Begin typing your search above and press return to search.

మరీ టూ మచ్.. కర్ణాటక జీవో ఇక్కడా కావాల్సిందేనా?

తెలుగులో ఏదైనా పెద్ద హీరో సినిమా రిలీజ్ అవుతుంటే ప్రేక్షకుల చూపంతా టికెట్ రేట్ పైనే ఉంటుంది.

By:  Tupaki Desk   |   17 July 2025 6:00 PM IST
మరీ టూ మచ్.. కర్ణాటక జీవో ఇక్కడా కావాల్సిందేనా?
X

తెలుగులో ఏదైనా పెద్ద హీరో సినిమా రిలీజ్ అవుతుంటే ప్రేక్షకుల చూపంతా టికెట్ రేట్ పైనే ఉంటుంది. గతంలో ఇలా లేకపోయినా, కొవిడ్ తర్వాత పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఒక్కో సినిమాకు మల్టీప్లెక్స్ ల్లో రూ.1000 కూడా దాటేసిన సందర్భాలు ఉన్నాయి. ప్రస్తుతం టాలీవుడ్ లో టికెట్ రేట్లు చర్చనీయాంశమయ్యాయి.

ఇటీవల కర్ణాటక ప్రభుత్వం సినిమా టికెట్ రేట్లపై దృష్టి పెట్టింది. ఈ క్రమంలోనే టికెట్ ధరలకు లిమిట్ పెట్టి సంచలనం నిర్ణయం తీసుకుంది. ఇకపై ఏ సినిమాకైనా మల్టీప్లెక్స్ ల్లో టికెట్ ధర రూ.200 కంటే ఎక్కువగా ఉండరాదని నిర్ణయించింది. ఈ మేరకు జీవో కూడా రిలీజ్ చేసింది. అయితే సౌత్ ఇండస్ట్రీలో మామూలుగా బెంగళూరులోనే టికెట్ రేట్ ఎక్కువగా ఉంటుంది.

అక్కడ మల్టీప్లెక్స్ ల్లో ఫ్లెక్సీ ప్రైసింగ్ అమల్లో ఉంది. అంటే సినిమా డిమాండ్ ను బట్టి టికెట్ రేటు ఎంత్తైనా పెంచుకోవచ్చు అన్నమాట. ఈ వెసులుబాటుతో కొన్ని సినిమాలకు రూ.800 నుండి రూ. 1000 వరకు కూడా టికెట్ రేట్ నిర్ణయించిన సందర్భాలు ఉన్నాయి. మల్టీప్లెక్స్ ల్లో బడా సినిమాలకు రూ.400 కంటే ఎక్కువ ఉండడంతో ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తోంది. అందుకే దీనిపై దృష్టి సారించిన ప్రభుత్వం ధర రూ.200 కంటే మించకూడదని నిర్ణయించింది.

ప్రభుత్వం నిర్ణయంతో డిస్టిబ్యూటర్లకు నష్టం జరుగుతుంది ప్రచారం సాగుతుంది. కానీ, టికెట్ ధర తగ్గితే థియేటర్ కు ప్రేక్షకులు ఎక్కువగా వస్తారు. దీంతో టికెట్ సేల్స్ పెరుగుతాయి. అంతిమంగా వాళ్లకే లాభం జరగవచ్చని అభిప్రాయాలు కూడా ఉన్నాయి. అయితే కర్ణాటకలో ధరలు తగ్గించడంతో ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ఏంటి పరిస్థితి అని ప్రేక్షకులు అనుకుంటున్నారు.

మరి తెలంగాణలో టికెట్ల రేట్లు చూసినట్లైతే.. సౌత్ లోనే అత్యధికంగా మల్టీప్లెక్స్ లో రూ.295, సింగిల్ స్క్రీన్స్ లో రూ.150 నుండి రూ .175 ఉంది. ఇక ఆంధ్రప్రదేశ్ లో మల్టీప్లెక్స్ ధర రూ.180 ఉండగా, సింగిల్ స్క్రీన్ లో టికెట్ రేటు రూ.112 నుండి 150 మధ్య ఉంది. అయితే సినిమాను బట్టి ఈ ధరల్లో మార్పులు ఉంటున్నాయి.

ఏపీలో కొన్ని సినిమాలకు తొలి వారం ఎక్స్‌ ట్రా రేట్లు ఉంటున్నాయి. మల్టీప్లెక్సు ల్లో రూ.75 నుండి రూ .100, సింగిల్ స్క్రీన్లలో రూ.50 నుండి రూ.75 పెంచుతున్నారు. ఇటు తెలంగాణలోనూ గతేడాది డిసెంబరు వరకు ఇష్టం వచ్చినట్లు రేట్లు పెంచేవారు. పుష్ప 2 అయితే ప్రీమియర్స్ కు ఏకంగా రూ.800 నుండి రూ.1200 దాకా ఉంది. కానీ ఆ తర్వాత పరిస్థితి మారింది.

ఇక చెన్నై విషయానికొస్తే, అదనపు రేట్లు లేవు. చాలా ఏళ్లుగా అక్కడ మల్టీప్లెక్స్ ధర రూ.190, సింగిల్ స్క్రీన్ ధర రూ.110 నుంచి రూ.150 ఉంది. కేరళలో మల్టీప్లెక్స్ టికెట్ రేట్ రూ.180, సింగిల్ స్క్రీన్ ధర రూ.130 నుండి రూ.150 మధ్యే ఉంది. అంటే ఈ లెక్కన తెలుగు రాష్ట్రాల్లోనే టికెట్ రేట్లు అధికంగా ఉన్నాయి. మామూలుగానే మన తెలుగు రాష్ట్రాల్లో ధరలు ఎక్కువగా ఉన్నాయి. అందులో పెద్ద సినిమాలకు రేట్ పెంచుకునే అనుమతి ఉండడంతో సామాన్యుడికి అధిక భారంగా మారింది. దీంతో థియేటర్ కు వచ్చే ప్రేక్షకుల సంఖ్య కూడా తగ్గిపోయిందన్నది నిజం!