తండ్రి స్థితి ఇలా ఉన్నా కొడుకు హీరోగా డెబ్యూ
సినీరంగంలోకి కేవలం సినిమా వాళ్ల పిల్లలే కాదు.. ఇతర రంగాల ప్రముఖుల పిల్లలు బరిలోకొస్తుంటారు.
By: Tupaki Desk | 16 May 2025 9:25 AM ISTసినీరంగంలోకి కేవలం సినిమా వాళ్ల పిల్లలే కాదు.. ఇతర రంగాల ప్రముఖుల పిల్లలు బరిలోకొస్తుంటారు. అయితే ఇలా వచ్చి అలా వెళ్లేవాళ్లే ఎక్కువ. సినిమా స్టార్ గా ఏలేయాలని కలలు కన్నంత సులువు కాదు ఇక్కడ రాణించడం. ఈ విషయాన్ని చాలా మంది అర్థం చేసుకుని తిరిగి తమ సొంత వ్యాపార మార్గాల్ని అన్వేషించారు. కొందరు పారిశ్రామికవేత్తలు, బడా వ్యాపారులు, రాజకీయ నాయకుల పిల్లలు సరదాగా ఓ సినిమా చేద్దాం! అని భావించి కోట్లకు కోట్లు వెదజల్లి సరదా తీర్చుకున్న సందర్భాలున్నాయి.
అయితే ఇండస్ట్రీనే కొనేసేంత స్థితిమంతుడు, బిలియనీర్ గాలి జనార్థన్ రెడ్డి కుమారుడు కిరీటి సినీపరిశ్రమలో ఎంట్రీ ఇస్తున్నారన్న వార్త కొన్నేళ్ల క్రితం సంచలనంగా మారింది. కర్నాటకలో ప్రముఖ పారిశ్రామిక వేత్తగా, రాజకీయ నాయకుడిగా ఉన్న గాలి జనార్థన్ రెడ్డిపై గనుల లీజులు, అక్రమ మైనింగ్ కు సంబంధించిన వివాదాలున్నాయి. ఈ వివాదాల్లోనే ఆయనను అరెస్ట్ చేసి జైలు శిక్ష విధించారు.
అయితే తండ్రి జైలులో ఉండగానే, కుమారుడు సినీహీరోగా ఎంట్రీ ఇస్తుండడం చర్చగా మారింది. గాలి జనార్థన్ రెడ్డి కుమారుడు కిరీటి హీరోగా నటించిన `జూనియర్` సినిమాని రిలీజ్ కి తెస్తుండడం చర్చగా మారింది. ఈ సినిమాలో శ్రీలీల కథానాయికగా నటించింది. దీనికి ఏకంగా బాహుబలి సినిమాటోగ్రాపర్ కేకే సెంథిల్ కుమార్, ఫైట్ మాస్టర్ పీటర్ హెయిన్స్ వంటి ప్రముఖులు పని చేసారు. రాక్ స్టార్ దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. అలాగే సినిమాలో కథానాయకుడి అక్క పాత్రలో జెనీలియా లాంటి క్రేజీ స్టార్ నటించారు. శ్రీలీల లాంటి ఎనర్జిటిక్ హీరోయిన్ కూడా ఇందులో నటించడం ఆసక్తికరం. త్వరలోనే ట్రైలర్ ని లాంచ్ చేస్తారని సమాచారం. ఇప్పుడు ఈ సినిమాని బహుభాషల్లో పాన్ ఇండియా కేటగిరీలో విడుదల చేస్తారని కథనాలొస్తున్నాయి. అయితే కుమారుడు సినీహీరోగా ఎంట్రీ ఇవ్వడం అనేది ఏ తండ్రికి అయినా ఎమోషనల్ మూవ్ మెంట్. అది అరుదైన అందమైన క్షణం. కానీ తండ్రి జైల్లో ఉండగా, ఇలా డ్రమటిగ్గా కొడుకు సినీఎంట్రీ ఇవ్వడం చర్చగా మారింది.
