హీరో, హీరోయిన్‌ల పారితోషికం వ్యత్యాసం.. కీర్తి సురేష్ కామెంట్స్!
తాజాగా మహానటి ఫేం కీర్తి సురేష్ సైతం ఈ విషయం గురించి స్పందించింది. ఇన్నాళ్లు సమాన వేతనం గురించి మౌనంగా ఉంటూ వచ్చిన కీర్తి సురేష్ తన వెబ్ సిరీస్ ప్రమోషన్స్‌లో భాగంగా మాట్లాడుతూ..
By: Tupaki Desk | 23 Jun 2025 7:31 AMసినిమా ఇండస్ట్రీలోనే కాకుండా ప్రతి చోట ఆడవారి కంటే మగవారికి పారితోషికం/జీతం ఎక్కువగా ఉంటుంది. అన్ని చోట్ల ఆడవారు చేసే పనికి పారితోషికం అనేది తక్కువగానే ఉంటుంది. మగవారితో సమానంగా పని చేస్తున్నప్పటికీ తమకు అన్యాయం జరుగుతుందని మొదటి నుంచి ఆడవారు కొందరు ఆందోళన చేస్తూనే ఉన్నారు. ఇక సినిమా ఇండస్ట్రీలో హాలీవుడ్ నుంచి మొదలుకుని అన్ని భాషల సినిమా ఇండస్ట్రీలో కూడా హీరోలదే ఆదిపత్యం అనడంలో ఎలాంటి సందేహం లేదు. హీరోలకు కోటాను కోట్ల పారితోషికం అందుతూ ఉంటే, హీరోయిన్స్ మాత్రం అందులో పది నుంచి ఇరవై శాతం పారితోషికం మాత్రమే అందుకోవడం ప్రతి భాష ఇండస్ట్రీలోనూ జరుగుతుంది.
ఇటీవల సమంత తన సినిమా శుభం ప్రమోషన్‌లో భాగంగా ఆసక్తికర కామెంట్స్ చేసింది. తాము నిర్మించిన శుభం సినిమా లో నటించిన ప్రతి ఒక్కరికి సమాన వేతనం ఇచ్చినట్లు పేర్కొంది. ఆడ, మగ అనే తేడా లేకుండా నటీ నటులు, సాంకేతిక నిపుణులకు పారితోషికాలు ఇచ్చినట్లు పేర్కొంది. ఇండస్ట్రీలో ఉన్న ఈ వ్యత్యాసంను తగ్గించాల్సిన అవసరం ఉందని, హీరోయిన్స్‌కు వారి కష్టంకు తగ్గట్లుగా పారితోషికం ఇవ్వాల్సిందే అన్నట్లుగా సమంత అభిప్రాయం వ్యక్తం చేసింది. సమంత చేసిన ఆ వ్యాఖ్యల తర్వాత సోషల్ మీడియాలో ప్రముఖంగా చర్చ మొదలు అయింది. చాలా మంది హీరోయిన్స్ ఈ విషయం గురించి స్పందించారు, కొందరు ఇంటర్వ్యూల్లో ఈ విషయం గురించి స్పందిస్తున్నారు.
తాజాగా మహానటి ఫేం కీర్తి సురేష్ సైతం ఈ విషయం గురించి స్పందించింది. ఇన్నాళ్లు సమాన వేతనం గురించి మౌనంగా ఉంటూ వచ్చిన కీర్తి సురేష్ తన వెబ్ సిరీస్ ప్రమోషన్స్‌లో భాగంగా మాట్లాడుతూ.. హీరోల స్థాయిలో హీరోయిన్స్‌కి కూడా ప్రేక్షకులను థియేటర్‌కి రప్పించే సామర్థ్యం ఉంటే, వారికి ఆ క్రేజ్, సత్తా ఉంటే కచ్చితంగా హీరోల స్థాయిలో పారితోషికం ఇచ్చి తీరాల్సిందే అంటూ కీర్తి సురేష్ చెప్పుకొచ్చింది. హీరోయిన్స్‌ల్లో చాలా మంది ప్రేక్షకులను థియేటర్స్‌కి రప్పించగల సామర్థ్యంను కలిగి ఉన్నారు. కానీ వారు కూడా పారితోషికం చాలా తక్కువ తీసుకుంటున్నారు. వందల కోట్ల పారితోషికం తీసుకుంటున్న హీరోలు ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఉన్నారు.
హీరోయిన్స్ మాత్రం కనీసం 10 కోట్ల పారితోషికం అందుకునే పరిస్థితి లేదు. ఇండియన్ సినిమా ఇండస్ట్రీ మొత్తం మీద రూ.10 కోట్లు, అంతకు మించి పారితోషికం తీసుకునే హీరోయిన్స్ కనీసం 10 మంది కూడా ఉండరు అనడంలో అతిశయోక్తి లేదు. చిన్న హీరోలు, కొత్తగా ఎంట్రీ ఇచ్చిన హీరోలు సైతం ఒకటి రెండు హిట్స్ పడగానే రూ.10 నుంచి పాతిక కోట్ల పారితోషికం తీసుకుంటూ ఉన్నారు. కానీ హీరోయిన్స్ మాత్రం వందల కోట్ల వసూళ్లు సాధించినా కూడా ఫలితం మాత్రం అంతంత మాత్రమే. కీర్తి సురేష్ ఈ సినిమా గురించి ప్రముఖంగా చర్చ జరుగుతున్న సమయంలో కీర్తి సురేష్ చేసిన వ్యాఖ్యలు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ఇలా చాలా కాలంగా చర్చ జరుగుతున్నప్పటికీ నిర్మాతలు మాత్రం హీరోయిన్స్‌కు వారి స్థాయిలో పారితోషికం మాత్రం ఇవ్వడం లేదు.