Begin typing your search above and press return to search.

KGF 3 చేయాలంటే రాఖీ భాయ్ కండీష‌న్?

భారతదేశం స‌హా ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఈ ఫ్రాంఛైజీ సినిమాలు అద్భుత వ‌సూళ్ల‌ను సాధించాయి

By:  Tupaki Desk   |   1 Aug 2023 4:48 AM GMT
KGF 3 చేయాలంటే రాఖీ భాయ్ కండీష‌న్?
X

ప్రశాంత్ నీల్ తెర‌కెక్కించిన‌ KGF - KGF 2 చిత్రాలలో కన్నడ రాకింగ్ స్టార్ యష్ ఎదురేలేని గ్యాంగ్ స్ట‌ర్ గా న‌టించిన సంగ‌తి తెలిసిందే. అత‌డు తన నటనతో ప్రపంచవ్యాప్తంగా అభిమానాన్ని సంపాదించుకున్నాడు. భారతదేశం స‌హా ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఈ ఫ్రాంఛైజీ సినిమాలు అద్భుత వ‌సూళ్ల‌ను సాధించాయి. ఈ సంవత్సరం జూలై 14న రెండు చిత్రాలను జపాన్‌లోని థియేటర్లలో విడుద‌ల చేయ‌గా మంచి ఫ‌లితం ద‌క్కింది. ఇంత‌లోనే మేకర్స్ KGF 3 పై ప‌ని ఇప్పటికే జరుగుతోందని ధృవీకరించారు. వీటన్నింటి మధ్య పార్ట్ 3 పై యష్ ఆలోచ‌న‌ల గురించి మరో ఆసక్తికరమైన విషయం తెరపైకి వచ్చింది. యష్ ఒక షరతుతో మాత్రమే KGF మూడవ విభాగంలో న‌టిస్తాడ‌ని స‌మాచారం అందుతోంది.

ఇటీవ‌లి క‌న్న‌డ మీడియా క‌థ‌నాల ప్ర‌కారం.. రెండు చిత్రాలకు జపాన్‌లో గొప్ప‌ స్పందన వచ్చిన తరువాత.. ఇతర దేశాలలోను KGF - KGF 2 చిత్రాల్ని భారీగా విడుదల చేయడానికి చిత్ర నిర్మాత‌లు ప్లాన్ చేస్తున్నారు. ఈ ప్లాన్ మొత్తం అమ‌లు అయ్యాక మాత్ర‌మే య‌ష్ మూడో భాగం గురించి మాట్లాడ‌తాడుట‌. సినిమా ప్రారంభించ‌డానికి ముందు త‌న‌కు ప్ర‌శాంత్ నీల్ వినిపించే స్క్రిప్ట్ న‌చ్చాల‌ని కూడా కండీష‌న్ ఉన్న‌ట్టు తెలిసింది. యష్ ఈ ఫ్రాంఛైజీ చిత్రాల్లో గ్యాంగ్ స్ట‌ర్ రాకీ భాయ్ గా అద‌ర‌గొట్టాడు. కొన‌సాగింపు పాత్రలో మళ్లీ నటిస్తాడు.. కానీ కండీష‌న్స్ అప్ల‌య్ అని సోర్సెస్ వెల్లడించాయి.

ప్ర‌స్తుతం య‌ష్ ఇంకా టైటిల్ నిర్ణ‌యించ‌ని భారీ బడ్జెట్ ప్రాజెక్ట్‌లో న‌టిస్తున్నాడు. అదే స‌మ‌యంలో కేజీఎఫ్ 3పైనా ఆలోచిస్తున్నాడు. కానీ KGF 3 తో తొలి రెండు భాగాల్ని మించి ఇంకా పెద్ద మ్యాజిక్ జ‌ర‌గాల‌ని య‌ష్ భావిస్తున్నాడ‌ట‌. తొలి రెండు భాగాల‌తో త‌న‌కు అసాధార‌ణంగా అభిమానులు పెరిగారు. మూడోభాగంతో ఫ్యాన్ బేస్ ను మ‌రింత‌గా పెంచుకోవాల‌ని అత‌డు భావిస్తున్న‌ట్టు తెలిసింది. అందుకే ముందుగా ఒక అద్భుత‌మైన‌ స్క్రిప్ట్ కావాల‌ని అత‌డు భావిస్తున్నాడు. అయితే యష్ అభిమానులకు మరో స్పెషల్ ట్రీట్ ఉంది. కేజీఎఫ్ 3 కంటే ముందే మ‌రో భారీ చిత్రంతో అభిమానుల‌కు ట్రీటిచ్చేందుకు స‌న్నాహ‌కాల్లో ఉన్నాడ‌ని తెలిసింది.