హైకోర్టులో రణవీర్ కు రిలీఫ్.. ఏం జరిగిందంటే?
ఆ మూవీలోని దైవిక సీన్ ను అనుకరించి స్థానికుల ఎమోషన్స్ ను దెబ్బతీశారంటూ దాఖలైన పిటిషన్ పై కర్ణాటక హైకోర్టు తాజాగా కీలక ఆదేశాలు జారీ చేసింది.
By: M Prashanth | 24 Feb 2026 6:16 PM ISTబాలీవుడ్ నటుడు రణవీర్ సింగ్ కు కాంతార సినిమా వివాదంలో తాత్కాలిక ఊరట లభించింది. ఆ మూవీలోని దైవిక సీన్ ను అనుకరించి స్థానికుల ఎమోషన్స్ ను దెబ్బతీశారంటూ దాఖలైన పిటిషన్ పై కర్ణాటక హైకోర్టు తాజాగా కీలక ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుతం ఆయనపై ఎలాంటి అధికారిక చర్యలు తీసుకోవద్దని స్పష్టం చేసింది. అయితే కేసు విచారణకు పూర్తిగా సహకరించాలని సూచించింది.
వివరాల్లోకి వెళ్తే.. కన్నడ సినీ ఇండస్ట్రీలో సంచలనం సృష్టించిన కాంతార: చాప్టర్ 1 సినిమా దేశవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంది. ఆ చిత్రంలో పంజుర్లి దైవిక రూపం, భూతకోలా సంప్రదాయం ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఆ పాత్రలో దర్శకుడు, నటుడు రిషబ్ శెట్టి అద్భుతంగా నటించడంతో అన్ని వర్గాల ఆడియన్స్ నుంచి ఓ రేంజ్ లో రెస్పాన్స్ వచ్చింది.
అయితే గతేడాది గోవాలో జరిగిన ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా వేడుకల్లో రణవీర్ సింగ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కాంతార సినిమాపై మాట్లాడిన ఆయన, రిషబ్ శెట్టి నటనను ప్రశంసిస్తూ వేదికపై పంజుర్లి హావభావాలను అనుకరించారు. అయితే అలాంటి దైవిక రూపాన్ని అలా ప్రదర్శించడం సరైంది కాదని రిషబ్ శెట్టి అక్కడికక్కడే ఆయనకు చెప్పినట్టు సమాచారం.
అదే సమయంలో ఆ ఘటన సోషల్ మీడియాలో వైరల్ కావడంతో కొందరు కన్నడ సినీ ప్రియులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. తమ సంప్రదాయానికి సంబంధించిన పవిత్ర ఆచారాన్ని ఎంటర్టైన్మెంట్ గా చూపించడం తగదని విమర్శించారు. ఈ నేపథ్యంలో ఓ న్యాయవాది కోర్టును ఆశ్రయిస్తూ పిటిషన్ దాఖలు చేశారు. దైవ విశ్వాసాలను అవమానించేలా ప్రవర్తించారని, రణవీర్ పై చర్యలు తీసుకోవాలని కోరారు.
వివాదం పెరగడంతో రణవీర్ సింగ్ వివరణ ఇచ్చారు. "రిషబ్ శెట్టి యాక్టింగ్ పై ఉన్న అభిమానంతోనే ఆ హావభావాలు చేశాను. ఆ పాత్ర ఎంత కష్టమో తెలుసు. మన దేశ సంప్రదాయాలన్నింటికీ నాకు గౌరవం ఉంది. ఎవరికైనా నొప్పి కలిగితే క్షమించండి" అంటూ సోషల్ మీడియా ద్వారా క్షమాపణలు తెలిపారు. అయినప్పటికీ కేసు చట్టపరమైన దశకు చేరింది.
ఈ పిటిషన్ పై మంగళవారం విచారణ చేపట్టిన కర్ణాటక హైకోర్టు, తదుపరి ఆదేశాల వరకు రణవీర్ పై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని ప్రభుత్వానికి సూచించింది. దీంతో ఆయనకు తాత్కాలిక ఉపశమనం లభించింది. అయితే విచారణ కొనసాగుతుందని, అవసరమైతే కోర్టుకు హాజరుకావాలని ఆదేశించింది. ఏదేమైనా రణవీర్ కు చట్టపరంగా ఊరట లభించినప్పటికీ, కేసు తుది తీర్పు వచ్చేవరకు వివాదం కొనసాగనుంది. తదుపరి విచారణలో కోర్టు ఏ నిర్ణయం తీసుకుంటుందో చూడాల్సి ఉంది.
