Begin typing your search above and press return to search.

చిచ్చ‌ర పిడుగు.. 'క‌రోడ్ ప‌తీ'లో కోటి గెలిచిన హ‌రియాణా బుడ‌త‌డు!

చిచ్చ‌ర పిడుగు.. బాల మేధావి.. పేరు ఏదైనా పెట్టండి.. ఆ బాలుడు అనుకున్న‌ది సాధించాడు

By:  Tupaki Desk   |   29 Nov 2023 4:59 PM GMT
చిచ్చ‌ర పిడుగు.. క‌రోడ్ ప‌తీలో కోటి గెలిచిన హ‌రియాణా బుడ‌త‌డు!
X

చిచ్చ‌ర పిడుగు.. బాల మేధావి.. పేరు ఏదైనా పెట్టండి.. ఆ బాలుడు అనుకున్న‌ది సాధించాడు. త‌న అద్భుత ప్ర‌తిభా సంప‌త్తితో త‌డుముకోకుండా స‌మాధానాలు చెప్పి.. నిజంగానే 'క‌రోడ్ ప‌తి' అయ్యాడు. బాలీవుడ్ సూప‌ర్ స్టార్ అమిత్ బ‌చ్చ‌న్ నిర్వ‌హిస్తున్న రియాల్టీ షో.. 'కౌన్ బ‌నేగా క‌రోడ్ ప‌తి' కార్య‌క్ర‌మంలో పాల్గొన్న హ‌రియాణాకు చెందిన 14 ఏళ్ల బాలుడు.. రూ. కోటి గెలిచి.. దేశ ప్ర‌జ‌ల హృద‌యాల‌ను కొల్ల‌గొట్టాడు. అత‌ని అద్భుత ప్ర‌తిభ‌కు మేధావులు సైతం ఫిదా అవుతున్నారు. ఎక్క‌డా గ‌గుర్పాటు లేకుండా.. త‌డ‌బాటు అస‌లే లేకుండా.. ప్ర‌తి ప్ర‌శ్న‌కు తూకం వేసి మ‌రీ.. స‌మాధానం చెప్పి.. విక్ట‌రీ సాధించాడు. ఎంతో మందికి సాధ్యంకాని.. కోటి రూపాయ‌ల ప్ర‌శ్న‌కు కూడా ఎలాంటి ఒత్తిడీ లేకుండా.. స‌మాధానం చెప్ప‌డం గ‌మ‌నార్హం.

ఎవ‌రీ బాలుడు..?

కౌన్ బ‌నేగా క‌రోడ్ ప‌తి(కేబీసీ) జూనియర్స్‌ స్పెషల్‌లో భాగంగా హరియాణాలోని మహేంద్రగఢ్‌కు చెందిన మయాంక్ పాల్గొని రూ.కోటి గెలుచుకున్నాడు. ఇత‌ను 8వ తరగతి చదువుతున్నాడు. తాజాగా జరిగిన ఎపిసోడ్‌లో అన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పి రూ.కోటిని సొంతం చేసుకున్నాడు. షో మొదలైన తర్వాత మయాంక్‌ ఒక లైఫ్‌ లైన్‌ కూడా వాడకుండా రూ.3.2 లక్షల వరకూ ప్రశ్నలన్నింటికీ సమాధానం చెప్ప‌డం గ‌మ‌నార్హం. రూ.12.5 లక్షల ప్రశ్నకు ఒక లైఫ్‌ లైన్‌ వాడుకున్నాడు. ఇక రూ.కోటి ప్రశ్నకు సమాధానం చెప్పిన అనంతరం మాయంక్‌ భావోద్వేగంతో కన్నీటి పర్యంతమయ్యాడు.

ఇదీ.. కోటి రూపాయ‌ల ప్ర‌శ్న

కొత్తగా కొనుగొన్న ఖండానికి అమెరికా అని పేరు పెట్టి దాని మ్యాప్‌ను తయారు చేసిన యూరోపియన్‌ క్యాట్రోగ్రాఫర్‌ ఎవరు?

A.అబ్రహాం ఓర్టెలియస్‌

B.గెరాడస్‌ మెరేక్టర్‌

C.జియోవన్నీ బాటిస్టా అగ్నెస్‌

D.మార్టిన్‌వాల్డీ ముల్లర్

ఈ ప్ర‌శ్న‌కు మ‌యాంక్ ఎలాంటి త‌డ‌బాటు లేకుండా.. D.మార్టిన్‌ వాల్డీముల్లర్‌ ఆప్షన్‌ ఎంచుకుని రూ.కోటిని సొంతం చేసుకున్న తొలి జూనియర్‌ కంటెస్టెంట్‌గా నిలిచాడు. అనంతరం రూ.7 కోట్ల ప్రశ్నను ప్రయత్నించి షో నుంచి క్విట్‌ అయ్యాడు.

అభినంద‌న‌ల వెల్లువ‌!

మాయంక్‌కు హరియాణా సీఎం మనోహర్‌లాల్‌ ఖట్టర్ శుభాకాంక్షలు తెలిపారు. ‘జీనియస్‌’ అంటూ ప్రశంసలు కురించారు. ఒక సోష‌ల్ మీడియాలోనూ భారీ ఎత్తున మ‌యాంక్‌కు శుభాకాంక్ష‌లు వెల్లువెత్తాయి.