Begin typing your search above and press return to search.

లెజెండ‌రీ కిషోర్ కుమార్ బ‌యోపిక్ ఎందుకింత ఆల‌స్యం?

లెజెండ‌రీ గాయ‌కుడు, సంగీత ద‌ర్శ‌కుడు, న‌టుడు కిషోర్ కుమార్ బ‌యోపిక్ తెర‌కెక్క‌నుంద‌ని స‌మాచారం. ఈ బ‌యోపిక్ కోసం ద‌ర్శ‌కుడు అనురాగ్ బ‌సు చాలా కాలంగా ప‌ని చేస్తున్నారు.

By:  Tupaki Desk   |   10 July 2025 9:36 AM IST
లెజెండ‌రీ కిషోర్ కుమార్ బ‌యోపిక్ ఎందుకింత ఆల‌స్యం?
X

లెజెండ‌రీ గాయ‌కుడు, సంగీత ద‌ర్శ‌కుడు, న‌టుడు కిషోర్ కుమార్ బ‌యోపిక్ తెర‌కెక్క‌నుంద‌ని స‌మాచారం. ఈ బ‌యోపిక్ కోసం ద‌ర్శ‌కుడు అనురాగ్ బ‌సు చాలా కాలంగా ప‌ని చేస్తున్నారు. స్క్రిప్టు వ‌ర్క్ పూర్తి చేస్తూనే, కిషోర్ కుమార్ కుటుంబ స‌భ్యుల నుంచి అంగీకార ప‌త్రం పొందేందుకు ప్ర‌య‌త్నించారు. అయితే ఆ కుటుంబం ఇంకా ఒప్పంద ప‌త్రంపై సంత‌కం చేయ‌లేద‌ని తాజా ఇంట‌ర్వ్యూలో అనురాగ్ వెల్ల‌డించారు.

ప్రారంభం ఈ బ‌యోపిక్ లో ర‌ణ‌బీర్ క‌పూర్ న‌టించేందుకు ఆస‌క్తిగా ఉన్నార‌ని క‌థ‌నాలొచ్చాయి. కానీ ఇప్పుడు ఇందులో అమీర్ ఖాన్ ఇన్వాల్వ్ అవుతున్నార‌ని తెలుస్తోంది. అనురాగ్ బ‌సును ఈ విష‌య‌మై ప్ర‌శ్నిస్తే.. అత‌డు ఆ ఇద్ద‌రు హీరోల‌తో త‌న‌కు ఉన్న సాన్నిహిత్యం గురించి మాట్లాడారు. ర‌ణ‌బీర్ తో బ‌ర్ఫీ, జ‌గ్గా జాసూస్ చిత్రాల‌కు ప‌ని చేసిన అనురాగ్ త‌న‌కు ర‌ణ‌బీర్ ఎంతో క్లోజ్ అని, ఇద్ద‌రి మ‌ధ్యా స‌ర‌సాలాడుకునేంత చ‌నువు ఉంద‌ని కూడా అన్నాడు. అత‌డు ప్ర‌తిసారీ ఒక జ‌త షూస్ గిఫ్ట్ గా ఇస్తాడ‌ని కూడా తెలిపాడు.

అమీర్ ఖాన్ తో ప్రాజెక్ట్ ముందుకు వెళుతుందా? అన్న ప్ర‌శ్న‌కు...ప్ర‌ముఖ మీడియాతో మాట్లాడుతూ ఇలా సమాధానమిచ్చాడు, ``ఇంకా మాట ఇవ్వ‌లేదు. ప్రతిదీ ఖరారు అయ్యి, ఒప్పందంపై సంతకం చేసే వరకు నేను దాని గురించి మాట్లాడకూడదని అనుకుంటున్నాను`` అని తెలిపారు. నిజానికి దశాబ్ద కాలంగా ఈ ప్రాజెక్ట్ పై అనురాగ్ ప‌ని చేస్తున్నారు. కిషోర్ కుమార్ బయోపిక్ ప్రయాణం ఒడిదుడుకులతో నిండి ఉందని బసు అన్నారు. కిషోర్ కుమార్ కుటుంబం నుంచి అంగీకారం ల‌భిస్తుంద‌ని తాను ఆశిస్తున్న‌ట్టు తెలిపారు.

అనురాగ్ బసు తెర‌కెక్కించిన తాజా చిత్రం `మెట్రో... ఇన్ డినో` ప్రేక్షకులు విమ‌ర్శ‌కుల‌ను ఆక‌ట్టుకుంది. ఈ చిత్రంలో ఆదిత్య రాయ్ కపూర్, సారా అలీ ఖాన్, కొంకోన సేన్ శర్మ, ఫాతిమా సనా షేక్ త‌దిత‌రులు కీలక పాత్రల్లో నటించారు.

కిషోర్ కుమార్ స్వ‌గ‌తం:

కిషోర్ కుమార్ బెంగాలీ బ్రాహ్మిణ్ కుటుంబంలో జ‌న్మించారు. అత‌డి పేరు అభాస్ కుమార్ గంగూలీ. 1929 నుంచి 1987 వ‌ర‌కూ ఆయ‌న జీవ‌న ప్ర‌యాణం కొన‌సాగింది. నేపథ్య గాయకుడు, సంగీతద‌ర్శ‌కుడు, నటుడుగా అత‌డు సేవ‌లందించారు. ఆధునిక భారతీయ సంగీత చరిత్రలో అత్యంత ప్రభావవంతమైన గాయకులలో ఒకరిగా ఆయన చ‌రిత్ర‌కెక్కారు. భారత ఉపఖండంలో అత్యంత ప్రజాదరణ పొందిన గాయకులలో ఒకరు. వివిధ స్వరాలలో పాటలు పాడే సామర్థ్యం గొప్ప పేరు తెచ్చింది. హిందీతో పాటు, ఆయన బెంగాలీ, మరాఠీ, అస్సామీ, గుజరాతీ, కన్నడ, భోజ్‌పురి, మలయాళం, ఒడియా, ఉర్దూ సహా అనేక ఇతర భారతీయ భాషలలో పాడారు. ఆయన సోదరుడు , దిగ్గజ నటుడు అశోక్ కుమార్ మాట్లాడుతూ.. కిషోర్ కుమార్ గాయకుడిగా విజయం సాధించాడని తెలిపారు. కెరీర్ లో 8 ఫిలింఫేర్ లు అందుకున్న కిషోర్ కుమార్ అంత‌ర్జాతీయంగాను పాపుల‌ర‌య్యారు.