Begin typing your search above and press return to search.

KGF: చాప్ట‌ర్ 3 ముహూర్తం విడుద‌ల తేదీ

రాఖీ భాయ్ మ‌ళ్లీ వ‌స్తున్నాడు. అత‌డి రాక కోసం హోంబ‌లే ఫిలింస్ ముహూర్తం ఫిక్స్ చేసింద‌ని గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి

By:  Tupaki Desk   |   30 Sep 2023 5:12 AM GMT
KGF: చాప్ట‌ర్ 3 ముహూర్తం విడుద‌ల తేదీ
X

రాఖీ భాయ్ మ‌ళ్లీ వ‌స్తున్నాడు. అత‌డి రాక కోసం హోంబ‌లే ఫిలింస్ ముహూర్తం ఫిక్స్ చేసింద‌ని గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. క‌న్న‌డ రాకింగ్ స్టార్ య‌ష్‌ -ప్రశాంత్ నీల్ కాంబినేష‌న్ లో KGF సిరీస్ ఎంత‌టి విజ‌యం సాధించిందో తెలిసిందే. తొలి రెండు భాగాలు బాక్సాఫీస్ వ‌ద్ద వ‌సూళ్ల‌ సునామీని సృష్టించారు. KGF: చాప్టర్ 1- KGF: చాప్టర్ 2 సంచ‌ల‌న విజ‌యాల్ని న‌మోదు చేసాయి. య‌ష్ 1000 కోట్ల క్ల‌బ్ హీరోగా అవ‌త‌రించడం ఒక సంచ‌ల‌నం. ఇప్పుడు KGF: చాప్టర్ 3 కోసం సినీ ప్రియులు ఎంతో ఆస‌క్తిగా వేచి చూస్తున్నారు.

తాజా స‌మాచారం మేర‌కు.. కేజీఎఫ్ ఫ్రాంఛైజీ అభిమానుల‌కు త్వ‌ర‌లోనే గుడ్ న్యూస్ అంద‌నుంద‌ని తెలుస్తోంది. మోస్ట్ అవైటెడ్ కేజీఎఫ్ కొత్త సినిమా గురించి అధికారిక ప్రకటన చేయనున్నారని తెలిసింది. కేజీఎఫ్ 3ని 2025లో సినిమా హాళ్ల‌లో రిలీజ్ చేయాల‌నేది హోంబ‌లే సంస్థ ప్లాన్. అక్టోబర్ 2024 నాటికి సెట్స్‌పైకి వెళ్లాల‌ని .. 2023 చివ‌రి(డిసెంబ‌ర్‌)లో అధికారికంగా ఈ ప్రాజెక్టును ప్ర‌క‌టించాల‌ని స‌ద‌రు నిర్మాణ సంస్థ ప్లాన్ చేస్తోంద‌ని క‌థ‌నాలొస్తున్నాయి.

ప్రస్తుతం ప్రశాంత్ నీల్ 'సలార్' సినిమాతో బిజీగా ఉన్నాడు. నిర్మాణానంత‌ర ప‌నుల్ని వేగంగా పూర్తి చేసి విడుద‌ల‌కు సిద్ధం చేసే ప‌నిలో ఉన్నాడు. స‌లార్ డిసెంబ‌ర్ లో స‌ల్మాన్ ఖాన్ న‌టించిన‌ టైగ‌ర్ 3తో పోటీప‌డనుంది. క్రిస్మ‌స్ కానుక‌గా స‌లార్ - టైగ‌ర్ విడుద‌ల ఖాయమైన నేప‌థ్యంలో స‌ర్వ‌త్రా ఉత్కంఠ నెల‌కొంది. స‌లార్ విడుద‌లతో ప్ర‌శాంత్ నీల్ పై ఒత్తిడి త‌గ్గుతుంది. అనంత‌రం కేజీఎఫ్ 3 ని అధికారికంగా ప్ర‌క‌టించాల‌ని అత‌డు భావిస్తున్న‌ట్టు టాక్ వినిపిస్తోంది. ఒక‌వేళ ఇదే నిజ‌మైతే ప్ర‌భాస్- స‌లార్ 2 ఇప్ప‌ట్లో సెట్స్ పైకి వెళ్లే ఛాన్స్ లేద‌ని కూడా ఖాయం చేసుకోవ‌చ్చు.

కేజీఎఫ్ 3 క‌థాంశం ఎక్క‌డ మొద‌ల‌వుతుంది? అంటే.. ఒక‌సారి పార్ట్ 2 క‌థ‌ను గుర్తుకు తెచ్చుకోవాలి.

KGF: రాకీ భాయ్ (యష్)పై ప్రధాన మంత్రి రమికా సేన్ (రవీనా టాండన్) సైనిక చర్యతో అత‌డు సముద్ర గ‌ర్భంలోకి జారిపోవ‌డంతో చాప్ట‌ర్ 2 ముగిసింది. క్లైమాక్స్‌లో రాకీ భాయ్ నిర్జీవమైన శరీరం సముద్రపు అడుగుభాగంలో మునిగిపోయేలా చూపించారు. అయితే మిడ్-క్రెడిట్స్ సీన్‌లో ఆనంద్ ఇంగలగి లైబ్రరీలో పుస్తకాలను దుమ్ము దులిపే సీన్ సందేహాలు రేకెత్తించింది. అత‌డు 'KGF: చాప్ట‌ర్ ...' అనే టైటిల్‌తో మరొక మాన్యుస్క్రిప్ట్‌ని చూశాడు. కానీ ఆ సంఖ్య రివీల‌య్యేలోపు సన్నివేశం ముగుస్తుంది. ఇప్పుడు పాపులర్ ఫ్రాంచైజీ మూడవ భాగంలో రాకీ భాయ్ చనిపోయాడా లేదా బతికే ఉన్నాడా? అనేది తెలుసుకునే ఉత్కంఠ అలానే ఉంది. KGF: చాప్టర్ 2లో యష్, సంజయ్ దత్, రవీనా టాండన్, శ్రీనిధి శెట్టి, ప్రకాష్ రాజ్, అచ్యుత్ కుమార్, రావు రమేష్, వశిష్ట ఎన్. సింహా, అయ్యప్ప పి. శర్మ, అర్చన జోయిస్, శరణ్ శక్తి, ఈశ్వరీ రావు, జాన్ కొక్కెన్ ముఖ్యమైన పాత్రల్లో నటించారు. ఇప్పుడు చ‌నిపోయిన పాత్రలు మిన‌హా వీరంతా పార్ట్ 3లోను కొన‌సాగే వీలుంది.

యష్ ఇత‌ర షెడ్యూళ్ల గురించి వివ‌రాల్లోకి వెళితే.. అత‌డు తన కెరీర్ 19వ సినిమా కోసం గీతు మోహన్‌దాస్‌తో చేతులు కలిపినట్లు సమాచారం. త్వరలోనే ఈ సినిమాపై అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. త్వరలో యష్ లుక్ టెస్ట్‌లకు వెళ‌తాడ‌ని తెలుస్తోంది. యష్ 19 తో పాటు KGF: చాప్టర్ 3 ప్ర‌క‌ట‌న‌ల కోసం అభిమానులు ఆస‌క్తిగా వేచి చూస్తున్నారు. ఈ రెండు ప్రాజెక్ట్‌లు ఇప్పటికే సినీవ‌ర్గాల్లో ఆస‌క్తిని పెంచాయి.