సూపర్‌స్టార్‌పై ఎందుకింత అసహనం?
బాలీవుడ్‌లో ఖాన్‌ల ప్రభ మసకబారుతోంది. 50 ప్లస్ ఏజ్ లో ఉన్న ఖాన్ లు ఇక ఇండస్ట్రీ నుంచి వైదొలగడమే బెస్ట్ ఆప్షన్ గా కనిపిస్తోందని ఒక సెక్షన్ బలంగా వాదిస్తోంది.
By: Tupaki Desk | 25 May 2025 9:15 AM ISTబాలీవుడ్‌లో ఖాన్‌ల ప్రభ మసకబారుతోంది. 50 ప్లస్ ఏజ్ లో ఉన్న ఖాన్ లు ఇక ఇండస్ట్రీ నుంచి వైదొలగడమే బెస్ట్ ఆప్షన్ గా కనిపిస్తోందని ఒక సెక్షన్ బలంగా వాదిస్తోంది. ఓవైపు దక్షిణాది నుంచి జెన్ జెడ్ స్టార్లు పాన్ ఇండియన్ సినిమాలతో దేశీ మార్కెట్లను కొల్లగొడుతుంటే, ఖాన్ లు ఇలా దిగాలైపోవడంపై చాలా చర్చ సాగుతోంది.
ఇలాంటి ప్రత్యేక సందర్భంలో ఖాన్ ల త్రయంలో అత్యంత కీలక వ్యక్తి అయిన అమీర్ ఖాన్ కెరీర్ ని పునరుద్ధరించేందుకు అలుపెరగని పోరాటం చేయడం చర్చనీయాంశంగా మారింది. ఒక రకంగా అమీర్ ఖాన్ పై భారత జాతి అసహనానికి గురవుతోందా? అనే చర్చ కూడా సాగుతోంది. అమీర్ లాంటి హీరోలు హిందూ దేవుళ్లను కించపరిచేలా తమ సినిమాల్లో కొన్ని సన్నివేశాల్ని చూపించడం హిందూ వాదులకు అస్సలు నచ్చలేదు. పీకే లాంటి చిత్రంలో అమీర్ హిందూ దేవుళ్లను కించపరిచాడని విమర్శలొచ్చాయి. ఆ తర్వాత చాలా కాలంగా అతడి సినిమాలపై వ్యతిరేక ప్రచారం సాగుతూనే ఉంది. ఇటీవలి కాలంలో ఇది ప్రత్యక్ష యుద్ధంగా మారింది. తాను నటించిన లాల్ సింగ్ చడ్డా ఫెయిలవ్వడం వెనక చాలా కారణాలను అమీర్ ఖాన్ విశ్లేషించుకుని ఆవేదన చెందాడు. అంతేకాదు మహాభారతం తన డ్రీమ్ ప్రాజెక్ట్ అని ప్రకటించిన అమీర్ ఖాన్ 1000 కోట్ల బడ్జెట్ తో మూడు భాగాలుగా సినిమాలు తీయాలని సంకల్పించాడు. కానీ ఆ ప్రాజెక్ట్ ఎప్పటికీ టేకాఫ్ కాలేదు. దీనికి కారణం హిందూ వర్గాల నుంచి అతడిపై ఉన్న వ్యతిరేకత అని కూడా విశ్లేషించారు.
ఇదిలా ఉంటే, అమీర్ ఖాన్ `లాల్ సింగ్ చడ్డా` లాంటి డిజాస్టర్ తో నీరసపడిపోయాక, ఇప్పుడు సితారే జమీన్ పర్ చిత్రంతో రీబూట్ అవ్వాలని ప్రయత్నిస్తున్నాడు. కానీ తారే జమీన్ పర్ సీక్వెల్ పైనా నెగెటివిటీ నెలకొంది. ఈ సీక్వెల్ సినిమాని కూడా అతడు కాపీ కొట్టాడని విమర్శలు ఇప్పటికే ఇంటర్నెట్ ని షేక్ చేస్తున్నాయి. అమీర్ ఖాన్ ఎక్కువగా రీమేక్ లపై ఆధారపడటం, అలాగే కాపీ కథలతో విసిగించడం ఎవరికీ నచ్చడం లేదు. అమీర్ మాజీ భార్య కిరణ్ రావు కూడా ఒక కాపీ క్యాట్ సినిమా (లాపాటా లేడీస్)ని ఆస్కార్స్ కి పంపడంపైనా తీవ్ర దుమారం చెలరేగింది. ఓవరాల్ గా అమీర్ నటించిన సితారే జమీన్ పర్ పై వ్యతిరేక ప్రచారం సాగుతోందన్నది వాస్తవం. ఈ సినిమా ఒక హాలీవుడ్ చిత్రానికి కాపీ అంటూ ప్రచారం సాగుతోంది. అయితే అమీర్ ఖాన్ పై ఇలా నెటిజనులు వ్యతిరేకంగా మారడం అతడి భవిష్యత్ కి ఎలాంటి అవాంతరాలు సృష్టిస్తుందో అనే విశ్లేషణ సాగుతోంది. అమీర్ ఖాన్ ని తమ ఫేవరెట్ హీరోగా ఆరాధించి, నెత్తిన పెట్టుకున్న అదే జనం ఇప్పుడు ఇంత వ్యతిరేకంగా మారడానికి కారణాలేమిటో ఇప్పుడు చాలా కోణాల్లో స్పష్ఠత వచ్చినట్టే.
