ఎలాంటి పాత్రలోనైనా నటనలో కింగే!
కుబేర సినిమాలో తన పాత్ర చాలా కొత్తగా ఉంటుందని, ఆ పాత్ర అందరినీ మెప్పిస్తుందని నాగార్జున రిలీజ్ కు ముందు నుంచే చెప్తూ వచ్చాడు.
By: Tupaki Desk | 21 Jun 2025 7:15 AMకోలీవుడ్ స్టార్ హీరో ధనుష్- నాగార్జున కలిసి శేఖర్ కమ్ముల దర్శకత్వంలో చేసిన సినిమా కుబేర. తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాకు అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చి హౌస్ ఫుల్స్ తో హిట్ దిశగా దూసుకెళ్తుంది. సినిమా చూసిన వారంతా శేఖర్ కమ్ముల రైటింగ్, డైరెక్షన్ తో పాటూ ధనుష్, నాగార్జునల యాక్టింగ్ గురించి కూడా తెగ మాట్లాడుకుంటున్నారు.
కుబేర సినిమాలో తన పాత్ర చాలా కొత్తగా ఉంటుందని, ఆ పాత్ర అందరినీ మెప్పిస్తుందని నాగార్జున రిలీజ్ కు ముందు నుంచే చెప్తూ వచ్చాడు. రిలీజ్ కు ముందు నాగ్ మాటల్ని విని ప్రమోషన్స్ కోసం అలా చెప్తున్నాడనుకున్నారు కానీ నాగ్ చెప్పిన మాటలు ప్రతీదీ నిజమని కుబేర చూశాక అర్థమవుతుంది. కుబేరలో దీపక్ అనే సీబీఐ ఆఫీసర్ రోల్ లో నాగ్ ఒదిగిపోయి నటించాడు.
టాలీవుడ్ స్టార్ హీరోల్లో ఒకడైన నాగార్జున కుబేర లాంటి సినిమాలో ఓ క్యారెక్టర్ చేయడమే కాకుండా సినిమా విజయంలో కీలక పాత్ర పోషించడం విశేషం. హీరోగా సినిమాలు చేస్తున్న నాగార్జున దీపక్ లాంటి పాత్రలో నటించడమే కాకుండా ఆ పాత్రను తన భుజాలపై మోసి అందరినీ మెప్పించడం సాహసమనే చెప్పాలి. అసలే టాలీవుడ్ లో నాగార్జున ఇమేజ్ వేరు.
టాలీవుడ్ మన్మథుడిగా అందరి మనసుల్ని గెలుచుకున్న నాగ్, కుబేర సినిమాలో డీ గ్లామర్ రోల్ లో కనిపించడంతో పాటూ తన మేకోవర్ నుంచి బాడీ లాంగ్వేజ్ వరకు చాలా కొత్తగా కనిపించి తన నటనతో ఆకట్టుకున్నాడు. కుబేరలో నాగ్ నటనకు కేవలం ఆడియన్స్ నుంచి మాత్రమే కాకుండా విమర్శకుల నుంచి కూడా ప్రశంసలొస్తున్నాయి. కేవలం సినిమాలో కీలక పాత్ర చేయడమే కాకుండా ఆ సినిమాను తన వంతు బాధ్యతగా ప్రమోట్ కూడా చేసి కుబేర సక్సెస్ లో కీలకమయ్యాడు నాగ్.
యాక్టర్ గా తను పలు ప్రయోగాలు చేస్తున్నానని ఇప్పటికే చెప్పిన కింగ్ నాగార్జున, గతంలో బ్రహ్మాస్త్ర సినిమాలో కూడా కీలక పాత్రలో నటించి మెప్పించాడు. ఇప్పుడు కుబేరలో దీపక్ గా అందరినీ మెప్పించి యాక్టర్ అన్నప్పుడు ఎలాంటి క్యారెక్టర్ లో అయినా జీవించగలగాలని నిరూపించాడు. కుబేరలో నాగార్జున చేసింది సాఫ్ట్ క్యారెక్టరే అయినా అందులో కూడా నెగిటివ్ షేడ్స్ కనిపిస్తాయి. అలాంటి కత్తి మీద సాము లాంటి పాత్రను నాగ్ చాలా అలవోకగా చేసి ఇప్పుడు ఇండస్ట్రీలో టాక్ ఆఫ్ ది టౌన్ గా మారాడు. కుబేర తర్వాత నాగార్జున రజినీకాంత్ హీరోగా వస్తోన్న కూలీ సినిమాలో విలన్ గా నటించాడు. కుబేరలో దీపక్ గా డీ గ్లామర్ రోల్ లో నటించి మెప్పించిన నాగ్, కూలీ సినిమాలో సైమన్ గా స్టైలిష్ పాత్రలో మెరవనున్నాడు.