30 వేల కోట్ల ఆస్తి వివాదం.. నటి కుమార్తె ఫీజు కట్టలేదట
ఓవైపు సంజయ్ కపూర్ మరణం అనుమానాస్పదం అని అతడి తల్లి రాణీ కపూర్ గతంలో వ్యాఖ్యానించారు.
By: Tupaki Desk | 16 Nov 2025 3:00 AM ISTనటి కరిష్మాకపూర్ మాజీ భర్త సంజయ్ కపూర్ లండన్ లో పోలో ఆడుతూ అస్వస్థతతో మృతి చెందిన సంగతి తెలిసిందే. అతడి మరణం తర్వాత దాదాపు 30,000 కోట్ల ఆస్తులకు సంబంధించి కుటుంబంలో గొడవలు రచ్చకెక్కాయి. సంజయ్ కపూర్ మాజీ భార్య కరిష్మాకపూర్ తన పిల్లలకు న్యాయబద్ధంగా దక్కాల్సిన ఆస్తి గురించి ప్రియా కపూర్(సంజయ్ చివరి భార్య) తో పోరాటం సాగిస్తున్నారు. ప్రియా ఆస్తి పత్రాలను ట్యాంపరింగ్ చేసి, ఆస్తులను తనపరం చేసుకుని, తమ పిల్లలకు దక్కాల్సిన ఆస్తిని దక్కకుండా చేస్తోందని కరిష్మాకపూర్ కోర్టులో వాదిస్తోంది.
ఓవైపు సంజయ్ కపూర్ మరణం అనుమానాస్పదం అని అతడి తల్లి రాణీ కపూర్ గతంలో వ్యాఖ్యానించారు. కోర్టు సమక్షంలో ఆస్తుల పంచాయితీ తేలేవరకూ ప్రియాకు ఆస్తులను ఖర్చు చేసే అధికారం ఇవ్వకూడదని కరిష్మా ఇంజెక్షన్ వేసింది. తాజాగా కరిష్మా న్యాయవాది కోర్టులో కొత్త వాదనను తెరపైకి తెచ్చారు. అమెరికాలో చదువుతున్న కరిష్మా కుమార్తె గత రెండు నెలలుగా తన విశ్వవిద్యాలయ ఫీజు చెల్లించలేకపోతున్నారని న్యాయవాది మహేష్ జెఠ్మలానీ జడ్జికి నివేదించారు. అయితే న్యాయస్థాన కార్యకలాపాలను డ్రమటిగ్గా మార్చవద్దని జస్టిస్ జ్యోతి సింగ్ న్యాయవాదిని అభ్యర్థించారు. కరిష్మా ఇద్దరు పిల్లలు కియాన్, సమైరా తరపున లాయర్ వాదిస్తూ, విద్యా ఖర్చుల బాధ్యత నేరుగా వివాహ డిక్రీ నుండి వస్తుందని, కుమార్తె ఫీజు పెండింగ్‌లో ఉందని వాదించారు. పిల్లల ఆస్తి ప్రియా కపూర్‌తోనే ఉందని, ఆమెను జవాబుదారీగా చూడాలని వాదించారు.
అయితే ప్రియా కపూర్ న్యాయవాది రాజీవ్ నాయర్ ఆ వాదనను పూర్తిగా తోసిపుచ్చారు. మైనర్ల ఖర్చు పెరిగిపోయిందని, దానిని కూడా ప్రియా చెల్లించారని, ప్రచారం కోసం మాత్రమే ఫీజు వివాదాన్ని ఉద్ధేశపూర్వకంగా తెరపైకి తెచ్చారని అన్నారు. అయితే ఇలాంటి వాదనలు కోర్టు సమయాన్ని వృధా చేస్తాయని ఇలాంటివి బెంచ్ కు చేరకుండా చూసుకోవాలని ప్రియా కపూర్ తరపున హాజరైన సీనియర్ న్యాయవాదికి కోర్టు జడ్జి గుర్తు చేశారు.
ప్రస్తుతం సంజయ్ కపూర్ ఆస్తులపై హక్కుల కోసం కోర్టులో పెద్ద పోరాటం సాగుతోంది. ఈ దావాలో సంజయ్ మూడవ భార్య ప్రియా కపూర్ మొత్తం ఎస్టేట్‌ను నియంత్రించడానికి డాక్యుమెంట్లను నకిలీ చేసిందని కరిష్మాకపూర్ ఆరోపిస్తున్నారు. 21 మార్చి 2025 నాటి వీలునామాలో వ్యక్తిగత ఆస్తులన్నింటినీ ప్రియా సచ్‌దేవ్ కపూర్‌కు బదలాయించడం ఆశ్చర్యపరిచిందని కరిష్మా తరపు న్యాయవాది వాదిస్తున్నారు. అయితే ఆ డాక్యుమెంట్ సరైనది.. అది ఒరిజినల్.. కుటుంబ వాట్సాప్ గ్రూప్ లోను షేర్ చేసారని అన్నారు. విచారణలో ఆ పత్రం విషయంలో సాక్ష్యాధారాలున్నాయని అన్నారు. హైకోర్టు నవంబర్ 19న విచారణను తిరిగి ప్రారంభిస్తుంది ..ఇంజక్షన్‌పై వాదనలను త్వరగా ముగించాలనుకుంటున్నట్లు సూచించింది.
కరిష్మా కపూర్-సంజయ్ కపూర్ జంట 2003లో ఒకటయ్యారు. 2016లో విడాకులు తీసుకున్నారు. ఆ తరువాత సంజయ్ ప్రియాను వివాహం చేసుకున్నారు.
