Begin typing your search above and press return to search.

విశ్వనాథ్ అండ్ సన్స్.. గజినీ సూర్యను వెంకీ గుర్తు చేశారా?

రీసెంట్ గా హైదరాబాద్‌ లో జరిగిన కరుప్పు ప్రీ రిలీజ్ ఈవెంట్‌ కు కార్తీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

By:  M Prashanth   |   12 May 2026 9:37 AM IST
విశ్వనాథ్ అండ్ సన్స్.. గజినీ సూర్యను వెంకీ గుర్తు చేశారా?
X

కోలీవుడ్ స్టార్ హీరో సూర్య, టాలీవుడ్ దర్శకుడు వెంకీ అట్లూరి కాంబినేషన్‌ లో తెరకెక్కుతున్న విశ్వనాథ్ అండ్ సన్స్ సినిమాపై రోజురోజుకూ అంచనాలు పెరుగుతున్నాయి. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్ ప్రేక్షకుల్లో మంచి ఆసక్తి రేకెత్తించగా, తాజాగా హీరో కార్తీ చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా గజినీ సూర్యను మళ్లీ చూసినట్లు ఉందంటూ కార్తీ చేసిన వ్యాఖ్యలు అభిమానుల్లో కొత్త చర్చకు దారితీశాయి.

రీసెంట్ గా హైదరాబాద్‌ లో జరిగిన కరుప్పు ప్రీ రిలీజ్ ఈవెంట్‌ కు కార్తీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆ సమయంలో వేదికపై మాట్లాడిన ఆయన, అక్కడే ఉన్న దర్శకుడు వెంకీ అట్లూరిని ఉద్దేశిస్తూ విశ్వనాథ్ అండ్ సన్స్ గురించి ప్రస్తావించారు. రీసెంట్‌ గా వచ్చిన గ్లింప్స్‌ లో గజినీ టైమ్‌ లో ఉన్న అన్నయ్య సూర్యను మళ్లీ చూసినట్లు ఉందని కార్తీ తెలిపారు. అన్నయ్యను అలా చూపిస్తున్నందుకు థ్యాంక్స్ అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దీంతో ఒక్కసారిగా ఆ సినిమా చుట్టూ హైప్ మరింత పెరిగింది.

అసలు కార్తీ ఎందుకలా కామెంట్స్ చేశారన్నదే ఇప్పుడు ఫ్యాన్స్ మధ్య చర్చగా మారింది. ఎందుకంటే సూర్య కెరీర్‌ లో గజినీ ఒక మైల్ స్టోన్ మూవీ. 2005లో విడుదలైన ఆ సినిమా తమిళంతో పాటు తెలుగులోనూ భారీ విజయాన్ని అందుకుంది. షార్ట్ టర్మ్ మెమరీ లాస్‌తో బాధపడే వ్యక్తి తన ప్రేమికురాలి హత్యకు ఎలా రివెంజ్ తీర్చుకున్నాడనే కథతో తెరకెక్కిన ఆ చిత్రం అప్పట్లో సంచలనం సృష్టించింది.

ముఖ్యంగా సూర్య యాక్టింగ్, బాడీ ట్రాన్స్ఫర్మేషన్, ఎమోషనల్ పెర్ఫార్మెన్స్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. తెలుగు ప్రేక్షకుల్లో సూర్యకు ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ఏర్పడటానికి కూడా ఆ సినిమానే మెయిన్ రీజన్ గా చెప్పుకుంటారు. ఇప్పుడు విశ్వనాథ్ అండ్ సన్స్ గ్లింప్స్ చూసిన తర్వాత కార్తీకి అదే ఫీల్ వచ్చిందంటే.. సినిమాలో సూర్య రోల్ కచ్చితంగా పవర్‌ ఫుల్‌ గా ఉండొచ్చనే అంచనాలు ఇప్పుడు వ్యక్తమవుతున్నాయి.

అయితే ఈసారి కంప్లీట్ మాస్ యాక్షన్ కాకుండా, ఫ్యామిలీ ఎమోషన్స్‌ తో కూడిన కథలో సూర్య కనిపించనున్నట్లు తెలుస్తోంది. వెంకీ అట్లూరి సినిమాలకు ఉండే ఫ్యామిలీ సెంటిమెంట్, ఎమోషనల్ టచ్ విశ్వనాథ్ అండ్ సన్స్ లో కూడా స్ట్రాంగ్ గా ఉండబోతున్నాయని టాక్ వినిపిస్తోంది. ఇక విడుదల విషయంలో మేకర్స్ భారీ ప్లాన్ సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. ఆగస్టు 14న రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నారట. అలా చేస్తే ఇండిపెండెన్స్ డే హాలిడేకు తోడు వీకెండ్ కూడా కలిసి రావడంతో లాంగ్ రన్ కలెక్షన్లు సాధించే అవకాశం ఉంటుందని నిర్మాతల భావిస్తున్నట్లు చర్చ నడుస్తోంది.

ఇక సినిమాలో సూర్య సరసన మమితా బైజు హీరోయిన్‌ గా యాక్ట్ చేస్తోంది. ప్రేమలు సినిమాతో గుర్తింపు తెచ్చుకున్న మమితకు ఇది మంచి ఛాన్స్. ప్రముఖ నిర్మాణ సంస్థలు సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ ఆ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. మ్యూజిక్ ను జీవీ ప్రకాష్ కుమార్ అందిస్తున్నారు. ఏదేమైనా కార్తీ చేసిన గజినీ సూర్య కామెంట్స్‌ తో విశ్వనాథ్ అండ్ సన్స్ సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. అయితే ఫ్యామిలీ ఎమోషన్స్‌ కు సూర్య సూపర్ యాక్టింగ్ తోడైతే మూవీ బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ గా నిలిచే అవకాశం ఉందనే చెప్పడంలో డౌట్ అక్కర్లేదు.