కింగ్ డమ్ న్యూ రిలీజ్ ప్లాన్.. వర్కౌట్ అయ్యేనా?
ఇప్పటికే మే 30న విడుదల చేస్తామని ముందుగా ప్రకటించిన మేకర్స్, తర్వాత జూలై 4కి వాయిదా వేశారు.
By: Tupaki Desk | 6 July 2025 5:00 PM ISTటాలీవుడ్‌లో రౌడీ హీరోగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న విజయ్ దేవరకొండ నటిస్తున్న లేటెస్ట్ సినిమా కింగ్ డమ్. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహిస్తున్న ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్ కు మొదటి నుంచి మంచి హైప్ ఉంది. అయితే సినిమాకు సంబంధించిన షూటింగ్, టీజర్, విజువల్స్ బాగానే ఆకట్టుకున్నా… రిలీజ్ విషయంలో మాత్రం కన్ఫ్యూజన్ కొనసాగుతూనే ఉంది.
ఇప్పటికే మే 30న విడుదల చేస్తామని ముందుగా ప్రకటించిన మేకర్స్, తర్వాత జూలై 4కి వాయిదా వేశారు. కానీ ఆ తేదీకి నితిన్ తమ్ముడు సినిమా రావడంతో మళ్ళీ ‘కింగ్ డమ్’ రిలీజ్ పోస్ట్ పోన్ అయింది. దీంతో చివరికి జూలై 25నే లాక్ చేశారని ప్రకటించారు. కానీ తాజా సమాచారం ప్రకారం ఆ తేదీకి కూడా సినిమా రావడం సాధ్యపడదని తెలుస్తోంది. అదే రోజు ముందు రోజు పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు చిత్రం రావడం, ఇంకా పోస్ట్ ప్రొడక్షన్ పూర్తి కాకపోవడం ప్రధాన కారణాలుగా చెబుతున్నారు.
ఇదే క్రమంలో తాజాగా జూలై 31న కింగ్ డమ్ మూవీని విడుదల చేయాలని మేకర్స్ ఆలోచిస్తున్నారని సమాచారం. ఆ రోజు బుధవారం కావడంతో వర్కింగ్ డే అయినా.. ఆ తర్వాత వీకెండ్, 1వ తేదీ నుంచి కొత్త వారాంతం వుంటుందనే లెక్కలు ఉన్నట్లు ఇండస్ట్రీలో ప్రచారం జరుగుతోంది. ఇక ఆగస్టు 14న రజినీకాంత్ 'కూలీ', ఎన్టీఆర్ 'వార్ 2' సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి. దాంతో జూలై 31 నుంచి ఆగస్టు 13 వరకు దాదాపు రెండు వారాల స్పేస్ వుంటుందని భావిస్తున్నట్లు తెలుస్తోంది.
ఈ రెండు వారాలు సరిపోతాయా..? అనే ప్రశ్నలు కూడా వినిపిస్తున్నాయి. ఎందుకంటే ‘కింగ్డమ్’ టీజర్‌కు మాత్రం మంచి స్పందన వచ్చినా, ట్రైలర్ ఇంకా రాలేదు. మ్యూజికల్ ప్రమోషన్స్ కూడా జరగాల్సి ఉంది. మరోవైపు మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ ప్రస్తుతం ‘కూలీ’ వర్క్‌తో బిజీగా ఉన్నారట. ఆయన పనులు పూర్తయిన తరువాతే కింగ్‌డమ్ చివరి రీఫినిష్ కార్యక్రమాలు పూర్తి అవుతాయని సమాచారం.
ఇలాంటి పరిస్థితుల్లో మేకర్స్ దూకుడుగా ప్రమోషన్స్ చేయకపోతే, బజ్ తగ్గిపోతుందని సినీ విశ్లేషకుల అభిప్రాయం. మరోవైపు ఆడియన్స్ మైండ్‌లో సినిమా ఎప్పుడు వస్తుందో అన్న అనిశ్చితి కలుగుతోంది. విజయ్ దేవరకొండ వంటి స్టార్ హీరో ఉన్నప్పటికీ ఇలా గందరగోళంగా ఉంటే హైప్ తగ్గే ప్రమాదం ఉంది. అందుకే జూలై 31నైనా రిలీజ్ ఫిక్స్ చేస్తే స్పష్టత వస్తుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు. మరి మేకర్స్ ఎప్పుడు క్లారిటీ ఇస్తారో వేచి చూడాలి.
