Begin typing your search above and press return to search.

38 ఏళ్ల తర్వాత కశ్మీర్‌లో వెండితెర వెలిగింది

ఇమ్రాన్ హష్మి ప్రధాన పాత్ర పోషించిన ‘గ్రౌండ్ జీరో’ సినిమా ప్రిమియర్‌ను తాజాగా శ్రీ నగర్‌లో ప్రదర్శించారు.

By:  Tupaki Desk   |   19 April 2025 11:00 PM IST
Imran Hashmi’s Ground Zero Premieres in Srinagar
X

భూతల స్వర్గంగా పేరున్న కశ్మీర్‌‌లో అల్ల కల్లోల పరిస్థితుల వల్ల దశాబ్దాల తరబడి అక్కడ సినిమాల ప్రదర్శనే జరగలేదు. ఐతే గత కొన్నేళ్లలో అక్కడ ఉగ్రవాద కార్యకలాపాలు తగ్గి జనం ప్రశాంత జీవనం సాగిస్తుండడం, పర్యాటకుల సంఖ్య ఎంతో పెరగడం.. ఈ నేపథ్యంలో అక్కడ మళ్లీ సుదీర్ఘ విరామం తర్వాత వెండి తెర వెలిగింది. ఇమ్రాన్ హష్మి ప్రధాన పాత్ర పోషించిన ‘గ్రౌండ్ జీరో’ సినిమా ప్రిమియర్‌ను తాజాగా శ్రీ నగర్‌లో ప్రదర్శించారు. కొత్తగా నిర్మించిన ఐనాక్స్ థియేటర్లో ఈ సినిమా ప్రదర్శన జరిగింది.

కశ్మీర్‌లో ఓ థియేటర్లో సినిమా ప్రదర్శితం కావడం 38 ఏళ్ల తర్వాత ఇదే తొలిసారి కావడం విశేషం. ఈ కార్యక్రమంలో ఇమ్రాన్ హష్మితో పాటు నిర్మాత ఫర్హాన్ అక్తర్, హీరోయిన్ సయీ తమ్హాంకర్, ఇతర కాస్ట్ అండ్ క్రూ కూడా పాల్గొన్నారు. బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్, ఉన్నతాధికారులు, సిబ్బంది కూడా ఈ ప్రిమియర్‌కు హాజరయ్యారు.

ఫర్హాన్ అక్తర్ ‘ఎక్సెల్ ఎంటర్టైన్మెంట్’ బేనర్ మీద నిర్మించిన ఈ చిత్రాన్ని తేజస్ ప్రభ విజయ్ డైరెక్ట్ చేశాడు. ఇందులో ఇమ్రాన్ హష్మి.. నరేంద్ర నాథ్ ధర్ అనే బీఎస్ఎఫ్ కమాండర్ పాత్ర పోషించాడు. దేశ సరిహద్దుల్లో బీఎస్ఎఫ్ బలగాలు చేసే పోరాటం, వారికి ఎదురయ్యే సవాళ్ల నేపథ్యంలో ఈ కథ నడుస్తుంది. కశ్మీర్‌ ఒకప్పుడు తరచుగా ఉగ్రవాద దాడులతో అట్టుడికిపోయేది. భద్రత సిబ్బంది, ఉగ్రవాదుల మధ్య దాడులు ప్రతిదాడులతో జనజీవనం అస్తవ్యస్తంగా ఉండేది. రోజు వారీ జీవితమే అలజడితో సాగుతున్నపుడు అక్కడి జనం థియేటర్లకు వెళ్లి సినిమాలు చూసే పరిస్థితి ఎక్కడుంటుంది? అందుకే అక్కడ గతంలో ఉన్న థియేటర్లు శిథిలమైపోయాయి.

కొత్త థియేటర్లు కట్టలేదు. ఐతే 2014లో మోడీ సర్కారు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పరిస్థితులు మారాయి. ఉగ్రవాదులకు అడ్డు కట్ట పడింది. దాడులు తగ్గాయి. ఆర్టికల్ 370 రద్దు తర్వాత అక్కడి పరిస్థితుల్లో మరింత మార్పు వచ్చింది. ప్రస్తుతం పర్యాటకుల సంఖ్య బాగా పెరిగింది. సినిమా షూటింగ్స్, ఇతర కార్యకలాపాలు ఊపందుకున్నాయి. ఈ నేపథ్యంలోనే అక్కడ థియేటర్ కూడా నిర్మించి సినిమాల ప్రదర్శనను పున:ప్రారంభించారు.