క్రేజీ ప్రాజెక్ట్ దక్కించుకున్న డ్రాగన్ బ్యూటీ
ఈ ఏడాది ఆరంభంలో 'డ్రాగన్' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ముద్దుగుమ్మ కయాదు లోహర్.
By: Tupaki Desk | 28 May 2025 9:00 PM ISTఈ ఏడాది ఆరంభంలో 'డ్రాగన్' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ముద్దుగుమ్మ కయాదు లోహర్. ప్రదీప్ రంగనాథన్ హీరోగా నటించిన డ్రాగన్ సినిమా సూపర్ హిట్‌గా నిలవడంతో కయాదు లోహర్ ఒక్కసారిగా స్టార్ హీరోయిన్‌గా మారింది. అంతకు ముందు తెలుగులో అల్లూరి అనే సినిమాలో నటించిన ఈ అమ్మడికి అంతగా గుర్తింపు దక్కలేదు. కానీ డ్రాగన్ సినిమాతో తెలుగులోనూ ఈమెకు మంచి పాపులారిటీ దక్కడం మాత్రమే కాకుండా టాలీవుడ్ నుంచి పిలుపు అందింది అనే వార్తలు వస్తున్నాయి. ఒకటి రెండు సినిమాలకు సంబంధించిన చర్చలు జరుగుతున్నాయి. అతి త్వరలోనే ఆ తెలుగు సినిమాలు ఏంటి అనే విషయంలో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.
ప్రస్తుతం తమిళ్‌లో రెండు మూడు సినిమాలు చేస్తున్న ఈ అమ్మడు తాజాగా మలయాళ సినిమాలో ఛాన్స్ దక్కించుకుంది. మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ నటిస్తున్న ఐయామ్ గేమ్ అనే సినిమాలో కయాదుకు ఛాన్స్ దక్కిందనే వార్తలు జోరుగా వస్తున్నాయి. మలయాళ సినిమా ఇండస్ట్రీలోనే కాకుండా దుల్కర్ సల్మాన్‌కి అన్ని భాషల్లోనూ అభిమానులు ఉన్నారు. ముఖ్యంగా టాలీవుడ్‌లో ఈయన చేసిన ప్రతి సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. అందుకే దుల్కర్ సల్మాన్ మలయాళంలో సినిమా చేస్తూ ఉన్నా కూడా తెలుగు ప్రేక్షకుల్లో ఆసక్తి ఉంటుంది. అలాంటి క్రేజీ స్టార్ సినిమాలో కయాదు నటించడం వల్ల కచ్చితంగా మంచి ఫలితం ఉంటుంది.
ప్రస్తుతం కయాదు చేస్తున్న సినిమాల్లో అన్నింటి కంటే దుల్కర్‌తో చేయబోతున్న సినిమా ఆమెకు స్టార్‌డం తెచ్చి పెడుతుంది అనే విశ్వాసం వ్యక్తం అవుతోంది. డ్రాగన్ సినిమాతో వచ్చిన పాపులారిటీని సద్వినియోగం చేసుకుంటూ ఉన్న కయాదు లోహర్ తక్కువ సమయంలోనే పాపులర్ స్టార్స్ సినిమాల్లో నటించే అవకాశాలు దక్కించుకుంటుంది. ముందు ముందు కూడా కయాదు లోహర్ సూపర్ హిట్ సినిమాల్లో నటించాలని అభిమానులు కోరుకుంటున్నారు. ఐయామ్ గేమ్ సినిమాలో దుల్కర్ సల్మాన్ హీరోగా నటించడం మాత్రమే కాకుండా నిర్మాతగానూ వ్యవహరిస్తున్నాడు. దాంతో సినిమాపై ఆయనకు ఉన్న నమ్మకం ఏంటో అర్థం చేసుకోవచ్చు.
2021లో ముగిల్పేట అనే కన్నడ సినిమాలో నటించడం ద్వారా ఇండస్ట్రీకి పరిచయం అయిన కయాదు లోహర్ మొదటి సినిమాతో ఆశించిన స్థాయిలో గుర్తింపు దక్కించుకోలేక పోయింది. 2022లో ఈ అమ్మడు మలయాళంలో ఒక సినిమా, తెలుగులో ఒక సినిమా చేసింది. సౌత్‌లోనే కాకుండా ఈ అమ్మడు మరాఠి సినిమాలో కూడా నటించింది. ప్రస్తుతం తమిళ్, మళయాల సినిమాల్లో నటిస్తున్న ఈ అమ్మడు వచ్చే ఏడాదిలో తెలుగు ప్రేక్షకుల ముందుకు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. త్వరలో ఈమె తమిళ్‌లో నటిస్తున్న ఇదయం మురళి సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఆ సినిమా తర్వాత కయాదు మరింత బిజీ అవుతుందనే విశ్వాసంను చిత్ర యూనిట్ సభ్యులు వ్యక్తం చేస్తున్నారు.
