అప్పట్లోనే ఉగ్రవాది అజర్ మసూద్ ను పట్టుకున్న టాలీవుడ్ టాప్ డైరెక్టర్
అది 2002.. ఖమ్మంలోని వినోద సినిమా థియేటర్. అక్కడ ఓ సంచలన సినిమా ఆడుతోంది.. కార్గిల్ యుద్ధం, పార్లమెంటుపై దాడి వంటి ఘటనలతో భారత్-పాకిస్థాన్ సంబంధాలు దారుణంగా క్షీణించాయి.
By: Tupaki Desk | 14 May 2025 8:45 AMఅది 2002.. ఖమ్మంలోని వినోద సినిమా థియేటర్. అక్కడ ఓ సంచలన సినిమా ఆడుతోంది.. కార్గిల్ యుద్ధం, పార్లమెంటుపై దాడి వంటి ఘటనలతో భారత్-పాకిస్థాన్ సంబంధాలు దారుణంగా క్షీణించాయి. అలాంటి సమయంలో దేశభక్తి నేపథ్యంలో వచ్చిన ఆ సినిమా పెను సంచలనం రేపింది. బ్లాక్ బస్టర్ గానూ నిలిచింది. సొంత జిల్లా కావడంతో ఈ సినిమాలో కీలక నటించిన ఓ వ్యక్తి ఖమ్మం థియేటర్ కు వచ్చాడు. దీంతో భారీఎత్తున జనం పోగయ్యారు..
పైన చెప్పుకొన్న సినిమా పేరు ‘ఖడ్గం’.. అందులో భయంకర ఉగ్రవాది మసూద్ అజహర్ పాత్రలో నటించింది ఖమ్మం జిల్లాకు చెందిన నటుడు. కలర్, కళ్లు, కళ్లజోడు, వస్త్రధారణ సహా అన్ని విషయాల్లో మసూద్ అజహర్ ను అచ్చుగుద్దినట్లు దింపేశాడు క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ.
1999లో జరిగిన కాందహార్ విమాన హైజాక్ అనంతరం మసూద్ అజహర్ ను విడిచిపెట్టింది భారత్. దీంతో అతడు జైషే అహ్మద్ పేరిట కొత్త ఉగ్రవాద సంస్థను స్థాపించి 26 ఏళ్లుగా పాకిస్థాన్ లో ఆశ్రయం పొందుతున్నాడు. అనేక దారుణ దాడులకు పాల్పడిన అతడు అక్కడ స్వేచ్ఛగా తిరుగుతున్నాడు. కాగా, 1999 తర్వాత వైరల్ అయిన మసూద్ అజహర్ ఫొటోల ఆధారంగానే ఖడ్గం సినిమాలో క్యారెక్టర్ ను పెట్టారు కృష్ణవంశీ.
తాజాగా పెహల్గామ్ దాడికి పాకిస్థాన్ పై భారత్ ప్రతీకారం తీర్చుకున్న అనంతరం మసూద్ అజహర్ గురించి ప్రస్తావన వచ్చింది. అతడి కుటుంబానికి చెందిన 14 మందిని ఒక్క దెబ్బతో భారత్ హతమార్చడంతో ’నేను పోయినా బాగుండేది’ అంటూ మసూద్ అజహర్ రోదించాడు.
ఇక అసలు పాయింట్ కు వస్తే 2002లోనే మసూద్ అజహర్ ను తన సినిమాలో చూపించిన కృష్ణవంశీని ఇప్పుడు నెటిజన్లు గుర్తు చేసుకుంటున్నారు. భారత దళాలకు దొరకని ఆ భయంకర ఉగ్రవాదిని.. కృష్ణవంశీ మాత్రం తన సినిమా కోసం ’పట్టుకున్నారు’ అని చెప్పుకొంటున్నారు. అందుకే ఆయన క్రియేటివ్ డైరెక్టర్ అయ్యారని కొనియాడుతున్నారు.
కొసమెరుపు: దేశభక్తి మేళవించిన ఖడ్గం సినిమా సూపర్ హిట్ అవడమే కాక అవార్డులు కొల్లగొట్టింది. శ్రీకాంత్, ప్రకాశ్ రాజ్ తో పాటు ఇందులో నటించిన రవితేజ, బ్రహ్మాజీ, 30 ఇయర్స్ ప్రథ్వీ, సంగీత తదితరులు తర్వాతి కాలంలో పెద్ద స్టార్లు అయ్యారు. అయితే, కీలకమైన మసూద్ అజహర్ క్యారెక్టర్ వేసిన వ్యక్తి మాత్రం మళ్లీ సినిమాల్లో కనిపించలేదు.