డైలమాలో స్టార్లు.. మల్టీప్లెక్స్ బిజినెస్ ఇక కష్టమే
అయితే మల్టీప్లెక్స్ ల నిర్వహణా భారం తలకుమించినదని విశ్లేషకులు చెబుతున్నారు. రూ.300 పైగా టికెట్ ధర పలికినా గిట్టుబాటు కావడం లేదనే ఆందోళన వారిలో ఉంది.
By: Tupaki Desk | 16 July 2025 10:12 AM ISTఇటీవలి కాలంలో టాలీవుడ్ టాప్ స్టార్లు మల్టీప్లెక్స్ బిజినెస్ లో అడుగుపెడుతున్న సంగతి తెలిసిందే. మహేష్, ప్రభాస్, అల్లు అర్జున్, విజయ్ దేవరకొండ వంటి తెలుగు స్టార్లు మల్టీప్లెక్స్ స్క్రీన్ల నిర్మాణానికి భారీగా పెట్టుబడులు పెడుతున్నారు. ఏషియన్ సినిమాస్ తో కలిసి మహేష్, అల్లు అర్జున్, దేవరకొండ థియేటర్ల వ్యాపారంలో అడుగుపెట్టారు. వీరంతా విజయవంతంగా ముందుకు సాగుతున్నారు.
అయితే మల్టీప్లెక్స్ ల నిర్వహణా భారం తలకుమించినదని విశ్లేషకులు చెబుతున్నారు. రూ.300 పైగా టికెట్ ధర పలికినా గిట్టుబాటు కావడం లేదనే ఆందోళన వారిలో ఉంది. అయితే ఇలాంటి సమయంలో కర్నాటక ప్రభుత్వం తీసుకున్న ఓ ఆకస్మిక నిర్ణయం కకావికలం చేస్తోంది. ఇకపై మల్టీప్లెక్సులు, సింగిల్ స్క్రీన్లలో టికెట్ ధర రూ.200 కంటే ఎక్కువ ఉండకూడదనే నియమాన్ని ప్రతిపాదించింది. ఇది ఎక్కువమంది ప్రేక్షకుల్ని థియేటర్లకు రప్పించే వ్యూహం. కానీ ఎగ్జిబిటర్లకు కంటి మీద కునుకుపట్టనివ్వని నిర్ణయమని ఆందోళన వ్యక్తమవుతోంది. 200 టికెట్ ధర చాలా తక్కువ.
ఈ ధరలతో బెంగళూరు, హూబ్లీ లాంటి చోట్ల థియేటర్ల నిర్వహణ భారమవుతుందని విశ్లేషిస్తున్నారు. ఒకవేళ కర్నాటకలో టికెట్ ధరల ప్రకారం.. ఇరుగు పొరుగు భాషల్లోను ప్రభుత్వాలు అలాంటి నిర్ణయాన్ని అమలు చేస్తే ఇక మల్టీప్లెక్స్ రంగం కుదేలైపోతుందనే ఆందోళన ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ లో ప్రస్థావనకు వచ్చింది. ఇప్పుడు కర్నాటక ప్రభుత్వ నిర్ణయంపై కోర్టుకు వెళ్లేందుకు వారంతా సిద్ధమవుతున్నారని సమాచారం. ముఖ్యంగా కర్నాటకలోని బెంగళూరు సహా పలు నగరాల్లో తెలుగు తమిళ సినిమాలు బంపర్ కలెక్షన్స్ సాధిస్తాయి. టికెట్ ధర తగ్గింపుతో ఇప్పుడు ఆదాయాలు గణనీయంగా పడిపోతాయని ఆందోళన చెందుతున్నారు.
అకస్మాత్తుగా ప్రభుత్వాలు ఇలాంటి కొత్త రూల్స్ తో ఎగ్జిబిషన్ రంగంపై ఒత్తిడి పెంచితే, ఇకపై మహేష్ లేదా అల్లు అర్జున్, ప్రభాస్, దేవరకొండ లాంటి స్టార్లు మల్టీప్లెక్స్ రంగంలో పెట్టుబడులు పెట్టేందుకు ఆలోచించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. తద్వారా వారు తమ వ్యూహాలను మార్చుకుంటారని విశ్లేషిస్తున్నారు. ఏషియన్ సినిమాస్ కూడా ఇకపై దూకుడు కొనసాగించడం కుదరదు.
