Begin typing your search above and press return to search.

కియ‌రాపై పుకార్లు.. ఇదంతా ప్ర‌చార గిమ్మిక్కేనా?

నేటి సోషల్ మీడియా యుగంలో ఒక సినిమా గురించి ధృవీకరించని సమాచారం ఎంత వేగంగా విస్తరిస్తుందో.. నటి కియారా అద్వానీ విషయంలో మరోసారి రుజువైంది.

By:  Sivaji Kontham   |   4 May 2026 10:58 PM IST
కియ‌రాపై పుకార్లు.. ఇదంతా ప్ర‌చార గిమ్మిక్కేనా?
X

నేటి సోషల్ మీడియా యుగంలో ఒక సినిమా గురించి ధృవీకరించని సమాచారం ఎంత వేగంగా విస్తరిస్తుందో.. నటి కియారా అద్వానీ విషయంలో మరోసారి రుజువైంది. కన్నడ రాకింగ్ స్టార్ యష్ కథానాయకుడిగా గీతూ మోహన్ దాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న `టాక్సిక్` చిత్రంలో కియారా అద్వానీ కథానాయికగా నటించిన సంగ‌తి తెలిసిందే. అయితే గత కొన్ని రోజులుగా ఈ సినిమాలో యష్‌తో తనపై చిత్రీకరించిన‌ కొన్ని బో*ల్డ్ సన్నివేశాలను మార్చాలని లేదా తొలగించాలని కియారా మేకర్స్‌ను కోరినట్లు వార్తలు షికారు చేశాయి. ఈ నిరాధారమైన ప్రచారంపై కియారా తాజాగా స్పందిస్తూ ఇవన్నీ కేవలం పుకార్లని కొట్టిపారేశారు.

ఈ సినిమా టీజర్ విడుదలైనప్పటి నుండి కియారా పాత్ర చుట్టూ భారీ అంచనాలు నెలకొన్నాయి. టీజర్‌లో కనిపించిన గ్లామరస్ విజువల్స్ చూసి.. సినిమాలో ఘాటైన స‌న్నివేశాల‌కు కొద‌వేమీ ఉండ‌ద‌ని నెటిజన్లు చర్చించుకోవడం మొదలుపెట్టారు. ఈ క్రమంలోనే కియారా ఆ సీన్ల పై అభ్యంతరం వ్యక్తం చేసిందన్న వార్త సోషల్ మీడియాలో విపరీతమైన హైప్‌ను సృష్టించింది. నిజానికి ఇటువంటి వార్తలు అకారణంగా సినిమాపై క్యూరియాసిటీని పెంచడానికి కొందరు కావాలనే సృష్టిస్తుంటార‌ని నెటిజ‌నులు కామెంట్లు చేస్తున్నారు. కానీ బాక్సాఫీస్ వద్ద ఓపెనింగ్స్ కోసం ఇటువంటి గ్లామర్ లీకులను వదలడం వల్ల సినిమాలో అస‌లు మ్యాట‌ర్ పక్కదారి పట్టే ప్రమాదం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.

నటీనటుల ఇమేజ్‌ను దెబ్బతీయడానికి కూడా ఇటువంటి పుకార్లను ఒక ఆయుధంగా వాడుతుంటారు. కియారా వంటి స్టార్ హీరోయిన్ `సీన్లు మార్చమని కోరింది` అనే ప్రచారం త‌న‌ వృత్తిపరమైన అంకితభావాన్ని ప్రశ్నార్థకం చేసేలా ఉంటుంది. ఇది కేవలం కియ‌రాపైనే కాకుండా, దర్శకుడి విజన్ - సినిమా నాణ్యతపై కూడా ప్రభావం చూపుతుంది. అందుకే కియారా ఇన్‌స్టా వేదికగా ఈ వార్తలను ఖండించడం చాలా అవసరమైంది. ధృవీకరించని వార్తలు ఎంత త్వరగా ప్రజల్లోకి వెళ్తాయో ఈ ఘటన మరోసారి గుర్తు చేస్తోంది.

