దిశా పటానీ సోదరి.. రియల్ లైఫ్ హీరో
ఎప్పుడూ తన ఫ్యాషన్ సెన్స్ తో వార్తల్లో నిలిచే దిశా పటానీ సోదరి ఖుష్బూ పటానీ ఇప్పుడు ఒక్కసారిగా వార్తల్లో నిలిచింది.
By: Tupaki Desk | 21 April 2025 5:10 PM ISTబాలీవుడ్ బ్యూటీ దిశా పటానీ గురించి అందరికీ తెలుసు. ఎప్పుడూ తన ఫ్యాషన్ సెన్స్ తో వార్తల్లో నిలిచే దిశా పటానీ సోదరి ఖుష్బూ పటానీ ఇప్పుడు ఒక్కసారిగా వార్తల్లో నిలిచింది. ఖుష్బూ ఓ పది నెలల చిన్నారి జీవితాన్ని కాపాడి రియల్ లైఫ్ హీరో అనిపించుకుంది. ఓ పాడుబడిన ఇంట్లో ఒంటరిగా పడున్న నెలల చిన్నారిని ఖుష్బూ కాపాడి అధికారులకు అప్పగించింది.
దిశా పటానీ సోదరి ఖుష్బూ పటానీ మాజీ ఆర్మీ ఆఫీసర్. ప్రస్తుతం ఆమె ఉత్తరప్రదేశ్ లోని బరేలీలో తన తండ్రి అయిన రిటైర్డ్ సర్కిల్ ఆఫీసర్ జగదీష్ తో కలిసి ఉంటోంది. ఖుష్భూ ప్రస్తుతం ఫిట్ నెస్ ట్రైనర్ గా బాధ్యతలు నిర్వహిస్తోంది. రోజూలానే ఆదివారం కూడా ఉదయం వాకింగ్ కు వెళ్తుండగా తమ ఇంటి దగ్గరలో ఉన్న ఓ పాడు బడిన ఇంట్లో నుంచి చిన్నారి ఏడుపు వినిపించడంతో ఖుష్బూ అక్కడ ఆగింది.
అక్కడకు వెళ్లడానికి సరైన దారి లేకపోవడంతో కొంచెం రిస్క్ చేసి గోడ ఎక్కి దూకి ఆ ఇంట్లోకి చేరుకుందట. తీరా చూస్తే అక్కడ 10 నెలల పాప ఏడుస్తూ ఉందని, ఆ పాప బట్టలపై ఎంతో దుమ్ముందని, ఆ దుమ్ముని దులిపేసి పాపను తన ఇంటికి తీసుకెళ్లి ఫస్ట్ ఎయిడ్ చేసి పాపకు పాలు పట్టించి దానికి సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ పాప ఫోటో చూసి ఎవరైనా గుర్తు పడితే చెప్పాలని కోరింది.
ఆమె పోస్ట్ చూసి అధికారులు, పోలీసులు వెంటనే స్పందించారని చెప్తూ మరో పోస్ట్ కూడా చేసింది ఖుష్బూ. పాప పేరు రాధ అని, ఆమె తల్లిదండ్రులను కూడా పోలీసులు గుర్తించారని ఖుష్బూ చెప్పింది. ఆల్రెడీ పాప తల్లిదండ్రులను సంప్రదించినట్టు కూడా చెప్పిన ఖుష్బూ తలరాతను ఎవరూ మార్చలేరని, చిన్నారి రాధ ఫ్యూచర్ చాలా గొప్పగా ఉంటుందని తెలిపింది.
ఇదొక కిడ్నాప్ కేసుగా చెప్తున్న ఖుష్బూ, చిన్నారి విషయంలో మద్దతు ఇచ్చిన వారందరికీ థ్యాంక్స్ చెప్పింది. విషయం తెలుసుకున్న పోలీసులు చిన్నారిని అసలు అక్కడకు ఎవరు తీసుకొచ్చారు? అక్కడ ఎందుకు వదిలేశారు అనే విషయంపై సీసీ టీవీ ఫుటేజ్ ఆధారంగా ఎంక్వైరీ చేస్తున్నట్టు తెలిపారు. ఖుష్బూ చేసిన గొప్ప పనికి నెటిజన్లు ఆమెను ఎంతగానో ప్రశంసిస్తున్నారు.
