Begin typing your search above and press return to search.

వెండితెర వెన్నెల, అందాల రాశి మధుబాల బయోపిక్‌ నిజాలు

మొదట పలువురు అగ్ర తారల పేర్లు వినిపించినప్పటికీ చివరకు కియారాను ఫైనల్ చేశారని సోషల్ మీడియాలో వార్తలు హల్చల్ చేస్తున్నాయి.

By:  Sivaji Kontham   |   8 March 2026 11:00 PM IST
వెండితెర వెన్నెల, అందాల రాశి మధుబాల బయోపిక్‌ నిజాలు
X

భారతీయ చలనచిత్ర చరిత్రలో `వీనస్ ఆఫ్ ఇండియన్ సినిమా`గా పేరుగాంచిన దివంగ‌త క‌థానాయిక‌ మధుబాల జీవిత కథను వెండితెరపై ఆవిష్కరించేందుకు సన్నాహాలు జరుగుతున్నట్లు బాలీవుడ్ వర్గాల్లో గట్టి ప్రచారం సాగుతోంది. ముఖ్యంగా ఈ భారీ ప్రాజెక్టుకు క‌ళాత్మ‌క చిత్రాల దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వం వహిస్తుండటంతో అంచనాలు ఆకాశాన్ని తాకాయి. ఈ చిత్రంలో మధుబాల పాత్రలో నటించే అవకాశం సౌత్ - నార్త్ ప్రేక్షకులకు సుపరిచితమైన కియారా అద్వానీకి దక్కిందని ప్ర‌చారం సాగుతోంది. మొదట పలువురు అగ్ర తారల పేర్లు వినిపించినప్పటికీ చివరకు కియారాను ఫైనల్ చేశారని సోషల్ మీడియాలో వార్తలు హల్చల్ చేస్తున్నాయి.

అయితే ఈ ప్రాజెక్టుపై ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. భన్సాలీ టీమ్ కానీ, కియారా అద్వానీ కానీ దీనిని ధృవీకరించలేదు. అసలు ఈ ప్రాజెక్ట్ ప్రస్తుతం ఏ దశలో ఉంది? స్క్రిప్ట్ వర్క్ పూర్తయిందా లేదా అనే విషయాలపై పూర్తి స్పష్టత రావాల్సి ఉంది. మొఘల్-ఎ-ఆజం, చల్తీ కా నామ్ గాడి వంటి క్లాసిక్ చిత్రాలతో భారతీయ ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేసిన మధుబాల పాత్రను పోషించడం కియారాకు ఒక గొప్ప సవాలుతో కూడుకున్న విషయమే.

గతంలో కూడా మధుబాల బయోపిక్ తెరకెక్కించాలని పలువురు ప్రయత్నించారు. ముఖ్యంగా మధుబాల సోదరి మధుర్ భూషణ్ ఈ ప్రాజెక్ట్ కోసం చాలా కాలంగా ప్రయత్నాలు చేస్తున్నారు. భన్సాలీ కంటే ముందు కొందరు దర్శకులు ఈ కథపై ఆసక్తి చూపించినా కానీ.. కుటుంబ సభ్యుల అనుమతులు, కాపీరైట్ సమస్యల కారణంగా అవి కార్యరూపం దాల్చలేదు. ఇప్పుడు భన్సాలీ వంటి అగ్ర దర్శకుడు ఈ బాధ్యత తీసుకున్నారనే వార్త సినీ అభిమానుల్లో కొత్త ఆశలు రేకెత్తిస్తోంది.

గ‌తంలో న‌టీమ‌ణుల బ‌యోపిక్స్:

బాలీవుడ్ నటీమణుల జీవిత విశేషాలతో గతంలో కూడా కొన్ని విజయవంతమైన బయోపిక్ లు వచ్చాయి. ఇందులో ప్రధానంగా చెప్పుకోవాల్సింది విద్యాబాలన్ నటించిన `ది డర్టీ పిక్చర్`. సిల్క్ స్మిత జీవితం ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించడమే కాకుండా విద్యాబాలన్‌కు జాతీయ అవార్డును కూడా తెచ్చిపెట్టింది. అలాగే కంగనా రనౌత్ నటించిన `తలైవి` (జయలలిత బయోపిక్) కూడా నటీమణుల జీవిత కథలను వెండితెరపై ఆవిష్కరించిన చిత్రాల్లో ఒకటి.

మరోవైపు ఆలియా భట్ నటించిన `గంగూబాయి కతియావాడి` నేరుగా నటి బయోపిక్ కాకపోయినా.. ఒక మహిళా శక్తిని భన్సాలీ ఏ స్థాయిలో చూపిస్తారో నిరూపించింది. అలాగే స్మితా పాటిల్, మీనా కుమారి వంటి అలనాటి నటీమణుల జీవితాలపైనా గతంలో డాక్యుమెంటరీ తరహా ప్రయత్నాలు జరిగాయి. కానీ మధుబాల వంటి లెజెండరీ నటి బయోపిక్ అనేది కచ్చితంగా ఒక భారీ స్థాయి ప్రాజెక్ట్ అవుతుంది. దివంగ‌త ప్ర‌ధాని ఇందిరా గాంధీ జీవిత క‌థ‌లో కంగ‌న న‌ట‌న‌కు మంచి పేరొచ్చింది.

ఇక మధుబాల వ్యక్తిగత జీవితం అంటేనే అనేక రహస్యాలు, వివాదాలు, విషాదాల సమాహారం. దిలీప్ కుమార్‌తో ఆమె నడిపిన విఫల ప్రేమాయణం, కిషోర్ కుమార్‌తో వివాహం, ఆపై చిన్న వయసులోనే గుండె సంబంధిత వ్యాధితో ఆమె అనుభవించిన వేదన.. ఇవన్నీ పెద్ద తెరపై ఎలా చూపిస్తారనేది ఆసక్తికరంగా మారింది. కేవలం అందాన్ని మాత్రమే కాకుండా ఈ న‌టి జీవితంలోని చీకటి కోణాలను.. వివాదాలను కూడా భన్సాలీ తన మార్క్ మేకింగ్‌తో తెర‌పై ఆవిష్కరిస్తారని నెటిజన్లు భావిస్తున్నారు.