Begin typing your search above and press return to search.

ఇంకా ఎన్ని ప్రయోగాలు చేస్తారు మేడం కీర్తి...?

తెలుగులో కీర్తి సురేష్‌ సినిమాలు చేయడం లేదని అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్న ఈ సమయంలో 'ఉప్పు కప్పురంబు' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

By:  Tupaki Desk   |   7 July 2025 3:00 PM IST
ఇంకా ఎన్ని ప్రయోగాలు చేస్తారు మేడం కీర్తి...?
X

మహానటి సినిమాతో పాన్ ఇండియా స్టార్‌ హీరోయిన్‌గా పాపులారిటీ సొంతం చేసుకున్న కీర్తి సురేష్‌ ఆ తర్వాత తెలుగులో ఆశించిన స్థాయిలో సక్సెస్‌లను సొంతం చేసుకోవడంలో విఫలం అయింది. అయితే మహానటి సినిమా కారణంగా ఇప్పటికీ కీర్తి సురేష్‌కి టాలీవుడ్‌లో మోస్ట్‌ పాపులర్‌ స్టార్‌ ఇమేజ్ ఉంది. అందుకే ఈ అమ్మడు ఏ సినిమా చేసినా కూడా ప్రేక్షకులు ఆసక్తి చూపిస్తున్నారు, ఈసారి అయినా కీర్తి సురేష్ మంచి సినిమాతో వచ్చి ఉంటుందేమో అనుకుంటున్నారు. కానీ కీర్తి సురేష్‌ ఎప్పటికప్పుడు తన అభిమానుల, ప్రేక్షకుల అంచనాలను అందుకోవడంలో విఫలం అవుతూనే వచ్చింది. ఈ మధ్య కాలంలో కీర్తి సురేష్‌ బాలీవుడ్‌లోనూ అడుగు పెట్టింది.

తెలుగులో కీర్తి సురేష్‌ సినిమాలు చేయడం లేదని అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్న ఈ సమయంలో 'ఉప్పు కప్పురంబు' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కీర్తి సురేష్ ఈ సినిమాలో మెయిన్ లీడ్‌లో కనిపించింది. ఈ సినిమాలో సుహాస్‌ ముఖ్య పాత్రలో కనిపించాడు. కీర్తి సురేష్‌ పల్లెటూరు అమ్మాయిగా, అమాయకపు ఊరు పెద్ద పాత్రలో నటించింది. తండ్రి మరణించడంతో ఊరు పెద్ద బాధ్యత ను కీర్తి సురేష్ తన భుజాలపై వేసుకోవాల్సి వస్తుంది. ఆ సమయంలో ఎదుర్కొన్న ఇబ్బందులను ఫన్నీగా చూపించే కథతో ఉప్పు కప్పురంబు సినిమా రూపొందింది. ఈ మధ్య కాలంలో ఓటీటీలకు ఉన్న ప్రాధాన్యత నేపథ్యంలో ఈ సినిమాను ఓటీటీలో డైరెక్ట్‌ రిలీజ్ చేశారు.

అమెజాన్ ప్రైమ్‌ వీడియో ఓటీటీ ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఉప్పు కప్పురంబు సినిమాకు మిశ్రమ స్పందన వచ్చింది. కంటెంట్‌ పరంగా పర్వాలేదు, కానీ ఇది కీర్తి సురేష్ స్థాయి పాత్ర కాదు, ఆమె స్థాయికి తగ్గ సినిమా కాదు అంటూ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి పాత్రతోనే గతంలో కీర్తి సురేష్ ఒక సినిమాను చేసింది. ఆ సినిమా సైతం తీవ్రంగా నిరాశ పరచింది. అయినా కూడా కీర్తి సురేష్ తన తప్పు తెలుసుకున్నట్లుగా లేదు. అందుకే మరోసారి అదే తప్పును చేసింది అని విశ్లేషకులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. లేడీ ఓరియంటెడ్‌ సినిమాలు చేయాలని అనుకోవడం మంచి నిర్ణయం, కానీ తన స్టార్‌డంకు తగ్గ పాత్రను ఒప్పుకోవాల్సిన అవసరం ఉంది.

కీర్తి సురేష్‌ ఇప్పటికే చాలా ప్రయోగాలు చేసింది, ఆ ప్రయోగాల్లో చాలా వరకు నిరాశను మిగిల్చాయి. ప్రయోగం కమర్షియల్‌గా సక్సెస్ కాకున్నా కనీసం నటిగా ఆమెకు గుర్తింపు తెచ్చి పెట్టే విధంగా ఉండాలి. కానీ ఉప్పు కప్పురంబులోని అపూర్వ పాత్ర ఏ మాత్రం ఆకట్టుకోలేదు, అందులో ఆమె పాత్ర గురించి ఆహా.. ఓహో అన్నట్లుగా లేదు. ఈ మధ్య కాలంలో చాలా చిన్న సినిమాలు మంచి విజయాన్ని సొంతం చేసుకుంటున్నాయి. అయితే చిన్న సినిమాలను, కంటెంట్ ఓరియంటెడ్‌ సినిమాలను చిన్న నటీనటులతో చేస్తేనే బాగుంటుంది, కీర్తి సురేష్ సినిమా అనగానే అంచనాలు పెరుగుతాయి. ఆ అంచనాలను ఉప్పు కప్పురంబు మేకర్స్ అందుకోవడంలో విఫలం అయ్యారు. కీర్తి సురేష్ ఇప్పటికి అయినా ప్రయోగాలను ప్రయోగాత్మకంగా చేయడం మానేస్తే ఉత్తమం అనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.