భార్యను ఆకాశానికెత్తేసిన స్టార్ హీరో
యష్ రాజ్ ఫిలింస్ `వార్ 2` క్రిటిక్స్, ప్రజల నుంచి మిశ్రమ స్పందనలను అందుకున్న సంగతి తెలిసిందే.
By: Sivaji Kontham | 18 Aug 2025 8:00 PM ISTయష్ రాజ్ ఫిలింస్ `వార్ 2` క్రిటిక్స్, ప్రజల నుంచి మిశ్రమ స్పందనలను అందుకున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా స్టార్ పవర్ కారణంగా ఆరంభ వారంతంలో 200 కోట్లు వసూలు చేసినా కానీ, హిట్ టాక్ లేకపోవడం వల్ల సోమవారం అసలైన టెస్ట్ ఎదుర్కొంటోంది. మరోవైపు వార్ 2లో నటీనటుల ప్రదర్శన ఎలా ఉందో స్క్రుటినీ జరుగుతోంది.
ఈ చిత్రంలో హృతిక్, ఎన్టీఆర్ సమాంతరంగా ఒకరితో ఒకరు పోటీపడుతూ నటించారు. అయితే సరైన కథ కథనం లేకపోవడం, వీఎఫ్ఎక్స్ నిరాశపరిచాయని విశ్లేషించారు. ఇక ఈ సినిమా కథానాయిక మ్యాటర్ కి వస్తే.. కియరా అద్వాణీ బోల్డ్ పెర్ఫామెన్స్, స్టంట్స్, స్టైల్ కంటెంట్ ఉర్రూతలూగించాయి. ముఖ్యంగా యాక్షన్ సీన్స్ లో కియరా ప్రదర్శన ఆకట్టుకుందని, తన పాత్ర సినిమాలో అత్యంత కీలకమైనదని ప్రశంసలు దక్కాయి.
ఇదే విషయాన్ని ఇప్పుడు కియరా భర్త, ప్రముఖ హీరో సిద్ధార్థ్ మల్హోత్రా గుర్తు చేస్తూ, తన ఆనందాన్ని వ్యక్తం చేసాడు. `వార్ 2`లో తన భార్య కియారా అద్వానీని చూసిన తర్వాత సిద్ధార్థ్ మల్హోత్రా ప్రశంసించకుండా ఉండలేకపోయారు. సోషల్ మీడియా లో సినిమా గ్రాండ్ స్కేల్, కియారా నటనను ప్రశంసిస్తూ నోట్ రాసాడు. అతడి నోట్ ప్రకారం..``ఇది ఎంత గొప్ప ప్రయాణం! యాక్షన్, స్కేల్, చాలా స్టైల్ ఆకట్టుకున్నాయి. కియరా అద్వాణీ తెరపై ప్రదర్శించిన గ్రేస్, ఎనర్జీ అద్భుతం. హృతిక్.. ఎప్పటిలాగే ఆయన క్లాసే వేరు. జూ.ఎన్టీఆర్ తెరపై అద్భుతమైన పవర్‌హౌస్ .. అన్నింటికీ ప్రాణం పోసినందుకు అయాన్ ముఖర్జీ టీమ్‌కు బిగ్ షౌటింగ్`` అని ప్రశంసలు కురిపించాడు.
వార్ 2లో కావ్య లూత్రా పాత్రలో నటించింది కియరా. వైఆర్ఎఫ్ గూఢచారి విశ్వంలో ఇది తొలి అవకాశం. టైగర్, పఠాన్ తర్వాత వార్ స్పై యూనివర్శ్ లో భారీ అంచనాలున్న ఫ్రాంఛైజీ. అలాంటి విశ్వంలో హృతిక్ తో కలిసి హై ఆక్టేన్ యాక్షన్ సన్నివేశాలు, అద్భుతమైన కెమిస్ట్రీతో అలరించింది కియరా. తన భర్త ప్రశంసలకు కియరా వెంటనే సామాజిక మాధ్యమాల్లో ప్రతిస్పందించింది. మీ ప్రేమ పెద్దగా మాట్లాడుతుంది... మీ చిరునవ్వులు, మీ చీర్స్, మీ ఉత్సాహం మా హృదయాలను ఆనందంతో నింపుతుంది.. వార్ 2 సినిమాల్లో`` అని రిప్లయ్ పంపింది కియరా. ఈ జంట మధ్య అన్యోన్యత ఇప్పుడు అందరి హృదయాలను గెలుచుకుంటోంది.
