కింగ్‌డమ్ ట్రైలర్.. అందరి కళ్లూ ఆయనపైనే!
అయితే ట్రైలర్ మొత్తం మీద అందరినీ ఆకట్టుకున్న మరో అంశం ఏంటంటే మలయాళ నటుడు వెంకిటేష్ వీపీ స్క్రీన్ ప్రెజెన్స్.
By: Tupaki Desk | 27 July 2025 3:36 PM ISTటాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ గత కొన్ని సినిమాలుగా వరుస ఫ్లాపుల్లో ఉన్నారు. ప్రస్తుతం విజయ్ దేవరకొండ, గౌతమ్ తిన్ననూరి కాంబినేషన్ లో కింగ్‌డమ్ అనే సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. భాగ్య శ్రీ బోర్సే కింగ్‌డమ్ లో హీరోయిన్ గా నటిస్తుండగా, ఈ సినిమా జులై 31న పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రానుంది.
ట్రైలర్‌కు విశేష స్పందన
రిలీజ్ దగ్గర పడుతున్న నేపథ్యంలో చిత్ర యూనిట్ ప్రమోషన్స్ వేగాన్ని పెంచింది. అందులో భాగంగానే శనివారం సాయంత్రం కింగ్‌డమ్ ట్రైలర్ ను రిలీజ్ చేయగా ట్రైలర్ కు ఆడియన్స్ నుంచి విపరీతమైన రెస్పాన్స్ వస్తోంది. గౌతమ్ దర్శకత్వం, విజయ్ యాక్టింగ్, అనిరుధ్ మ్యూజిక్ ట్రైలర్ ను బాగా ఎలివేట్ చేయడంతో పాటూ సినిమాపై అంచాల్ని బాగా పెంచేశాయి.
విలన్ గా మలయాళ నటుడు
ట్రైలర్ చూస్తుంటే కింగ్‌డమ్ ఎమోషనల్ యాక్షన్ డ్రామాగా అనిపిస్తోంది. అయితే ట్రైలర్ మొత్తం మీద అందరినీ ఆకట్టుకున్న మరో అంశం ఏంటంటే మలయాళ నటుడు వెంకిటేష్ వీపీ స్క్రీన్ ప్రెజెన్స్. ఆయన ట్రైలర్ లో కనిపించింది కేవలం రెండు షాట్లలోనే అయినా అందరినీ తన లుక్స్ తో ఎట్రాక్ట్ చేశారు. కింగ్‌డమ్ లో వెంకిటేష్ విలన్ క్యారెక్టర్ చేస్తున్నారు.
మలయాళంలో రెగ్యులర్ గా సినిమా, టీవీ పరిశ్రమల్లో పని చేసే వెంకిటేష్, కింగ్‌డమ్ ట్రైలర్ తో సృష్టించిన ప్రభంజనం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. వెంకిటేష్ మలయాళంలో ఒడియన్, తట్టంపురత్ అచ్యుతన్, వెలిపడింటే పుసక్తం లాంటి సినిమాల్లో నటించి నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. 2014 నుంచి మలయాళ ఇండస్ట్రీలో నటుడిగా కొనసాగుతున్న వెంకిటేష్, ఇప్పుడు కింగ్‌డమ్ సినిమాతో టాలీవుడ్ లోకి అరంగేట్రం చేస్తున్నారు.
ట్రైలర్ లో చూపించిన దాన్ని బట్టి చూస్తుంటే వెంకిటేష్ సినిమాలో నెగిటివ్ రోల్ చేస్తున్నట్టు అర్థమవుతుంది కానీ ఆయన పాత్రకు సంబంధించిన వివరాలు మాత్రం ఇంకా రివీల్ చేయలేదు. గౌతమ్ సినిమాల్లో విలన్ పెద్దగా కనిపించరు కానీ ఇప్పుడు కింగ్‌డమ్ లో వెంకిటేష్ క్యారెక్టర్ మాత్రం గౌతమ్ గత సినిమాలకు చాలా భిన్నంగా కనిపిస్తోంది.
కింగ్‌డమ్‌పైనే విజయ్ ఆశలు
వరుస ఫ్లాపుల తర్వాత వస్తున్న సినిమా కావడంతో విజయ్ దేవరకొండ కింగ్‌డమ్ సినిమాపై చాలానే ఆశలు పెట్టుకున్నారు. వెంకన్న దేవుడు దయ తలిస్తే తాను కింగ్‌డమ్ సినిమాతో చాలా పెద్దోడిని అవుతానని, వెళ్లి టాప్ లో కూర్చుంటానని చెప్పడం చూస్తుంటే ఈ సినిమాపై విజయ్ ఎంత కాన్ఫిడెంట్ గా ఉన్నారో తెలియచేస్తుంది. ఈ సినిమాను నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మించిన సంగతి తెలిసిందే.
