Begin typing your search above and press return to search.

ఈ దర్శకుడిది ఆరంభ శూరత్వమే

ఇక కార్తీక్ చివరి సినిమా 'జిగర్ తండ డబుల్ ఎక్స్' కూడా అంచనాలను అందుకోలేకపోయింది.

By:  Tupaki Desk   |   2 May 2025 10:30 PM
ఈ దర్శకుడిది ఆరంభ శూరత్వమే
X

13 ఏళ్ల కిందట 'పిజ్జా' అనే చిన్న సినిమా రేపిన సంచలనం గురించి ఎంత చెప్పినా తక్కువే. క్యారెక్టర్ రోల్స్ చేసుకునే విజయ్ సేతుపతిని హీరోగా పెట్టి కేవలం 28 ఏళ్ల వయసులో కార్తీక్ సుబ్బరాజ్ అనే కొత్త దర్శకుడు హాలీవుడ్ హార్రర్ థ్రిల్లర్లకు ఏమాత్రం తీసిపోని రీతిలో ఆ సినిమాను రూపొందించి ప్రేక్షకులను మెస్మరైజ్ చేశాడు. తమిళంతో పాటు తెలుగులోనూ ఆ సినిమా అద్భుత స్పందన తెచ్చుకుంది. ఇక రెండో చిత్రం 'జిగర్ తండ' అయితే వేరే లెవెల్ అని చెప్పాలి. సిద్దార్థ్ రూపంలో స్టార్ దొరకడంతో ఈసారి ఇంకా గొప్ప సినిమా తీశాడు.

బాబీ సింహా చేసిన విలన్ పాత్రను మలిచిన తీరు గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. దీంతో కార్తీక్ మీద అమాంతం అంచనాలు పెరిగిపోయాయి. నవతరం గొప్ప దర్శకుల్లో ఒకడంటూ అతణ్ని అందరూ కొనియాడారు. స్టార్ హీరోలు అతడితో సినిమా చేయడానికి ముందుకొచ్చారు. కానీ తర్వాత వచ్చిన అవకాశాలను అతను ఉపయోగించుకోలేకపోయాడు. ప్రేక్షకుల నమ్మకాన్ని ప్రతిసారీ వమ్ము చేస్తూనే ఉన్నాడు.

తొలి రెండు చిత్రాలతో సెన్సేషన్ క్రియేట్ చేశాక కార్తీక్ ఒక్క సంతృప్తికరమైన సినిమా కూడా అందించలేకపోయాడు. 'ఇరైవి' అనుకున్నంతగా ఆడలేదు. ధనుష్‌తో తీసిన 'జగమే తంత్రం', రజినీకాంత్‌తో చేసిన 'పేట' తుస్సుమనిపించాయి. మధ్యలో విక్రమ్ హీరోగా 'మహాన్' సినిమా చేస్తే అది పర్వాలేదనిపించింది. కానీ థియేట్రికల్ రిలీజ్ స్కిప్ చేసి ఓటీటీలో మాత్రమే రిలీజైన సినిమా అది. మిగతా చిత్రాలతో పోలిస్తే అది నయమే అయినా థియేటర్లలో సందడి చేయలేకపోయింది.

ఇక కార్తీక్ చివరి సినిమా 'జిగర్ తండ డబుల్ ఎక్స్' కూడా అంచనాలను అందుకోలేకపోయింది. 'జిగర్ తండ'తో అస్సలు పోల్చలేని చిత్రమిది. కార్తీక్ లేటెస్ట్ మూవీ 'రెట్రో' గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. సూర్య లాంటి సూపర్ పెర్ఫమర్‌ దొరికితే అద్భుతాలు చేయడానికి అవకాశముంటుంది. కానీ ఒక కంగాళీ కథ తీసుకుని, కన్ఫ్యూజింగ్ నరేషన్‌తో ప్రేక్షకులకు తల బొప్పి కట్టించాడు కార్తీక్.

అసలు ఏ క్యారెక్టర్ ఏంటో తెలియదు. కథేంటో అర్థం కాదు. రెండున్నర గంటల పాటు తీవ్రంగా విసిగించి కార్తీక్‌కు దండం పెట్టించేసింది ఈ సినిమా. తొలి రెండు సినిమాలతో అద్భుతాలు ఆవిష్కరించాక.. ఆ స్థాయిలో మళ్లీ ఒక్క సినిమా కూడా తీయలేకపోయాడు కార్తీక్. అతను ఓవర్ రేటెడ్ డైరెక్టర్ అంటూ వస్తున్న విమర్శలకు 'రెట్రో' మరింత ఊతమిచ్చేలా ఉంది.