అక్కర్లేని సలహాలు వినను: ఖుషీ కపూర్!
అయితే తనపై వచ్చిన విమర్శలపై ఖుషీ కపూర్ తాజా ఇంటర్వ్యూలో స్పందించింది. విమర్శలు నిర్మాణాత్మకంగా ఉంటే వాటిని పట్టించుకుంటానని
By: Tupaki Desk | 21 May 2025 3:00 PM ISTఅతిలోక సుందరి శ్రీదేవి నటవారసురాలిగా పెద్ద కుమార్తె జాన్వీకపూర్ లెగసీని ముందుకు తీసుకువెళుతోంది. జాన్వీతో పాటు, ఇటీవల శ్రీదేవి చిన్న కుమార్తె ఖుషీ కపూర్ కూడా రేసులోకి వచ్చింది. ఖుషీ బ్యాక్ టు బ్యాక్ సినిమాల్లో నటించింది. ది ఆర్చీస్ వెబ్ సిరీస్ తో ఆరంగేట్రం చేసిన ఖుషీ ఆ తర్వాత లవ్ యాపా, నాదానియాన్ లాంటి చిత్రాల్లో నటించింది. కానీ ఈ రెండు సినిమాలు బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్లు అయ్యాయి. ది ఆర్చీస్ అంతగా మెప్పించలేదు. ఆ మూడింటిలో నటీనటుల ప్రదర్శనపైనా అంతగా ప్రశంసలు లేవు.
అయితే తనపై వచ్చిన విమర్శలపై ఖుషీ కపూర్ తాజా ఇంటర్వ్యూలో స్పందించింది. విమర్శలు నిర్మాణాత్మకంగా ఉంటే వాటిని పట్టించుకుంటానని, ఒకవేళ అక్కర్లేని విమర్శలు చేస్తే దానిని పట్టించుకోవాల్సిన పని లేదని కూడా ఖుషీ కపూర్ అభిప్రాయపడింది. తన కెరీర్ ఎదుగుదలకు సహకరించే విమర్శలు కావాలని స్పష్ఠంగా చెప్పింది.
కెరీర్ ప్రారంభంలో తనకు ఇవేవీ అర్థం కాలేదని, నెమ్మదిగా మూడు ప్రాజెక్టులు చేసాక ఇప్పుడు సమాధానమిచ్చే వయసు వచ్చిందని కూడా ఖుషీ చెప్పింది. ఇప్పుడు అన్నిటికీ ప్రతిస్పందించగలనని ఖుషీ అంది. నాకు ప్రతిదీ వినే అలవాటు ఉంది. ప్రతిదీ విని నేర్చుకుంటున్నాను.. మెరుగు పరుచుకుంటున్నాను.. అవసరం లేని కువిమర్శల్ని పట్టించుకోనని కూడా ఖుషీ తెలిపింది. నేను సినిమా సెట్ల చుట్టూ పెరిగినందున (నటన పట్ల) ప్రేమ మొదటి నుంచీ ఉంది... సౌకర్యం ఉంది... మనం ఎంపిక చేసుకునేవాటిపై నమ్మకంగా ఉంటాం. నేను మూడు సినిమాలు చేసినందున ఇప్పుడు ఎక్కువ స్వరం వినిపించగలనని భావిస్తున్నాను. నేను నా ఆలోచనలను కొంచెం ఎక్కువగా వ్యక్తపరచగలను.. అని చెప్పింది.
జోయా అక్తర్ దర్శకత్వం వహించిన 'ది ఆర్చీస్' 2023 లో ఖుషీ కపూర్ బెట్టీ కూపర్ పాత్రతో అరంగేట్రం చేసింది. ఆ తర్వాత 2025 లో లవ్‌యాప - నాదానియన్ అనే రెండు చిత్రాలలో నటించింది. లవ్ యాపాలో అమీర్ ఖాన్ కుమారుడు జునైద్ ఖాన్ కథానాయకుడిగా నటించాడు. నాదానియన్ తో సైఫ్ ఖాన్ కుమారుడు ఇబ్రహీం అలీఖాన్ కథానాయకుడిగా పరిచయం అయ్యాడు.
