిగింది.
కొన్ని సీన్ల వరకు ఆకట్టకున్నప్పటికీ.. కేజేక్యూ ఓవరాల్ ఇంపాక్ట్ మాత్రం అంతంతమాత్రమే. పార్థ-జాకీ పాత్రల బాండింగ్ ను కానీ.. వాటి మధ్య సంఘర్షణ రావడానికి దారి తీసే క్రమాన్ని కానీ బలంగా చూపించలేదు. ముందు పాత్రల మధ్య బంధాన్ని సరిగ్గా చూపిస్తే.. వారి మధ్య సంఘర్షణ ఎలివేట్ అవుతుంది. కానీ ఈ రెంటిలో ఏదీ సరిగ్గా జరగలేదు. అలాగే జాకీ-భార్గవి పాత్రల మధ్య బంధం ఏర్పడడానికి కూడా సరైన కారణం కనిపించదు. జాకీ పాత్రలో మానసిక సంఘర్షణను కూడా ప్రేక్షకులను కదిలించేలా ప్రెజెంట్ చేయలేదు. ఇక భార్గవి క్యారెక్టర్ బ్యాక్ స్టోరీ కూడా అంత ఆసక్తికరంగా అనిపించదు. సన్నివేశాలన్నీ పైపైన లాగించేసినట్లే అనిపిస్తుంది. అయోమయంగా అనిపించే ఆరంభ సన్నివేశం తర్వాత డాట్స్ అన్నీ కలిపి చివర్లో దానికి పేఆఫ్ ఇవ్వడం బాగుంది కానీ.. అసలీ కథతో కొత్తగా ఏం చెప్పదలుచుకున్నారనే ప్రశ్న చివర్లో ఉదయించిందంటే ఈ సినిమా పరమార్థం నెరవేరనట్లే. కేవలం ప్రధాన పాత్రధారుల పెర్ఫామెన్సులు బాగున్నాయి తప్పితే.. వారి పాత్రల్లో ప్రత్యేకత ఏమీ కనిపించదు. సినిమా మొత్తంలో క్రేజీగా అనిపించే సన్నివేశం ఒక్కటీ కనిపించదు. సర్ప్రైజులు ఏమీ లేవు. అసలే సీరియస్ కథ.. పైగా ఆ స్టోరీలో కొత్తదనం లేదు.. ఎమోషనూ వర్కవుట్ కాలేదు. ఇక దీంతో ప్రేక్షకులు ఎలా కనెక్ట్ కాగలరు?
నటీనటులు:
కేజేక్యూలో ముగ్గురు ప్రధాన పాత్రధారులూ బాగా పెర్ఫామ్ చేశారు. ముగ్గురిలోకి దీక్షిత్ శెట్టి స్పెషల్ అనిపిస్తాడు. ఒళ్లంతా అహం నిండిన పాత్రలో అతను బాగా ఒదిగిపోయాడు. ఆల్రెడీ గర్ల్ ఫ్రెండ్ సినిమాలో తన పాత్రలో నెగెటివ్ షేడ్స్ చూసి ఉండడం వల్ల.. పార్థ పాత్రకు కూడా త్వరగానే అలవాటు పడతాం. నటనకు తోడు తన వాయిస్ తోనూ దీక్షిత్ ఆకట్టుకున్నాడు. తన లుక్ కూడా బాగుంది. శశి ఓదెలకు ఇది తొలి సినిమానే అయినా.. బాగా నటించాడు. ఒకట్రెండు సన్నివేశాల్లో హావభావాలు అంత బాగా లేవు కానీ.. ఓవరాల్ గా డెబ్యూలో అతన ఆకట్టుకున్నాడు. పాత్రకు అవసరమైన ఇంటెన్సిటీ చూపించాడు. యుక్తి తరేజా నటన కంటే తన గ్లామరే హైలైట్ అయింది. పాత్ర కూడా అందుకు తగ్గట్లే తీర్చిదిద్దారు. మెజారిటీ సీన్లలో ఆమె అందాల ప్రదర్శన చేసింది. మురళీధర్ గౌడ్ కు ఇలాంటి పాత్రలు కొట్టిన పిండే. చిచ్చా పాత్రను అలవోకగా చేసుకుపోయారు. స్లమ్ డాగ్ మిలియనీర్ ఫేమ్ అంకుర్ చేసిన మస్తాన్ పాత్ర సాధారణం. మిగతా ఆర్టిస్టులంతా మామూలే.
సాంకేతిక వర్గం:
టెక్నికల్ గా కేజేక్యూ ఒక మోస్తరుగా అనిపిస్తుంది. పృథ్వీరాజ్ పాటలు గుర్తుంచుకునేలా లేవు. తన నేపథ్య సంగీతం మాత్రం బాగుంది. సినిమాటోగ్రాఫర్ నగేష్ బానెల్ విజువల్స్ తో మెప్పించాడు. నిర్మాణ విలువలు పర్వాలేదు. పరిమిత బడ్జెట్లో, తక్కువ లొకేషన్లలో సినిమాను పూర్తి చేశారని అర్థమవుతుంది. ఇక రైటర్ కమ్ డైరెక్టర్ కేకే తన చివరి చిత్రంలో టేకింగ్ పరంగా ఓకే అనిపించాడు కానీ.. తన రైటింగ్ అంత బలంగా లేదు. మరీ పాతగా అనిపించే కథను ఎంచుకోవడంతో స్క్రీన్ ప్లేతో మ్యాజిక్ చేయాలని ప్రయత్నించినా కుదరలేదు. పాత్రల చిత్రణలో.. ఎమోషన్లను వర్కవుట్ చేయడంలో దర్శకుడు ఇంకా కసరత్తు చేయాల్సిందనిపిస్తుంది.
చివరగా: కేజేక్యూ.. గేమ్ ఫెయిల్
రేటింగ్ -2/5
