'కల్కి 2898 AD' స్టార్లతో కింగ్ తెలివైన గేమ్
తాజా సమాచారం మేరకు కింగ్ చిత్రంలో దీపిక పదుకొనే ఒక అతిథి పాత్రలో నటిస్తుందని తెలుస్తోంది.
By: Tupaki Desk | 1 May 2025 5:00 AM ISTబాలీవుడ్ బ్యాడ్ ఫేజ్‌లో ఉంది. వరుస ఫ్లాపులతో తల్లడిల్లిపోతోంది. ఇటీవలే విడుదలైన అక్షయ్ కుమార్ కేసరి 2, సన్నీడియోల్ జాత్ ఆశించిన ఫలితాన్ని అందుకోలేదు. తదుపరి సీక్వెల్ సినిమాలు విడుదలకు సిద్ధమవుతున్నా వాటికి అంతగా హైప్ లేదు. ఇలాంటి సమయంలో ఎవరైనా పెద్ద స్టార్ బాలీవుడ్‌ని ఆదుకునేందుకు రావాలి. ఇంతకుముందు పఠాన్-జవాన్ చిత్రాలతో కింగ్ ఖాన్ హిందీ చిత్రసీమను ఆదుకున్నాడు. అతడు గ్రేట్ కంబ్యాక్ చూపించడమే గాక, నీరసించిపోయిన ఇండస్ట్రీకి జవజీవాలు పోసాడు.
ఇకపైనా కింగ్ ఖాన్ తన రోల్ ని కంటిన్యూ చేయాల్సిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. చాలామంది అగ్ర కథానాయకులు ఆశించిన విజయాల్ని అందించంలో విఫలమవుతున్నారు. సల్మాన్ ఖాన్, అక్షయ్, అజయ్ దేవగన్, రణవీర్ సింగ్, జాన్ అబ్రహాం.. వీళ్లెవరూ పరిశ్రమను ఆదుకోవడం లేదు. అందుకే ఇప్పుడు అందరి దృష్టి కింగ్ ఖాన్ షారూఖ్ పైకి మళ్లింది. అతడు నటిస్తున్న తదుపరి చిత్రం 'కింగ్' వచ్చే ఏడాది ద్వితీయార్థంలో విడుదలవుతుంది. ఈ ఏడాది జూన్ లో కింగ్ చిత్రీకరణను ప్రారంభిస్తారని సమాచారం. ప్రస్తుతం దర్శకుడు సిద్ధార్థ్ ఆనంద్ ప్రీప్రొడక్షన్ పనుల్ని పర్యవేక్షిస్తున్నారు. స్టార్ కాస్టింగ్ ఎంపికలు సాగుతున్నాయి. ఇప్పటికే ఈ చిత్రంలో అభిషేక్ బచ్చన్, సుహానా ఖాన్ కీలక పాత్రల్లో నటిస్తున్నారని టీమ్ ప్రకటించింది.
తాజా సమాచారం మేరకు కింగ్ చిత్రంలో దీపిక పదుకొనే ఒక అతిథి పాత్రలో నటిస్తుందని తెలుస్తోంది. ఈ చిత్రంలో కథానాయిక పాత్ర కోసం కరీనా కపూర్ ఖాన్, కత్రిన కైఫ్ లతో షారూఖ్ చర్చించారు. ఆ ఇద్దరిలో ఎవరు నటిస్తారు? అన్నది ఇంకా తేలలేదు. ఇంతలోనే కీలకమైన అతిథి పాత్ర కోసం దీపికను ఒప్పించారని సమాచారం. నిజానికి దీపిక తన చిత్రంలో నటించాలని ఖాన్ చాలా కాలంగా భావిస్తున్నా, దీపిక తన బిడ్డతో సమయాన్ని వెచ్చించాల్సి ఉన్నందున కాల్షీట్లు కేటాయించలేకపోయింది. అయితే కింగ్ చిత్రీకరణ రకరకాల కారణాలతో ఆలస్యమైంది. ఈ ఆలస్యం కారణంగా ఇప్పుడు దీపిక కాల్షీట్లు అందుబాటులోకి వచ్చాయని తెలుస్తోంది.
ఈ ఏడాది ద్వితీయార్థంలో దీపికపై సన్నివేశాల్ని 10రోజుల్లో పూర్తి చేస్తారని తెలుస్తోంది. షారూఖ్ తో ఓంశాంతి ఓం చిత్రంలో నటించిన దీపిక, ఆ తర్వాత ఐదు సినిమాల్లో నటించింది. ఇటీవల యాక్షన్ ప్యాక్డ్ పఠాన్ లోను యాక్షన్ రాణిగా మెరిసింది. ఇప్పుడు షారూఖ్ తో ఆరోసారి నటించే అవకాశం దక్కించుకుంది. అంతేకాదు.. లేటెస్ట్ సమాచారం మేరకు ఈ చిత్రంలో అమితాబ్ బచ్చన్ ఓ అతిథి పాత్రలో నటించేందుకు ఆస్కారం ఉందని గుసగుస వినిపిస్తోంది. ఒకవేళ ఇదే నిజమైతే బ్లాక్ బస్టర్ 'కల్కి 2898 ఏడి'లో నటించిన దీపిక- అమితాబ్ జోడీని షారూఖ్ తెలివిగా తన ప్రాజెక్టులోకి తెస్తున్నాడని భావించాలి. నాగ్ అశ్విన్ 'కల్కి 2898 ఏడి'లో దీపిక, అమితాబ్ లకు అత్యంత కీలక పాత్రల్ని ఆఫర్ చేయడం ద్వారా ఆ ఇద్దరి విలువను అమాంతం పెంచాడు. ఇప్పుడు అది షారూఖ్ కింగ్ బాక్సాఫీస్ విజయానికి సహకారిగా మారవచ్చు. అయితే ఆ ఇద్దరి ఎంపికకు సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.