ఒక సినిమా విజయం అనేది కేవలం బోల్డ్ సీన్ల మీదో లేదా గ్లామర్ మీదో ఆధారపడి ఉండదు. కేవలం ఆ సీన్ల కోసమే థియేటర్లకు వచ్చే ప్రేక్షకులు.. అక్కడ అవి లేకపోయినా లేదా కథలో ప్రాధాన్యత లేకపోయినా తీవ్ర నిరాశకు గురవుతారు. దీనివల్ల నెగటివ్ మౌత్ టాక్ వచ్చి.. బలమైన కథ ఉన్నా సినిమా పరాజయం పాలయ్యే అవకాశం ఉంటుంది. పదే పదే ఇటువంటి తప్పుడు ప్రచారాలు జరగడం వల్ల కాలక్రమేణా ప్రేక్షకులు అధికారిక ప్రచారాలను కూడా నమ్మడం మానేస్తారు. ఇది మొత్తం చిత్ర పరిశ్రమకు ఒక ఆరోగ్యకరమైన పరిణామం కాదు.

ప్రస్తుతానికి `టాక్సిక్` సినిమా విడుదల తేదీ వాయిదా పడింది. జూన్ 4న విడుదల కావాల్సిన ఈ భారీ ప్రాజెక్టు కొత్త రిలీజ్ డేట్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కియారా ఇచ్చిన క్లారిటీతో ఈ బోల్డ్ సీన్ల వివాదానికి తెరపడినట్లయింది. గీతూ మోహన్ దాస్ వంటి ప్రతిభావంతురాలైన దర్శకురాలు ఈ సినిమాను ఎలా ఆవిష్కరిస్తారనేది ఇప్పుడు అసలు చర్చ. ఏదేమైనా... సినీ వార్తలను నమ్మే ముందు ప్రేక్షకులు కూడా విజ్ఞతతో వ్యవహరించాలని.. అధికారిక సమాచారం కోసమే వేచి చూడాలని ఈ ప్రహసనం తెలియజేస్తోంది.

కియ‌రా కంటే ముందు ఇలాంటి ప్ర‌చారం :

వాస్త‌వానికి కియారా అద్వానీ కంటే ముందు నయనతార, త్రిష, తమన్నా వంటి అగ్ర కథానాయికల విషయంలోనూ ఇటువంటి వార్తలు విపరీతమైన హడావుడి చేశాయి. సినిమాపై అమాంతం క్యూరియాసిటీని పెంచాలని.. సోషల్ మీడియాలో నిరంతరం చర్చ జరిగేలా చూడాలనే కుతూహలంతో కొంతమంది ఇటువంటి నిరాధారమైన వార్తలను సృష్టిస్తుంటారు. అయితే ఇవి స్వల్పకాలికంగా సినిమాకు పబ్లిసిటీని తెచ్చిపెట్టినా త‌మ‌కు జ‌రిగే డ్యామేజ్ విష‌యంలో క‌థానాయిక‌లు అలెర్ట్ అయి వివ‌ర‌ణ‌లు ఇచ్చారు.

ప్రస్తుత కాలంలో ప్రేక్షకులు కేవలం గ్లామర్ లేదా గాసిప్స్ చూసి థియేటర్లకు రావడం లేదు. వారు కేవలం కంటెంట్‌ను మాత్రమే నమ్ముతున్నారు. ప్రచారకర్తలు కేవలం వివాదాల చుట్టూ సినిమా హైప్‌ను నిర్మిస్తే.. అది విడుదలయ్యాక ఆశించిన స్థాయిలో లేకపోతే నెగటివ్ టాక్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. నటీనటులు తమ పాత్రల కోసం ఎంతో కష్టపడతారు.. కానీ ఇటువంటి పుకార్ల వల్ల వారి నటన కంటే వివాదాలకే ఎక్కువ ప్రాధాన్యత లభిస్తోంది. అందువల్ల సినిమా విజయం కోసం కేవలం `గ్లామర్ లీకుల` మీద ఆధారపడటం కంటే.. బలమైన కథను .. కంటెంట్ పై ప్రచారాన్ని నమ్ముకోవడమే చిత్ర పరిశ్రమకు దీర్ఘకాలంలో మేలు చేస్తుంది.