Begin typing your search above and press return to search.

మాల్దీవుల ప్రపంచ పర్యాటక రాయబారి ఈ న‌టి

మాల్దీవుల పర్యాటక రంగానికి కత్రినా కైఫ్‌ను ప్రపంచ బ్రాండ్ అంబాసిడర్‌గా ఎంపిక చేసినట్లు ద్వీప దేశం ప్ర‌క‌టించింది.

By:  Tupaki Desk   |   10 Jun 2025 10:37 PM IST
మాల్దీవుల ప్రపంచ పర్యాటక రాయబారి ఈ న‌టి
X

మాల్దీవుల పర్యాటక రంగానికి కత్రినా కైఫ్‌ను ప్రపంచ బ్రాండ్ అంబాసిడర్‌గా ఎంపిక చేసినట్లు ద్వీప దేశం ప్ర‌క‌టించింది. క‌త్రిన త‌న అంద‌చందాలు, ఆకర్ష‌ణ‌తో పాటు అవార్డులు రివార్డులు అందుకున్న న‌టి. వ్య‌వ‌స్థాప‌కురాలిగా ప్ర‌పంచంతో క‌నెక్ట్ అయి ఉన్నారు. ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఉన్న టూరిస్టుల‌కు గొప్ప వార‌ధి కాగ‌ల‌రు! అని మాల్దీవుల ప‌ర్యాట‌క శాఖ ప్ర‌తినిధులు ప్ర‌శంసించారు.

భార‌తీయ సినిమాకు క‌త్రిన సేవ‌లు అస‌మానం. ఎన్నో ప్ర‌తిష్ఠాత్మ‌క సినిమాల్లో న‌టించి బ్లాక్ బ‌స్ట‌ర్లు అందుకుని, వినోద‌రంగానికి చేసిన సేవ‌లు అపార‌మైన‌వి అని పేర్కొన్నారు. మాల్దీవుల పర్యాట‌కానికి బ్రాండ్ అంబాసిడ‌ర్ గా త‌న‌ను ఎంపిక చేయ‌గానే క‌త్రిన స్పందిస్తూ `సన్నీ సైడ్ ఆఫ్ లైఫ్ గ్లోబల్ బ్రాండ్ అంబాసిడర్‌`గా త‌న‌ కొత్త పాత్రతో స‌రైన గౌరవం లభించిందని క‌త్రిన‌ కైఫ్ అన్నారు. మాల్దీవులు లగ్జరీ, సహజ సౌందర్యానికి పరాకాష్ట. ప్రశాంత వాతావ‌ర‌ణం ఈ దీవుల ప్ర‌త్యేక‌త‌.. అని క‌త్రిన‌ అన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న సందర్శకులకు ఉత్తమమైన ట్రావెలింగ్ ఎక్స్ పీరియెన్స్ ని మాల్దీవులు అందిస్తాని వ్యాఖ్యానించారు. క‌త్రిన‌ శక్తివంతమైన వ్యక్తిత్వం, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులతో క‌త్రిన బలమైన సంబంధం త‌న‌ను `సన్నీ సైడ్ ఆఫ్ లైఫ్‌`కు పరిపూర్ణ ప్రతినిధిగా అవ‌కాశం క‌ల్పించాయి.

నిజానికి మాల్దీవుల‌తో భార‌త‌దేశ స‌త్సంబంధాలు దెబ్బ తిన్న త‌రవాత ఆ దేశానికి టూరిజం ఆదాయం భారీగా త‌గ్గింద‌ని క‌థ‌నాలొచ్చాయి. అటుపై దిద్దుబాటు చ‌ర్య‌లు తీసుకున్నారు. ఇప్పుడు క‌త్రిన‌ను ప‌ర్యాట‌క శాఖ‌ అంబాసిడ‌ర్ గా ఎంపిక చేయ‌డం... స‌రిగ్గా మోదీ మాల్దీవుల‌ ప‌ర్య‌ట‌న‌కు ముందు ప్ర‌క‌టించ‌డం ఆశ్చ‌ర్య‌ప‌రిచింది. గత సంవత్సరం ప్రారంభంలో దౌత్యపరమైన ఉద్రిక్తత తర్వాత రెండు దేశాల మధ్య సంబంధాలు కరిగిపోయే ప‌రిస్థితి త‌లెత్తింది. ప్రధాని మోడీ సోషల్ మీడియాలో ల‌క్షద్వీప్ వెకేష‌న్ నుంచి వ‌రుస‌ ఫోటోలను పోస్ట్ చేసినప్పుడు పరిస్థితి మరింత దిగజారింది. మాల్దీవుల‌కు వ్య‌తిరేక ప‌వ‌నాలు వీచాయి. దేశ ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ ల‌క్ష‌ద్వీప్ ని ప్ర‌మోట్ చేసారు. మాల్దీవుల‌కు ఉత్త‌మ‌మైన ప్ర‌త్యామ్నాయం అని ప్ర‌చారం చేసారు. 7 జూన్ 2025 నాటికి మాల్దీవులను 10ల‌క్ష‌ల మంది విజిట్ చేసార‌ని ఆ దేశ ప‌ర్యాట‌క శాఖ ప్ర‌క‌టించింది.