Begin typing your search above and press return to search.

సైయారా విజ‌యంతో శ్రీ‌లీల‌కు ఎస‌రు?

కార్తీక్ ఆర్యన్ - సౌత్ సెన్సేషన్ శ్రీలీల నటించిన రొమాంటిక్ చిత్రం ఆషిఖి ఫ్రాంచైజీలో అనధికారిక త్రీక్వెల్ అని ప్ర‌చారం సాగుతోంది.

By:  Tupaki Desk   |   24 July 2025 4:00 AM IST
సైయారా విజ‌యంతో శ్రీ‌లీల‌కు ఎస‌రు?
X

కార్తీక్ ఆర్య‌న్ లాంటి స్టార్ స‌ర‌స‌న ఆషిఖి ఫ్రాంఛైజీ చిత్రంతో శ్రీ‌లీల బాలీవుడ్ కి ప‌రిచ‌య‌మ‌వుతోంది. ఈ సినిమా చిత్రీక‌ర‌ణ శ‌ర‌వేగంగా పూర్త‌వుతోంది. అనురాగ్ బ‌సు ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ఈ ఏడాది చివ‌రిలో విడుద‌ల కావాల్సి ఉంది. అయితే ఇప్పుడు రిలీజ్ వ‌చ్చే ఏడాదికి వాయిదా ప‌డింద‌ని తెలిసింది.

కొత్త కుర్రాళ్లు అహాన పాండే- అనీతా ప‌ద్దా జంట‌గా న‌టించిన సైయారా బ్లాక్ బ‌స్ట‌ర్ విజ‌యం కార‌ణంగా శ్రీ‌లీల‌- కార్తిక్ ఆర్య‌న్ ల సినిమా వాయిదా ప‌డింద‌నేది గుస‌గుస‌. సైయారా తో కార్తీక్ సినిమాకి పోలిక‌లు చూడ‌టం ఖాయ‌మ‌ని కూడా గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. అయితే ఇది నిజ‌మా? అని ప్ర‌శ్నిస్తే దానికి ద‌ర్శ‌కుడు అనురాగ్ బ‌సు నుంచి ఆస‌క్తిక‌ర‌ స‌మాధానం ల‌భించింది.

సైయారా సినిమాతో కార్తీక్ సినిమాకి పోలిక‌లు చూడ‌టం స‌హ‌జం. కానీ మా సినిమా ఆలస్యానికి వేరే కార‌ణాలు ఉన్నాయి. నేను మెట్రో ఇన్ డినోతో బిజీగా ఉండ‌టం, అదే స‌మ‌యంలో కార్తీక్ .. కరణ్ జోహార్ చిత్రం `తు మేరీ మై తేరా, మై తేరా తు మేరీ`తో బిజీగా ఉన్నాడు. మేం త్వరలో మా తదుపరి షెడ్యూల్‌కు వెళ్తాము. వేగంగా సినిమాను పూర్తి చేయాల‌ని ల‌క్ష్యంగా పెట్టుకున్నాము! అని తెలిపారు.

కార్తీక్ ఆర్యన్ - సౌత్ సెన్సేషన్ శ్రీలీల నటించిన రొమాంటిక్ చిత్రం ఆషిఖి ఫ్రాంచైజీలో అనధికారిక త్రీక్వెల్ అని ప్ర‌చారం సాగుతోంది. మ్యూజికల్ డ్రామాలో కార్తీక్ మునుపెన్నడూ చూడని అవతారంలో క‌నిపిస్తాడ‌ని టాక్.

ఇంకా టైటిల్ నిర్ణ‌యించ‌ని ఈ సినిమా మొదట దీపావళికి విడుదల కావాల్సి ఉంది. అయితే తాజా క‌థ‌నాల ప్ర‌కారం 2026 లో మాత్రమే థియేటర్లలోకి వస్తుందని స‌మాచాం. సైయారా కార‌ణంగా ఇది ఆల‌స్య‌మ‌వ‌తోంద‌ని ప్ర‌చారం సాగుతోంది. కార్తీక్ ఆర్యన్ సినిమాలోని పాత్ర‌లు, ఇతివృత్తం ఒకే త‌ర‌హాలో ఉన్నాయ‌న్న టాక్ వినిపిస్తోంది. రెండు సినిమాలు వర్ధమాన గాయ‌కులు.. వారి జీవితాలలో ఏం జ‌రిగిందో తెలిపే చిత్రాలు.. ఈ పోలిక‌ల కార‌ణంగా అనురాగ్ - కార్తీక్ బృందం త‌మ స్క్రిప్టును మార్చి రీషూట్ చేయ‌బోతున్నార‌ని కూడా ప్ర‌చారం సాగుతోంది.

కానీ ఈ ప్ర‌చారాన్ని అనురాగ్ బ‌సు కొట్టి పారేసారు. అనురాగ్ మాట్లాడుతూ.. మోహిత్ సూరి చిత్రం కథ - స్క్రిప్ట్ గురించి కొంతకాలంగా తనకు తెలుసని అనురాగ్ బసు అన్నారు. రెండు చిత్రాలలో హీరోల పాత్ర‌ల‌కు పోలిక‌లు చూడ‌టం స‌హ‌జ‌మేన‌ని మాకు తెలుసు. కానీ రెండు చిత్రాలు ఒకదానికొకటి పూర్తిగా భిన్నంగా ఉంటాయి.. అని తెలిపారు. వేరే కార‌ణాల వ‌ల్ల మా సినిమా ఆల‌స్య‌మ‌వుతుంద‌ని వెల్ల‌డించారు.