కేజీఎఫ్ - కల్కి టోన్‌తో 'కింగ్ డమ్'
సౌత్ సినిమాలో ఇటీవల వచ్చిన పెద్ద చిత్రాల్లో కేజీఎఫ్, కల్కి 2898 ఎడి చిత్రాలు చాలా ప్రభావం చూపాయి. ఇప్పుడు గౌతమ్ తిన్ననూరి- విజయ్ దేవరకొండపైనా ఈ ప్రభావం కనిపిస్తోంది.
By: Tupaki Desk | 27 July 2025 10:00 PM ISTఏదైనా సినిమాలో దృశ్యాలు మనల్ని వెంటాడుతున్నాయంటే అందులో చాలా విషయం ఉందనే అర్థం. సినిమా నచ్చితేనే అందులోని దృశ్యాలు వెంటాడతాయి.. అవి ఎప్పటికీ కళ్లలోనే ఉండిపోతాయి. ఏళ్ల తరబడి జ్ఞాపకాల్లోంచి తీసేయలేం. అంత గొప్ప ప్రభావం అరుదుగా కొన్ని సినిమాతోనే కుదురుతుంది. అవతార్, 300, గ్లాడియేటర్, అవెంజర్స్, సూపర్ మేన్ ఇవన్నీ ప్రజల హృదయాల్లో ఎప్పటికీ నిలిచి ఉండటానికి వాటిలో విజువల్స్, పాత్రల చిత్రణ, కలర్ గ్రేడింగ్, బీజీఎం, యాక్షన్ పార్ట్ వగైరా వగైరా అంశాలు ఎన్నో ఉంటాయి. గెరార్డ్ బట్లర్ తెరకెక్కించిన వార్ బ్యాక్ డ్రాప్ సినిమా 300 ప్రభావం కొన్నేళ్ల పాటు ఫిలింమేకర్స్ మైండ్ పై పని చేసింది. అందులో రాజమౌళి కూడా ఉన్నాడు. బాహుబలికి స్ఫూర్తినిచ్చినది 300 మూవీ. ఆస్కార్ విన్నింగ్ `గ్లాడియేటర్` ప్రభావం చాలా సినిమాలపై ఉంది.
సౌత్ సినిమాలో ఇటీవల వచ్చిన పెద్ద చిత్రాల్లో కేజీఎఫ్, కల్కి 2898 ఎడి చిత్రాలు చాలా ప్రభావం చూపాయి. ఇప్పుడు గౌతమ్ తిన్ననూరి- విజయ్ దేవరకొండపైనా ఈ ప్రభావం కనిపిస్తోంది. తాజాగా రిలీజైన `కింగ్ డమ్` ట్రైలర్ చూడగానే కేజీఎఫ్‌లోని డార్క్ థీమ్, కల్కి 2898 ఎడిలోని గాంభీర్యం కనిపిస్తోంది. ఇందులో కూడా కేజీఎఫ్ నటులు ఉన్నారు. ఎంపిక చేసుకున్న బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా కొంతవరకూ ఆ ప్రభావం చూపెడుతోంది. అనిరుధ్ రవిచందర్ బీజీఎం ఉత్సుకత పెంచుతోంది. ముఖ్యంగా అటవిక గ్యాంగ్ స్టర్ నేపథ్యం చూడగానే, ఇది మరో కేజీఎఫ్- కల్కి బ్లెండెడ్ ప్రపంచంలా విస్మయపరిచింది. విజువల్స్ లో కలర్ టోన్ చూడగానే కేజీఎఫ్, కల్కి ప్రభావం దర్శకుడిపై ఉందని అర్థమవుతోంది. మనసుపై బలమైన ముద్ర వేసే కలర్ గ్రేడింగ్, లొకేషన్ల ఎంపిక కనిపిస్తోంది.
అయితే ఎప్పుడూ ఒక హిట్టయిన సినిమాని ఫిలింమేకర్స్ అనుకరించకూడదు. ఈ విషయంలో గౌతమ్ తిన్ననూరి చాలా కసరత్తు చేసి, `కింగ్ డమ్` కథను ఎలివేట్ చేసాడని అర్థమవుతోంది. ఇది కూడా అన్నదమ్ములు కథ. అన్నను వెతుక్కుంటూ లంకకు వెళ్లే తమ్ముడి కథ. గ్యాంగ్ స్టర్ల మధ్య అతడు ఎలాంటి పోరాటం సాగించాడు? అనే కథను తెరపై చూపిస్తున్నారు. మాస్ యాక్షన్ కంటెంట్ కి తగ్గట్టు విజయ్ దేవరకొండ ఆహార్యం ఎంతగానో ఆకట్టుకుంటోంది. అయితే ట్రైలర్ తో కథను ఉద్దేశపూర్వకంగా లీక్ చేసారు కాబట్టి, సినిమాలోని ప్రతి ఫ్రేమ్ లో హై ఏంటో చూపించాల్సి ఉంటుంది. గౌతమ్ తిన్ననూరి పనితనాన్ని తెరపై వీక్షించాల్సి ఉంది.
